Narnoor: నార్నూర్ మండలంలో పరువు హత్య.. కన్నకూతురిని చంపిన తండ్రి అరెస్ట్!
Narnoor: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రిలో కుమార్తెను హత్య చేసి దహనం చేసిన తండ్రి ఆదే కైలాష్ను గురువారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Narnoor: నార్నూర్ మండలంలో పరువు హత్య.. కన్నకూతురిని చంపిన తండ్రి అరెస్ట్!
ఆదిలాబాద్ జిల్లా: నార్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమ్రి గ్రామంలో జరిగిన యువతి అనుమానాస్పద మృతి కేసులో నిందితుడైన ఆదే కైలాష్ ను ఈ రోజు (26.11.2026) నార్నూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ గురుస్వామి అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.
ఉమ్రి గ్రామానికి చెందిన ఆదే కైలాష్ కుమార్తె ఆదే కళ్యాణి 24.11.2026 తెల్లవారుజామున మృతి చెందినట్లు సమాచారం అందింది. అయితే, ఆమె తండ్రి ఆదే కైలాష్ బంధువులు వచ్చే వరకు వేచి చూడకుండా, అదే రోజు ఉదయం 09:00 గంటల లోపే మృతదేహాన్ని హడావుడిగా దహనం చేసినట్లు తెలిసింది.
ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తూ ఉమ్రి గ్రామ పంచాయతీ కార్యదర్శి భూమాని రాజన్న 25.11.2026న నార్నూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, ఆదే కళ్యాణికి వివాహం నిశ్చయమై, మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అయితే, ఆమె మరోక వ్యక్తిని ప్రేమిస్తున్న విషయం తెలుసుకున్న ఆమె తండ్రి ఆదే కైలాష్ కుటుంబ పరువు పోతుందనే ఆగ్రహంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
నిందితుడు విచారణలో వెల్లడించిన వివరాల ప్రకారం, 24.11.2026 తెల్లవారుజామున తన కుమార్తెను హత్య చేసిన అనంతరం, ఆమె మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించినట్లు తెలిపాడు. అనంతరం నేరానికి సంబంధించిన ఆధారాలను నాశనం చేసి, ఘటనను కప్పిపుచ్చే ఉద్దేశంతో బంధువులు వచ్చే వరకు వేచి చూడకుండా మృతదేహాన్ని హడావుడిగా దహనం చేసినట్లు దర్యాప్తులో ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసులో నార్నూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గురుస్వామి నిందితుడు ఆదే కైలాష్ ను 26.11.2026న అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో మరిన్ని సాక్ష్యాధారాలను సేకరించేందుకు పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.




