Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ-2026 ముసాయిదా జాబితా విడుదల. సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తులకు అవకాశం ఉన్నట్లు కలెక్టర్ స్నేహ శబరిష్ వెల్లడి.

Update: 2026-08-17 14:10 GMT

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

మహబూబాబాద్: ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం–2026లో భాగంగా 101-డోర్నకల్, 102 – మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను సోమవారం ప్రచురించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరిష్ ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలోని 571 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో మొత్తం 4,36,946 ఓటర్లు ఉన్నారని ఇందులో 101-డోర్నకల్ నియోజకవర్గంలో 2,05,083 మంది ఓటర్లు ఉన్నారని, 102 – మహబూబాబాద్ నియోజకవర్గంలో 2,31,863 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీరిలో 2,15,458 మంది పురుష ఓటర్లు, 2,21,449 మంది మహిళా ఓటర్లు, 39 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారని వెల్లడించారు.

ముసాయిదా ఓటర్ల జాబితాలో ప్రతి ఓటరూ తమ పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి సూచించారు. అర్హత కలిగిన పౌరుల పేరు ముసాయిదా జాబితాలో లేకపోయినా, ఇప్పటికే నమోదైన ఓటర్ల వివరాల్లో ఏవైనా తప్పులు, మార్పులు ఉన్నా నిర్ణీత గడువులోగా సంబంధిత దావాలు, అభ్యంతరాలు సమర్పించవచ్చని తెలిపారు.

ఈ ఓటర్ల జాబితా (ముసాయిదా) మీ మీ పోలింగ్ కేంద్రాలలో, మీ BLOల దగ్గర, స్థానిక తహశీల్దార్ (AERO) కార్యాలయంలో, ఆర్డీవో (ERO) కార్యాలయంలో లేదా కలెక్టర్ (DEO) కార్యాలయంలో లభిస్తుందని ఓటర్లు పని దినాలలో ఈ కార్యాలయాలకు వెళ్లి తమ వివరాలను ఎప్పుడైనా తనిఖీ చేసుకోవచ్చునని తెలిపారు.

ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకునేందుకు ఫారం-6, నమోదుపై అభ్యంతరం లేదా పేరు తొలగింపునకు ఫారం-7, ఓటరు వివరాల్లో సవరణలు చేసుకోవడానికి లేదా నివాసం మారిన సందర్భంలో నమోదు మార్పు కోసం ఫారం-8ను ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.

ఓటర్లు తమ దావాలు, అభ్యంతరాలను నేరుగా తమ పరిధిలోని *బూత్ స్థాయి అధికారి (బీఎల్‌ఓ)*కు సమర్పించవచ్చని తెలిపారు. అదేవిధంగా ఈసీఐనెట్ యాప్ లేదా ఓటర్ సర్వీస్ పోర్టల్ ద్వారా కూడా సంబంధిత దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించుకోవచ్చని పేర్కొన్నారు.

ఆఫ్‌లైన్‌లో దావాలు, అభ్యంతరాలను మహబూబాబాద్, తొర్రూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాలు, 101-డోర్నకల్, 102 – మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాలు, అన్ని పోలింగ్ కేంద్రాలలో సమర్పించవచ్చని తెలిపారు. దావాలు, అభ్యంతరాల సమర్పణకు సెప్టెంబర్ 16వ తేదీ వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు.

అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, ఓటర్ల వివరాలు ఖచ్చితంగా, పారదర్శకంగా ఉండేలా ప్రత్యేక సమగ్ర సవరణ–2026 ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

101-డోర్నకల్, 102 – మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరూ ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించి తమ పేరు, ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని, అవసరమైన సందర్భంలో సెప్టెంబర్ 16వ తేదీలోగా ఫారం-6, ఫారం-7 లేదా ఫారం-8 ద్వారా దావాలు, అభ్యంతరాలు సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరిష్ కోరారు.

Tags:    

Similar News