Visakhapatnam: వేద మంత్రోచ్ఛారణల నడుమ గణపతి హోమం, క్షీరాదివాసం!
Visakhapatnam: విశాఖ అల్లిపురం శ్రీ కేదార బద్రి నళిని నాగలింగేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన పూజలు వైభవంగా జరిగాయి. ఆదివారం ఉదయం 10.30 నుంచి భక్తులకు దర్శనం.
Visakhapatnam: వేద మంత్రోచ్ఛారణల నడుమ గణపతి హోమం, క్షీరాదివాసం!
Visakhapatnam: విశాఖ నగరంలోని అల్లిపురం నేరెళ్ల కోనేరు ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీ కేదార బద్రి నళిని నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం విశేష పూజాది కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం సమీపంలోని హోమశాలలో వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో పూజా కార్యక్రమాలు జరిగాయి.
తొలుత గణపతి పూజ, పుణ్యాహవచనం నిర్వహించి, అనంతరం శాస్త్రోక్తంగా అంకురారోపణ కార్యక్రమాన్ని చేపట్టారు. తదుపరి శ్రీ లక్ష్మీ గణపతి హోమం, అయ్యప్ప స్వామి హోమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలకు విశేష ఆరాధనలు జరిపించి, సంప్రదాయబద్ధంగా క్షీరాదివాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఆదివారం ఉదయం ఆలయంలో పరమశివుడి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. పరమశివుడితో పాటు పలువురు దేవతామూర్తుల విగ్రహాలను కూడా అదే రోజు ప్రతిష్ఠించి ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి భక్తులకు స్వామివారి తొలి దర్శనానికి అవకాశం కల్పించనున్నారు.