Off The Record: సౌత్ ఇండియాపై బీజేపీ ఫోకస్!

Off The Record: మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి ఇచ్చేందుకు బిజెపి అధిష్టానం కసరత్తు. తమిళనాడు లేదా తెలంగాణకు గవర్నర్‌గా పంపే అవకాశం!

Update: 2026-09-01 01:25 GMT

Off The Record: సౌత్ ఇండియాపై బీజేపీ ఫోకస్!

Off The Record: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ అధిష్ఠానం ఒక పెద్దపీట వేయనుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా సాగుతోంది. త్వరలో జరగబోయే గవర్నర్ల నియామకాల్లో భాగంగా ఆయనను తమిళనాడు లేదా తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించే అవకాశం ఉందంటూ జాతీయ, ప్రాంతీయ మీడియాలో కథనాలు రీసౌండ్ చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల, ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకునే బీజేపీ ఈ వ్యూహాన్ని అమలు చేయాలని యోచిస్తోందని రాజకీయ విశ్లేషకుల టాక్.

ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్‌గా, ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారికి సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని, వివాదరహిత శైలిని ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తోందట. ఇటీవల ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ 103 మంది కార్యవర్గ కమిటీలో కిరణ్‌కుమార్‌ను శాశ్వత ఆహ్వానితుడిగా నియమించారు ఆ పార్టీ పెద్దలు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన ఆయన, 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాజంపేట స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

సీనియర్ నేతలను రాజ్‌భవన్‌కు పంపే బీజేపీ సాంప్రదాయ వ్యూహం ప్రకారం.. రాయలసీమ రీజియన్‌కు ప్రాతినిధ్యం కల్పించేలా ఆయనకు ఈ కీలక పదవి ఇవ్వాలని అధిష్టానం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఉత్తరాంధ్రలోని విజయనగరం రాజకుటుంబానికి చెందిన సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజుకు ఇప్పటికే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గోవా గవర్నర్‌గా అవకాశం కల్పించింది. అలాగే కోస్తా ఆంధ్రా రీజియన్ నుంచి బలమైన చౌదరి సామాజిక వర్గానికి చెందిన దగ్గుబాటి పురందేశ్వరి ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా, ఎంపీగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అయితే రాయలసీమకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలన్న వ్యూహంతో బీజేపీ అధిష్టానం ఉందన్న ప్రచారం లేకపోలేదు. అందులోభాగంగా.. పార్టీ కేవలం ఒకే ఈక్వేషన్‌కు పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో బలమైన సామాజిక వర్గమైన కాపు కమ్యూనిటీకి కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చేలా కసరత్తు చేస్తోందట.

గతంలో ఇదే సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు లాంటి నేతలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వగా, రాబోయే సంస్థాగత మార్పులు లేదా ఇతర నామినేటెడ్ పదవుల్లో సమర్థులైన కాపు నేతలకు తగిన గుర్తింపు లభించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని మరింత విస్తరించేందుకు "బీజేపీ మాత్రమే ఏపీలో ఒక బీసీ నేతను సీఎం చేయగలదు" అనే నినాదాన్ని వినిపిస్తున్న ఆ పార్టీ నేతలు.. పీవీఎన్ మాధవ్‌ పేరును తెరపైకి తెస్తున్నారు. అంటే అటు ఓసీ, ఇటు బీసీ వర్గాలను సమతూకం చేసే ప్రయత్నం జరుగుతోందన్న మాట.

రాయలసీమలో బీజేపీకి ఓటు షేర్ పెంచుకోవడంతోపాటు రెడ్డి సామాజిక వర్గం మనసు దోచుకునే ప్రయోగంలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందంటున్నారు రాజకీయ మేధావులు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో రెడ్డి సామాజికవర్గం రాజకీయంగా అత్యంత బలీయమైనది.

అంతేకాక.. ఏపీలో వైసీపీ వైపు ఉన్న రెడ్డి సామాజికవర్గ ఓటర్లను, అలాగే కాంగ్రెస్ వైపు ఉన్న శ్రేణులను తమ వైపు తిప్పుకోవడానికి బిజెపికి ఒక బలమైన జాతీయ స్థాయి రెడ్డి నేత అవసరం ఏర్పడిందంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి రూపంలో ఆ శూన్యతను భర్తీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

కిరణ్ కుమార్ రెడ్డి రాయలసీమలోని చిత్తూరు జిల్లా ప్రాంతానికి చెందినవారు. రాయలసీమలో బిజెపికి కేడర్ పరంగా ఆశించిన స్థాయిలో బలం లేదన్న టాక్ లేకపోలేదు. దీంతో మాజీ సీఎం జగన్ కోటగా భావించే రాయలసీమలో ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న మాజీ సీఎంను ప్రమోట్ చేయడం ద్వారా అక్కడ పార్టీ ఉనికిని చాటుకోవచ్చని కూడా బిజెపి అంచనా వేస్తోందట.

అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డికి మంచి పరిపాలనా దక్షుడిగా పేరు ఉండటం, 'మాజీ సీఎం' ట్యాగ్, సుదీర్ఘ రాజకీయ, పరిపాలన అనుభవం బిజెపికి దక్షిణాది రాష్ట్రాల్లో మైలేజ్ ఇస్తుందని అధిష్టానం నమ్ముతోందట. పైగా రాయలసీమ సరిహద్దులు కర్ణాటకలోని బళ్లారి, కోలార్, చిత్రదుర్గ వంటి సరిహద్దు జిల్లాలు, తెలంగాణ ప్రాంతాలతో ముడిపడి ఉన్నాయి.

కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ఈ సరిహద్దు జిల్లాల్లోని రెడ్డి కమ్యూనిటీ నేతలను బిజెపిలోకి ఆకర్షించేందుకు ఆ పార్టీ పెద్దలు వ్యూహం పన్నినట్టు తెలుస్తోంది.

ఇలా ఉండగా.. కిరణ్ కుమార్‌ను తమిళనాడు గవర్నర్‌గా నిజంగానే పంపిస్తే.. అందుకు మరో బలమైన కారణం లేకపోలేదు. తమిళనాడులో టీవీకే పేరుతో సరికొత్త రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్‌కు, కిరణ్ కుమార్ రెడ్డికి కాలేజీ రోజుల్లో మంచి స్నేహబంధం ఉందట.

కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన నల్లారి కిరణ్‌ను గవర్నర్‌గా పంపడం ద్వారా విజయ్ ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించవచ్చని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాయలసీమకు చెందిన నల్లారికి తమిళ సంస్కృతి, రాజకీయాలపై ఉన్న అవగాహన అదనపు బలంగా మారుతుందనే అంచనా కూడా ఉందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

మొత్తంగా చూస్తే కేవలం ఆంధ్రప్రదేశ్ కోణంలోనే కాకుండా దక్షిణాదిలో సామాజిక సమీకరణాలు, ఒక హుందాతనమైన లీడర్‌షిప్‌ను ప్రొజెక్ట్ చేయడం కోసమే బిజెపి పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డికి పెద్దపీట వేసే ఛాన్స్‌ ఉందని ప్రచారం. ఈ ప్రచారం ఏ మేరకు నిజమవుతుందో.. చూడాలి మరి.

Full View


Tags:    

Similar News