Bhimavaram: ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల TET నిబంధనలు సవరించాలి!
Bhimavaram: ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ నిబంధనల్లో మినహాయింపులు ఇవ్వాలని ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి డిమాండ్. RTE సవరణ 23(1) అమలు చేయాలని విద్యాశాఖ మంత్రికి లేఖ.
Bhimavaram: ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల TET నిబంధనలు సవరించాలి!
Bhimavaram: ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిబంధనలు సాధారణ టెట్‌కు ఏమాత్రం భిన్నంగా లేవని, దీనివల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి పేర్కొన్నారు. 20-25 ఏళ్ల సుదీర్ఘ బోధనా అనుభవం ఉన్నవారికి, అలాగే 2011 కంటే ముందు నియమితులైన సీనియర్ ఉపాధ్యాయులకు కూడా టెట్ తప్పనిసరి చేయడం ఎంతమాత్రం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
2011 తర్వాతే టెట్ విధానం అమల్లోకి వచ్చినందున, విద్యా హక్కు చట్టం (RTE)లోని '23(1)' సవరణను తక్షణమే అమలు చేయాలని ఆయన కోరారు. ఈ సవరణను వర్తింపజేస్తే ఉపాధ్యాయుల సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయని స్పష్టం చేస్తూ విద్యాశాఖ మంత్రికి ఇప్పటికే లేఖ రాసినట్లు తెలిపారు. 50 నుండి 55 ఏళ్ల వయస్సులో పాఠశాల బోధనా బాధ్యతలు, కుటుంబ భారాలు మోస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత తరహాలో టెట్‌కు చదవడం తీవ్ర ప్రయాసతో కూడుకున్న విషయమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న కమ్యూనల్ అర్హత మార్కుల నిబంధనల (OC-90, BC-75, SC/ST-60) వల్ల ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అందరికీ టీచర్స్ ఎలిజిబిలిటీ ఉన్నందున కులాల వారీగా కాకుండా, అందరికీ కనీస అర్హత మార్కులు (ఉదాహరణకు 100కి 35 మార్కులు/35%) నిర్ణయించాలని లేదా కన్సర్న్డ్ సబ్జెక్టులో తగిన వెసులుబాటు కల్పించాలని కోరారు.
పరీక్షలో కన్సర్న్డ్ సబ్జెక్టుకు కేవలం 15-20 మార్కులు మాత్రమే కేటాయించి, మిగిలిన 130-135 మార్కులు సైన్స్, గణితం, సైకాలజీ, పెడగాజీ, ఇంగ్లీష్ వంటి ఇతర అంశాలకు ఇవ్వడం సీనియర్ ఉపాధ్యాయులకు భారంగా మారిందన్నారు. సిలబస్‌లో సంబంధిత బోధనా సబ్జెక్టుకు 80%, ఇతర అంశాలకు 20% మార్కులు ఉండేలా సవరించాలని సూచించారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్షలు రాయడం సీనియర్లకు ఇబ్బందికరంగా ఉన్నందున, ఆఫ్‌లైన్ ద్వారా మ్యాన్యువల్ రాత పరీక్ష నిర్వహించాలని కోరినా ప్రభుత్వం మినహాయింపు ఇవ్వకపోవడం విచారకరమన్నారు.
కఠిన నిబంధనల కారణంతో ఉపాధ్యాయులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి, అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని, స్వేచ్ఛాయుత వాతావరణంలో పాఠాలు చెప్పలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల మానసిక వేదనను అర్థం చేసుకుని, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) నిబంధనల ప్రకారం అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అనుమతులు తీసుకుని ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు తగిన వెసులుబాట్లు, మినహాయింపులు ఇవ్వాలని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (PDF) ఎమ్మెల్సీగా విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.