ఇంగ్లాండ్ జట్టు సాక్షిగా.. ఆగస్ట్ 14 క్రికెట్ కు ప్రత్యేకమైన రోజు!

ఇంగ్లాండ్ జట్టు సాక్షిగా.. ఆగస్ట్ 14 క్రికెట్ కు ప్రత్యేకమైన రోజు!
x
Highlights

అంతర్జాతీయ క్రికెట్ కు ఆగస్ట్ 14 ఒక ప్రత్యేకమైన రోజు. ఈరోజు ఒక క్రికెట్ దిగ్గజం తన ఆటకు విరామం ప్రకటించింది. మరో క్రికెట్ దిగ్గజం తన సెంచరీల వేటకు శ్రీకారం చుట్టింది. రెండిటికీ ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టు కావడం విశేషం.

క్రికెట్ కు ఆగస్ట్ 14కు ఒక అపురూపమైన సంబంధం వుంది. ఒక క్రికెట్ దిగ్గజం తన కెరీర్ ను ముగించుకున్నది ఆరోజే. మరో క్రికెట్ దేవుడు తొలిసారి సెంచరీ బాదింది ఈరోజే! ఆ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్‌ అయితే, క్రికెట్ దేవుడు మన సచిన్ టెండూల్కర్. ఆస్ట్రేలియా క్రికెట్ లో సంచలనం సృష్టించి.. ప్రపంచ స్థాయిలో క్రికెట్ బ్యాటింగ్ కి బెంచ్ మార్క్ గా ఇప్పటికీ నిలిచారు బ్రాడ్‌మన్‌. టెస్టుల్లో అద్వితీయ బ్యాటింగ్ సగటు అయన స్వంతం. 52 మ్యాచుల్లో 99.94 సగటుతో 6996 పరుగులు చేశారాయన. ఇప్పటికీ ఈ సరాసరి దరిదాపుల్లోకి కూడా ఏ బ్యాట్స్ మెన్ చేరుకోలేకపోయారు. ఈయన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ 1948లో యాషెస్ సిరీస్. సరిగ్గా ఆగస్ట్ 14న ఆ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆయన తన ఆటకు గుడ్ బై చెప్పారు. ఈ మ్యాచ్లో ఆయన డకౌట్ అయినా మ్యాచ్ మాత్రం ఆసీస్ గెలిచింది. తన చివరి మ్యాచ్ లో ఆయనకు ఇరు జట్లూ ఘనంగా వీడ్కోలు చెప్పాయి.

ఇక అంతర్జాతీయ క్రికెట్ లో వంద శతకాలు చేసిన సచిన్ టెండూల్కర్ తన సెంచరీల తొలి అడుగు వేసింది ఆగస్ట్ 14నే కావడం విశేషం. తన క్రికెట్ వారసుడిగా బ్రాడ్‌మన్ చెప్పుకున్న సచిన్ తన సెంచరీల వేటను.. సరిగ్గా క్రికెట్ దిగ్గజం తన ఆటను ఆపిన రోజున మొదలు పెట్టడం విశేషం. ఇది 1990లో జరిగింది. కాగా, ఈ సెంచరీ కూడా ఇంగ్లాండ్ మీద చేయడం మరో విశేషం. బ్రాడ్‌మన్ చివరి టెస్ట్ ఆడిన రోజు.. చివరి మ్యాచ్ ప్రత్యర్థి.. సచిన్ మొదటి సెంచరీ బాదిన రోజు.. ఆ సెంచరీకి ప్రత్యర్థి ఒక్కటే కావడం చెప్పుకోదగ్గదే. ఈ మ్యాచ్లో సచిన్ సెంచరీతో ఇండియా ఘోర అపజయాన్ని తప్పించుకుని మ్యాచ్ డ్రా చేసుకోగలిగింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories