Burning Topic: 114 విమానాలు భారత్ లో తయారీ.. రాఫెల్ విమానం చరిత్రలో సరికొత్త మలుపు
Burning Topic: భారత్-ఫ్రాన్స్ మధ్య చారిత్రాత్మక రక్షణ ఒప్పందం. 114 రాఫెల్ యుద్ధ విమానాలు ఇకపై భారత్‌లోనే తయారీ.
Burning Topic: 114 విమానాలు భారత్ లో తయారీ.. రాఫెల్ విమానం చరిత్రలో సరికొత్త మలుపు
Burning Topic: జీ 7 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్ వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో సమావేశమయ్యారు. నీస్ నగరంలో ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమంలో మెక్రాన్‌ను మోదీ ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా భారత్, ఫ్రాన్స్ మధ్య సత్సంబంధాలు కొనసాగేలా ఇరువురు నేతలు సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో అత్యంత ప్రధానంగా వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఐదేళ్లలో రెట్టింపు చేసుకుని 3 లక్షల కోట్లకు చేర్చాలని భారత్, ఫ్రాన్స్ దేశాల అధినేతలు ఓ అంగీకారానికి వచ్చారు. అంతేకాక.. ఇరువురి చర్చల్లో మొత్తం 13 కీలక ఒప్పందాలు ఖరారయ్యాయి.
భారత వైమానిక దళం కోసం 3.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియకు సంబంధించి భారత్ సరికొత్త దౌత్య, రక్షణ చర్చలను వేగవంతం చేసింది. మోదీ, మెక్రాన్ తాజా ద్వైపాక్షిక చర్చల్లో ఈ మెగా రక్షణ ఒప్పందం ప్రధాన అజెండాగా నిలిచింది. ఈ ప్రతిపాదన ప్రకారం మొత్తం 114 విమానాలలో దాదాపు 90 నుంచి 94 విమానాలను 'మేక్ ఇన్ ఇండియా' చొరవ కింద ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థ ఒక భారతీయ భాగస్వామ్య కంపెనీతో కలిసి భారత్‌లోనే ఉత్పత్తి చేయనుంది. దీంతో రఫేల్ చరిత్రలో ఫ్రాన్స్ వెలుపల ఈ యుద్ధ విమానాలను తయారు చేయడం ఇదే తొలిసారి కానుంది.
మిగిలిన 18 నుంచి 24 విమానాలను మాత్రమే ఫ్రాన్స్ నేరుగా భారత్‌కు అందజేస్తుంది. రఫేల్ విమానాలలో కనీసం 50 శాతం వరకు భారతీయ సాంకేతికత, విడిభాగాలు ఉండేలా ప్రధాని ప్రణాళిక రచిస్తున్నారు. బ్రహ్మోస్, అస్త్రా వంటి స్వదేశీ క్షిపణులను రఫేల్ జెట్లలో సులభంగా అనుసంధానించేందుకు వీలుగా ఈ విమానాల 'సోర్స్ కోడ్‌ల'ను భారత్‌కు అందించేందుకు ఫ్రాన్స్ సానుకూలత వ్యక్తం చేసింది. భారత్ వద్ద ప్రస్తుతం ఉన్న రఫేల్ శ్రేణిని మరింత బలోపేతం చేస్తూ, సరికొత్త రఫేల్ F5 ఫీచర్లను అనుసంధానించడానికి ఫ్రాన్స్ అంగీకరించింది. ఇందులో అధునాతన శాటిలైట్ కమ్యూనికేషన్ లింకులతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్‌లను చేర్చనున్నారు. ఇది పైలట్ల నిర్ణయాత్మక సామర్థ్యాన్ని, యుద్ధ నైపుణ్యాన్ని భారీగా పెంచుతుంది.
ఇప్పుడు ప్రతిపాదించిన కొత్త 114 విమానాలు కూడా తోడైతే, భారత్ వద్ద మొత్తం రఫేల్ యుద్ధ విమానాల సంఖ్య 176కు చేరుకుంటుంది. ఈ ఒప్పందం ద్వారా చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎదురవుతున్న రక్షణ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత వైమానిక దళానికి బలమైన ఊరట లభించనుంది.
అలాగే.. జైతాపుర్ అణు ఇంధన ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక అంశాలపైనా ఇరువురు నేతలు చర్చించారు. ఫ్రాన్స్‌కు చెందిన న్యూక్లియర్ కంపెనీలు భారతీయ అణు రంగంలో నేరుగా పాల్గొనేందుకు, ప్రైవేటు రంగ కంపెనీలతో కలిసి పనిచేసేందుకు వీలుగా మంతనాలు జరిపారు. వాణిజ్యం పెంపుదలకు ఉన్నతస్థాయి యంత్రాంగం నెలకొల్పడం, నవకల్పనల్లో 2030 నాటికి మార్గసూచీ రూపకల్పన, వివిధ సంస్థల మధ్య 19 ఒప్పందాలకు సంతకాలు, ఏఐపై సంయుక్త బృందం ఏర్పాటు వంటివి ఇందులో ఉన్నాయట. విద్యార్హతల్ని పరస్పరం గుర్తించడంపైనా, ఒక దేశ విద్యార్థులు రెండో దేశంలో చదువుకోవడంపైనా మోదీ, మెక్రాన్ చర్చించారు.
నూతన విద్యా విధానం కింద ఫ్రెంచి విశ్వవిద్యాలయాలు భారత్‌లో క్యాంపస్‌లు నెలకొల్పాలని మెక్రాన్‌ను మోదీ కోరారు. ఏరోనాటిక్స్, అనుబంధ రంగాల్లో జాతీయ నైపుణ్య కేంద్రాన్ని కాన్పుర్‌లో నెలకొల్పేందుకు కూడా ఒక ఒప్పందం కుదిరింది. విమానయాన రంగంలో పరిశోధనలకు, సంస్థల మధ్య సమన్వయానికి ఇది వీలు కల్పిస్తుందని విమానయాన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పౌర అణు ఇంధనం, రక్షణ, భద్రత, శాంతి, వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, నవ్యావిష్కరణలు, విద్య, ప్రజల మధ్య సంబంధాలు సహా అనేక అంశాలపై మోదీ, మెక్రాన్ చర్చించుకున్నారు. ఇందులో హైస్పీడ్ రైల్వే సహకారం, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఒప్పందం.. పారిస్, నైస్ విమానాశ్రయాల్లో భారత యూపీఐ చెల్లింపులను విస్తరించడం వంటివి ప్రధానంగా ఉన్నాయి.
ప్రపంచం కనిపెట్టిన పరిష్కారాలను వాడుకునే ఒక వినిమయ దేశంగానే కాకుండా అలాంటి వాటిని స్వయంగా ఆవిష్కరించే దేశంగా భారత్ నిలుస్తోందన్నారు ప్రధాని మోదీ. కొత్తవి కనిపెట్టడం తమ డీఎన్‌ఏలోనే ఉందన్నారు. నీస్ నగరంలో ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించి ప్రసంగించారు. ‘సమ్మిళిత, మానవ కేంద్రంగా ఉండే సాంకేతికతల కోసం ప్రపంచం ఎదురుచూస్తోందన్నారు. నవ్యావిష్కరణలు, సమ్మిళితత్వం పరస్పర విరుద్ధమైనవి కావన్నారు. అవి ఒకదానితో ఒకటి ముడిపడినవని చెప్పుకొచ్చారు నరేంద్ర మోదీ. కొత్తగా ఒకటి ఆవిష్కరించడంలోనే కాదు.. అది మనుషులపై చూపే ప్రభావంలో దాని గొప్పతనం ఆధారపడి ఉంటుందని తెలిపారు.
కొత్త సాంకేతికతల్ని వాడుకునే దేశంగానే ఒక దశాబ్దం క్రితం వరకు భారత్‌ను ప్రపంచమంతా చూసేదని ప్రధాని వివరించారు. అయితే యావత్ మానవాళికి మేలుచేసే అనేక పరిష్కారాలను భారత్‌లోని యువ ఆవిష్కర్తలు కనుగొంటున్నారని గుర్తు చేశారు ప్రధాని మోదీ. భారత్ ఇన్నోవేట్స్ అసలుసిసలు లక్ష్యమంటే అదేనని వెల్లడించారు. కృత్రిమ మేధ, వాతావరణ మార్పుల్లోనూ రెండు దేశాలు భాగస్వామ్యం పంచుకుంటున్నాయని గుర్తు చేశారు.
ఫ్రాన్స్‌లో మెక్రాన్‌తో భేటీ అనంతరం సోషల్ మీడియాలో మోదీ షేర్ చేసిన ఓ సెల్ఫీ.. అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆ పోస్ట్‌లో మెక్రాన్‌తో కలిసి మోదీ దిగిన సెల్ఫీతోపాటు ప్రాస కలిసేలా పదాలు జోడించడం అబ్బుర పరిచింది. నైస్‌లో మిమ్మల్ని కలవడం నైస్‌గా అనిపించింది అంటూ మోదీ ఎక్స్‌లో ఆ సెల్ఫీ పోస్ట్ చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి మోదీ హాజరుకావడం ఫ్రాన్స్ దేశానికి దక్కిన గొప్ప గౌరవమని మెక్రాన్ అభివర్ణించారు. భారత అగ్రనేతగా నరేంద్ర మోదీ సుదీర్ఘ కాలం విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.