Jordar Varthalu: మీరు తింటున్నది ఎన్నిరోజుల కింది బిర్యానీ!
Jordar Varthalu: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని లక్కీ బిర్యానీ సెంటర్‌లో కుళ్ళిన ఆహారం కలకలం. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన 80 బిర్యానీ ప్యాకెట్లను గుర్తించిన పోలీసులు.
Jordar Varthalu: మీరు తింటున్నది ఎన్నిరోజుల కింది బిర్యానీ!
Jordar Varthalu: తెల్లనివన్నీ పాలు గాదు.. నల్లనివన్నీ నీళ్లు గాదు అన్నట్టు.. వేడి వేడిగ పొగలు గక్కేటి బిర్యానీని సూశి ఫ్రెష్ బిర్యానీ అనుకుంటె పప్పుల కాలేశినట్టేనుల్లో. అగో ఇదెక్కడి కతంటరా.?.. అవ్ మరి.. ఎవ్వలకెర్క మొన్న జేశిన బిర్యానీని ఫ్రిజ్జి అర్రల దాశిపెట్టి, ఆన్లైన్ ఆర్డర్ రాంగనే వేడి జేశి పంపుతున్నరు కావచ్చు. ఆకలి రుచి ఎరగదన్నట్టు ఆవురావురుమని మనం తింటున్నం గావచ్చు. కావచ్చు గాదు.. ఇగో అట్లనే జేశి పాడువడ్తున్నరట బంజారాహిల్సు రోడ్డు నెంబరు రొండుల ఉన్న లక్కీ అనేటి బిర్యానీ సెంటర్ను నడ్పుతున్న బద్మాష్గాళ్లు. అదే ఏరియాల వెంకటరమణ కాలనీలుండేటి కొండారెడ్డి అనేటాయినె ఐతారం బిర్యానీ ఆర్డర్ వెడ్తె ఈ పాశిపేయిన బిర్యానీ కథ బైటవడ్డది. బిర్యానీ పొట్లం ఇప్పి సూడంగనే గుప్పుమన్నదట కంపు వాసన కాకాకు. కుల్లిపోయి ఉన్నదట మాంసమంత.
బంజారాహిల్సు పోలీస్ స్టేషన్ల ఫిర్యాదైతె అప్పటికప్పుడు లక్కీ బిర్యానీ సెంటర్కువొయ్యి తనిఖీలు జేశిర్రు పోలీస్లు. అగసూడుర్రి ఎన్నొద్దుల కింద వండిర్రో, ఫ్రిజ్జిల ముద్దుగ దాశిపెట్టిర్రు గదా. గివ్వే పార్సల్లను ఆర్డర్ అచ్చినకొద్ది వేడి జేసుకుంట పంపుతున్నరట. 80 ప్యాకేట్లదాంక దొర్కినయి. హోటలు సుతం ఎంత శుభ్రంగున్నది సూడుర్రి మల్ల. ఎల్కలు, బొద్దింకలు ఓపక్క.. కమ్మటి కంపు వాసన ఇంకోపక్క. గలీజ్ కు కేరాఫ్ అడ్రసే పోన్రి. హోటలు యజమాని ఇర్ఫాన్ అనేటోని ఇగురమట గిది. తయాజ్జేసేది జీడిమెట్ల.. అమ్మేది బంజారాహిల్సు. పాడుగాకుంట ఫ్రిజ్జి, వేడి వేడిగ అందిచ్చేతందుకు ఓవెన్ మిషిని. ఐపాయే.. ఖేల్ ఖతమ్.. తిన్నొల్ల దుకాణం బందు. బంజారాహిల్సులనే అమ్మి పాడువడ్తున్నరో..లేక జీడిమెట్లల తయార్జేశి పట్నమంత గిదే కథ నడిపిస్తున్నరో.. పోలీస్లు విచారణల తేలాలే ఈల్ల కతేందో ఇగ. ఇప్పటికైతె యజమాని మీద క్రిమినల్ కేసు రాశి హోటల్ను సీజు శేశిర్రు. ఫుడ్ సేఫ్టీ అధికార్లు సుతం జేశిర్రట తనిఖీలు. ఏదేమైనా బిర్యానీ లవ్వర్స్ సూత్తార్రానుల్ల.. మెర్శేదంత బంగారం గాదు.. వేడి వేడిగున్నదల్ల అదే రోజు జేశిన బిర్యానీ గాదు.. పానం పైలం.. ఆ.