ఫేకిస్థాన్ గా మారిన పాకిస్థాన్..ఫేక్ న్యూస్ తో...

ఫేకిస్థాన్ గా మారిన పాకిస్థాన్..ఫేక్ న్యూస్ తో...
x
Highlights

పాకిస్థాన్ ఒక్కసారిగా ఫేకిస్థాన్ గా మారిపోయింది. భారత్ పై సరిహద్దుల్లో గాకుండా సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించింది. ఈ ఫేక్ యుద్ధం ఎన్నో మలుపులు...

పాకిస్థాన్ ఒక్కసారిగా ఫేకిస్థాన్ గా మారిపోయింది. భారత్ పై సరిహద్దుల్లో గాకుండా సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించింది. ఈ ఫేక్ యుద్ధం ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే భారత్ తో జరిగిన మూడు యుద్ధాలు మరో మినీ యుద్ధంలో పాక్ ఓటమి చవిచూసింది. మరో దఫా యుద్ధం చేయలేని స్థితిలో ఉన్న పాకిస్థాన్ ఇప్పుడు ఒక్కసారిగా ఫేకిస్థాన్ గా మారిపోయింది. ఫేక్ న్యూస్ తో ఇంటర్నెట్ ను ముంచెత్తేందుకు ప్రయత్నిస్తోంది.

కశ్మీర్ పాత వీడియోలకు పాకిస్థాన్ లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ఎక్కడెక్కడి పాత వీడియోలనో తీసుకువచ్చి ఎడిట్ చేసి మార్ఫింగ్ చేసి ఇదీ ప్రస్తుత పరిస్థితి అంటూ వదంతులను వ్యాప్తి చేయడం అధికమైపోయింది. A KASHMIRI SISTER అంటూ పాకిస్థాన్ కు చెందిన అబ్దుల్లా గుల్ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ఆయన మరెవరో కాదు పాకిస్థాన్ ఐఎస్ఐ మాజీ చీఫ్ హమీద్ గుల్ కుమారుడు. అబ్దుల్ గుల్ షేర్ చేసిన వీడియో చూస్తుంటే తాజా పరిణామాల నేపథ్యంలో కశ్మీర్ లో హింసాకాండ ప్రారంభమైందా అనిపిస్తుంది. గాయపడిన కొందరిని పక్కకు తీసుకెళ్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. నిజానికి అది కొత్త వీడియో కాదు. అది 2018 అక్టోబర్ లో కుల్ గామ్ లో జరిగిన ఎన్ కౌంటర్ సందర్భంలోది. అబ్దుల్లా గుల్ ఒక్కడే కాదు మరెంతో మంది పాకిస్థానీయులు భారత్ పై సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించారు.

ఫేక్ న్యూస్ యుద్ధం చేయడంలో ఫేకిస్థాన్ రకరకాల వ్యూహాలు అమలు చేస్తోంది. పాకిస్థానీయులు కొందరు తమ సొంత అకౌంట్లను ఉపయోగిస్తూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. అంతటితో సరిపుచ్చుకోకుండా కశ్మీరీ నాయకుల పేర్లతో ఫేక్ అకౌంట్స్ ప్రారంభించి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. సయ్యద్ అలీ గిలానీ అనే వేర్పాటువాద నాయకుడి విషయంలో ఇలానే జరిగింది. ఆయన పేరిట మరెవరో కొత్త అకౌంట్ ప్రారంభించి విద్వేషప్రచారం ప్రారంభించారు. ఈ ఫేక్ అకౌంట్ తో విద్వేషం రెచ్చగొడుతున్నది పాకిస్థానీ సైన్యానికి చెందిన ఉన్నతాధికారి అసిఫ్ గఫూర్ అని వెల్లడైనట్లుగా తెలుస్తోంది. భారత సైన్యానికి, జమ్మూ కశ్మర్ పోలీసులకు మధ్య చిచ్చు పెట్టేందుకు కూడా కొందరు ప్రయత్నించారు. పాకిస్థాన్ మాజీ మంత్రి, సెనేటర్ రెహమాన్ మాలిక్ కూడా ఫేక్ వీడియోలను ప్రచారంలోకి తెచ్చేందుకు ప్రయత్నించడం చూస్తుంటే ఏ స్థాయిలోని వారైనా భారత్ పై దుష్ప్రచారానికి తెగబడుతారనే విషయం స్పష్టమవుతోంది. కశ్మీరీ పల్లెలపై భారత్ సైన్యం గన్ షిప్ హెలికాప్టర్లను ఉపయోగించిందని ఆయన ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని జమ్మూ కశ్మీర్ అధికారులు ట్విటర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక విదేశాల్లోని కొందరు కశ్మీరీ వేర్పాటువాదులు కూడా ఈ ఫేక్ న్యూస్ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు.

దేశంలో ఏదైనా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు అక్కడ ఇంటర్నెట్ తో సహా వివిధ కమ్యూనికేషన్లను నిలిపివేయడం ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ జరిగేదే. తాజాగా కశ్మీర్ విషయంలోనూ భారత్ అదే సూత్రం పాటించింది. మరో వైపున పాకిస్థాన్ మాత్రం తాను చేస్తున్న ఫేక్ యుద్ధంలో విజయం సాధిస్తాననే కలలు కంటోంది. భారత్ లోని ఇతర ప్రాంతాల్లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. భారత్ ఆ ప్రయత్నాలను ఎలా తిప్పికొడుతోంది అనేదే ఇప్పుడు ఆసక్తిదాయకంగా మారింది.

ఆర్టికల్ 370ని రద్దు చేసినా జమ్మూ కశ్మీర్ ను రెండు ముక్కలు చేసినా కశ్మీర్ ప్రాంతం ప్రశాంతంగా ఉండడం పాకిస్థాన్ కు మింగుడుపడడం లేదు. అందుకే ఫేక్ న్యూస్ యుద్ధానికి శ్రీకారం చుట్టింది. ఫేక్ న్యూస్ యుద్ధాలు కొత్తేమీ కాకపోయినా మునుపెన్నడూ లేనంత తీవ్రస్థాయిలో ఇప్పుడు సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతోంది. జర్నలిస్టుల పేరిట బూటకపు వార్తాకథనాలను కూడా ప్రచారంలోకి తీసుకువస్తున్నారు. వివిధ రకాల వదంతులు సృష్టిస్తున్నారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో వందకు పైగా అకౌంట్స్ పై భారత్ ఫిర్యాదు చేసింది. ఇక్కడ గమనించాల్సిన అంశాలు మరికొన్ని కూడా ఉన్నాయి. సాధారణంగా అంతర్జాతీయ సామాజిక మాధ్యమాలు వివిధ దేశాల ప్రభుత్వాలు చేసే ఫిర్యాదులపై వాస్తవాలను ధ్రువీకరించుకునే చర్యలు తీసుకుంటాయి. అవి అలా చర్యలు తీసుకుంటున్నాయంటే పాకిస్థాన్ ఫేక్ న్యూస్ వార్ ఎంతగా పెచ్చుమీరిపోయిందో అర్థమవుతోంది. భారత్ వివిధ సామాజిక మాధ్యమాల్లో పదుల సంఖ్యలో అకౌంట్స్ ను ఇప్పటికే బ్యాన్ చేయించింది. త్వరలోనే వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. అటుతిరిగి ఇటు తిరిగి ఈ ఫేక్ న్యూస్ యుద్ధం రేపటి నాడు సైబర్ వార్ గా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

భారత్- పాకిస్థాన్ ల మధ్య సైబర్ వార్ కొత్తేమీ కాదు. ఈ యుద్ధం చేసేందుకు పాకిస్థాన్ ప్రత్యేకంగా విద్యార్థులను, టెక్ నిపుణులను నియమించుకుంటోంది. గత కొద్ది రోజుల్లోనే సామాజిక మాధ్యమాల్లో పాకిస్థాన్ నుంచి వేలాది అకౌంట్లు కొత్తగా వచ్చాయి. ఈ అకౌంట్లలో కశ్మీర్ పైనే ప్రధానంగా చర్చ జరగడం గమనార్హం. భారత్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో అత్యధికం పాకిస్థాన్ నుంచే పుట్టుకొస్తోంది. ఇలా చేస్తున్న వారి అకౌంట్లను ట్రేస్ చేస్తున్న భారతీయ నిపుణులు పాకిస్థాన్ లోని ఏ ప్రాంతం నుంచి అవి పుట్టుకొస్తున్నాయో కూడా జియోగ్రాఫికల్ మ్యాపింగ్ చేస్తున్నారు. ఇక ఆగస్టు 14న పాకిస్థాన్ స్వాతంత్ర్య దినం, ఆగస్టు 15న భారత్ స్వాతంత్ర్య దినోత్సవం జరుగనున్నాయి. గతంలో ఇలాంటి సందర్భాల్లో రెండు దేశాల మద్య సైబర్ వార్ జరిగిన సంఘటనలున్నాయి. కశ్మీర్ అంశం నేపథ్యంలో అలాంటి సంఘటనలు మరిన్ని జరుగుతాయన్న అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. భారత్ సైబర్ నిపుణులు కొందరు ఆగస్టు 14న పాకిస్థాన్ అధికారిక వెబ్ సైట్లను హ్యాక్ చేసి భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భాలున్నాయి. పాక్ సైబర్ నిపుణులు సైతం భారతీయ వెబ్ సైట్లపై దాడులు చేస్తూనే ఉంటారు. నేటి సమాచార యుగంలో ఒక్క క్లిక్ తో ఒక వార్త విశ్వవ్యాప్తం అవుతోంది. మంచి కోసం ఉపయోగించుకోవాల్సిన ఈ సౌలభ్యాన్ని కొందరు చెడు కోసం ఉపయోగించుకుంటున్నారు. తాజాగా కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ చేస్తున్న సైబర్ యుద్ధ ప్రయత్నాలు బెడిసికొట్టే అవకాశం కూడా ఉంది. సైబర్ స్పేస్ లోనూ భారత్ విరుచుకుపడితే....పాకిస్థాన్ ప్రభుత్వానికి ఆ దేశ ప్రజల్లో ఉన్న కొద్ది పాటి గౌరవం కూడా మట్టిలో కలసిపోక తప్పదు. అన్ని విధాలుగా పాకిస్థాన్ వెనుకడుగు వేయాల్సిన సందర్భం వచ్చింది. ఆ విషయాన్ని పాకిస్థాన్ ఎంత త్వరగా గుర్తిస్తే అది ఆ దేశానికి అంత మంచిది అనడంలో సందేహం లేదు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories