Burning Topic: భారీగా పడిపోయిన చమురు ధరలు? భారత్ కు గుడ్ న్యూస్?
Burning Topic: అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం. తగ్గుతున్న అంతర్జాతీయ చమురు ధరలు.
Burning Topic: భారీగా పడిపోయిన చమురు ధరలు? భారత్ కు గుడ్ న్యూస్?
Burning Topic: ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి సుమారు 100 రోజులుగా భీకరంగా సాగుతున్న అమెరికా, ఇరాన్ యుద్ధం మొత్తానికి ముగిసింది. రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ డీల్‌కి మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ కూడా ఈ విషయాన్ని ముందుగానే ప్రకటించింది. అయితే, ఇరాన్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో ఈ శాంతి ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నట్టయ్యింది. అయితే ఈ శాంతి ఒప్పందంతో కీలకమైన హర్మూజ్ జలసంధి మళ్లీ తిరిగి తెరుచుకుంటుందని ట్రంప్ ప్రకటించారు.
అమెరికా ఇన్నాళ్లపాటు విధించిన దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రపంచంలోని నౌకలన్నీ ఇకనుంచి యథేచ్ఛగా చమురు తరలించవచ్చంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ పోస్ట్‌లో తెలిపారు. ఈ డీల్‌కి మధ్యవర్తిగా వ్యవహరించిన పాకిస్థాన్ కూడా అధికారికంగా పోస్ట్ చేసింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. అయితే ఈ రెండు దేశాలు శాంతి ఒప్పందంపై వచ్చే శుక్రవారం స్విట్జర్లాండ్‌తో సంతకాలు చేయనున్నాయని పాక్ ప్రకటించింది. ప్రస్తుతానికి రెండు దేశాలు అత్యవసరంగా కాల్పుల విరమణకు, సముద్ర మార్గాలను పునరుద్ధరించడానికి అంగీకరించాయి. అత్యంత సున్నితమైన ఇరాన్ అణు కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై తదుపరి దశల్లో చర్చలు జరగనున్నాయి.
అమెరికా-ఇరాన్ ప్రతిపాదిత ఒప్పందంలోని కీలక అంశాలను ఓసారి చూద్దాం. ఇరాన్ చమురు, పెట్రో కెమికల్, దానికి సంబంధించిన ఎగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలను ఇకమీదట ఎత్తివేస్తారు. ఇరాన్ తన విదేశీ ఆర్థిక వనరులను, నిధులను తిరిగి పొందేందుకు వీలు కల్పించనున్నారు. ఇదివరకే స్తంభింపచేసిన ఇరాన్ చెందిన 24 బిలియన్ డాలర్ల నిధులను విడుదల చేయనున్నారు. ఈ మొత్తం నిధులలో మొదటి దశ కింద 12 బిలియన్ డాలర్లను వెంటనే రిలీజ్ చేస్తారు. యుద్ధం వల్ల దెబ్బతిన్న ఇరాన్ పునర్నిర్మాణం కోసం అమెరికా, దాని మిత్రదేశాలు సుమారు 300 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేయాలని ప్రతిపాదించారు.
ఇరాన్ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూ, దాని అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోబోమని అమెరికా హామీ ఇవ్వాలని షరతు విధించారు. ఇరాన్ సరిహద్దుల చుట్టూ మోహరించిన అమెరికా సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలి. అత్యంత ముఖ్యమైన, ప్రపంచ దేశాలు అల్లాడిపోయేలా చేస్తున్న హర్ముజ్ జలసంధిని 30 రోజుల్లోగా సాధారణ రవాణా కోసం ఇరాన్ తిరిగి తెరవనుంది. అణు కార్యక్రమంతోపాటు ఆంక్షలు, ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారానికి 60 రోజులపాటు అధికారిక చర్చలు కొనసాగుతాయి. అలాగే.. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం మేరకు ఎటువంటి అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని ఇరాన్ భరోసా ఇవ్వాలి. ఈ శాంతి ఒప్పందం అమలును పర్యవేక్షించడానికి ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అయితే తుది ఒప్పందానికి మాత్రం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదం కోసం ప్రయత్నించేందుకు ఉభయ దేశాలు అంగీకరించాయి.
మరోవైపు ప్రపంచ నౌకలారా.. మీ ఇంజిన్లు స్టార్ట్ చేయండి.. చమురును పారించండి' అంటూ ట్రంప్ పిలుపు ఇచ్చారు సరే.. అది ఇప్పటికిప్పుడు సాద్యమయ్యేనా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. హర్మూజ్ జలసంధి రవాణా వెంటనే ప్రారంభం అవుతుందా? అంటే కాదనే చెబుతున్నారు పరిశీలకులు. అమెరికా ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ.. ఇరాన్ ఇంకా కొన్ని పరిమితులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధికారులు చెప్పిన దాని ప్రకారం.. ఇరాన్ జలసంధి పరిసరాల్లో సముద్ర మైన్‌లు ఏర్పాటు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఈ హార్మూజ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే ముందుగా ఇరాన్ ఏర్పాటు చేసిన మైన్‌లు తొలగించాలి. ఆ తర్వాత దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు తిరిగి మరమ్మతులు చేయాలి.. చివరగా నౌకల భద్రతలపై హామీలు రావాలి.
ఆ తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో వాణిజ్య నౌకలు పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో చమురు కంపెనీలు తమ పూర్తిస్థాయి ఉత్పత్తిని పునరుద్ధరించి ప్రపంచ డిమాండ్‌ను అందుకోవడానికి మరికొన్ని నెలల సమయం పట్టనుంది. అప్పటివరకు మార్కెట్లో అస్థిరత ఉన్నప్పటికీ, ధీర్ఘకాలంలో చమురు ధరలు బాగా తగ్గుతాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఈ ఒప్పందం గురించి తెలియగానే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 3.95 శాతం క్షీణించి బారెల్‌కు 83.88 డాలర్లకు పడిపోయింది. భారతదేశం తన చమురు అవసరాలలో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. కాబట్టి క్రూడాయిల్ ధరలు తగ్గడం అంటే మన దేశానికి వేల కోట్లు ఆదా అవ్వడమేనని చెప్పొచ్చు. ఫలితంగా దేశీయంగా ఇంధన ధరలు తగ్గడమే కాకుండా, రవాణా ఖర్చులు తగ్గి నిత్యావసరాల ధరలు కూడా అదుపులోకి వస్తాయని భావిస్తు్న్నారు.
ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరిందన్న వార్తలు బయటకు వచ్చిన మరుక్షణం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అదే ఊపులో డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు ఇజ్రాయెల్ మీడియా ప్రకటించింది. ఈ శాంతి ఒప్పందాన్ని గౌరవించినప్పటికీ, లెబనాన్‌కు సంబంధించిన క్లాజుకు మాత్రం కట్టుబడి ఉండే ప్రసక్తే లేదని నెతన్యాహు తేల్చి చెప్పారు. ఫలితంగా ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో అమలు కావడంపై సందేహాలు మొదలయ్యాయి. ఈ ఒప్పందానికి నెతన్యాహు మోకాలడ్డుకోవడానికి కారణం లేకపోలేదు. బీరూట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తాజాగా హెచ్చరించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో కుదిరిన శాంతి ఒప్పందంలో లెబనాన్‌కు అనుకూలమైన నిబంధనలు ఉండటమే ఇజ్రాయెల్ అసంతృప్తికి కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో
అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంలో ప్రధానంగా యుద్ధం పూర్తిగా ముగిసిపోలేదని భావిస్తున్నారు. యుద్ధ విరమణను ప్రస్తుతానికి 60 రోజులు పొడిగించినట్లుగా భావించాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.