Burning Topic: సెంట్రల్ ఏషియాతో భారత్ భారీ ఒప్పందాలు!

Burning Topic: మోదీ ఉజ్బెకిస్థాన్ పర్యటన: 11 ఒప్పందాలు, అత్యున్నత పురస్కారం 'దోస్తిక్', ఎస్‌సీవో సదస్సు వివరాలు.

Update: 2026-09-01 00:53 GMT

Burning Topic: సెంట్రల్ ఏషియాతో భారత్ భారీ ఒప్పందాలు!

Burning Topic: ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు రోజుల మధ్య ఆసియా దేశాల పర్యటనలో ఉన్నారు.. ముందుగా ఉజ్బెకిస్థాన్‌ రాజధాని తాష్కెంట్‌ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆ దేశ అధ్యక్షుడు షవకత్ మిర్జియోయెవ్ స్వయంగా సాదరంగా ఘన స్వాగతం పలికారు.

ఉజ్బెకిస్తాన్‌లో మోదీ పర్యటించడం ఇది నాలుగోసారి కావడం విశేషం. మోదీ రాకతో తాష్కెంట్‌లోని ప్రసిద్ధ హిల్టన్ హోటల్ సహా అనేక భవనాలను త్రివర్ణ రంగులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. తాష్కెంట్‌‌లో చేరుకున్న ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు.

'భారత్​ మాతా కీ జై' అంటూ నినాదాలతో ఆ ప్రాంతంమంతా మార్మోగిపోయింది. భారత్​, ఉజ్బెకిస్థాన్​ సంప్రదాయాల సమ్మేళనంతో కూడిన ఈ స్వాగతం ఇరుదేశాల సాంస్కృతిక సంబంధాలకు వేడుకగా నిలిచిందని మోదీ తెలిపారు. లాల్ బహదూర్ శాస్త్రి సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్ విద్యార్థులు ప్రదర్శించిన కథక్ ప్రదర్శనలను తిలకించి అభినందించారు.

మధ్య ఆసియాలో కీలక దేశమైన ఉజ్బెకిస్థాన్‌తో భారత్ తన వ్యూహాత్మక బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రధాని మోదీ 2 రోజుల ఉజ్బెకిస్థాన్ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్‌తో తాష్కెంట్‌‌లో ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, అరుదైన ఖనిజాలు, గనుల తవ్వకం, రక్షణ, భద్రత, వ్యవసాయం, ఔషధాలు, ఆరోగ్యం, సమాచార సాంకేతికత, యూపీఐ సహా డిజిటల్‌ వ్యవస్థలు, విద్య.. ఈ రంగాల్లో సహకారంపై చర్చలు సాగాయి.

11 ఒప్పందాలకు సంబంధించిన అవగాహన పత్రాలను ఇరు దేశాల బృందాలు పరస్పరం మార్చుకున్నాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 కోట్ల డాలర్లకు పెంచుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాల్ని 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం'గా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.

భారత్‌కు యురేనియం సరఫరాకు దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పారు ప్రధాని మోదీ. ఆయుధ ఉత్పత్తిలో రెండుదేశాల రక్షణరంగ పరిశ్రమలు పరస్పరం సహకరించుకుని సంయుక్త భాగస్వామ్యంతో పనిచేసేందుకు వీలుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పురస్కారం ‘ఒలియ్ దరాజాలి దోస్త్లిక్’ తో సత్కరించారు ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షావ్కత్‌ మిర్జియోయెవ్‌. విదేశీ నాయకులకు ఉజ్బెకిస్థాన్‌ ఇచ్చే అత్యున్నత పురస్కారాల్లో ఇదీ ఒకటి. రెండు దేశాల మధ్య స్నేహాన్ని బలోపేతం చేయడానికి చేసిన కృషికి గాను మోదీకి దీన్ని అందజేశారు.

ప్రధాని మోదీ రాక సందర్భంగా భారత పౌరుల కోసం ఉజ్బెకిస్థాన్‌ 30 రోజుల వీసా రహిత విధానాన్ని ప్రకటించింది ఉజ్బెకిస్థాన్‌. మిర్జియోయెవ్‌ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య పర్యాటకం, వ్యాపార సంబంధాలు, ప్రజల మధ్య అనుసంధానాన్ని పెంచడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపారాయన

ఉజ్బెకిస్థాన్ పర్యటన సందర్భంగా తాష్కెంట్‌లోని దిగంగత భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అక్కడ ఉన్న శాస్త్రి స్మారకాన్ని సందర్శించారు. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడితో కలిసి అక్కడ మొక్క నాటారు మోదీ.

లాల్ బహదూర్ శాస్త్రి 'జై జవాన్, జై కిసాన్' నినాదం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని, ఆయన జీవితం నిరాడంబరతకు, ధైర్యానికి, దేశభక్తికి ప్రతీక అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా పేర్కొంది. భారత రెండో ప్రధానిగా పనిచేసిన శాస్త్రి 1966 జనవరి 11న తాష్కెంట్‌లోనే కన్నుమూశారు.

1965 ఇండో- పాక్ యుద్ధానికి ముగింపు పలికేందుకు చారిత్రాత్మక తాష్కెంట్ డిక్లరేషన్‌పై సంతకం చేసిన కొన్ని గంటలకే ఆయన మరణించారు. ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్​లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు మోదీ. యోగా రెండు దేశాలను మరింత దగ్గర చేసి స్నేహాన్ని బలపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉజ్బెకిస్థాన్ పర్యటన ముగిసిన తర్వాత షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు కిర్గిజిస్థాన్‌ చేరుకున్నారు ప్రధాని మోదీ. బిష్కెక్ విమానాశ్రయంలో కిర్గిజ్‌స్థాన్ క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్ చైర్మన్ అకిల్‌బెక్ కసిమాలివ్ ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీకి అక్కడి ప్రజలు 'వందేమాతరం' నినాదాలతో స్వాగతించారు.

కిర్గిజిస్థాన్‌అధ్యక్షుడు సదర్ జపరోవాతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై నేతలు చర్చించారు. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ప్రధాని మోదీ ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ తో భేటీ అయ్యారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇద్దరూ కలవడం ఇదే తొలిసారి.

ఈ సమావేశంలో యుద్ధం ముగింపు, హర్మూజ్‌ జలసంధి దిగ్బంధనం వంటి కీలక అంశాలపై చర్చించారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పే లక్ష్యంతో చేపట్టే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతు ఉంటుందని మోదీ హామీ ఇచ్చారు.

కాగా కిర్గిజిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌ వేదికగాప్రారంభమయ్యే రెండు రోజుల షాంఘై సహకార సంస్థ సదస్సు ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఒకే వేదికపైకి రానుండటంతో..

సరిహద్దు ఉద్రిక్తతల నుంచి ఉక్రెయిన్‌ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం వరకు కీలక అంశాలపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్న ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మోదీ-జిన్‌పింగ్‌ భేటీపై అందరి చూపూ నిలిచింది.

ఎస్‌సీవో ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సదస్సుకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రాంతీయ భద్రత, ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం, అంతర్జాతీయ నేరాలు వంటి అంశాలతో పాటు వాణిజ్యం, ఇంధనం, రవాణా అనుసంధానం, డిజిటల్‌ సహకారంపై నేతలు చర్చించనున్నారు.

Full View

 

Tags:    

Similar News