Burning Topic: అటు రష్యా ఇటు అమెరికా.. భారత్ పై వరాల జల్లు

Burning Topic: అమెరికాతో వాణిజ్య ఒప్పందం, రష్యాతో యుద్ధ విమానాల తయారీ.. భారత్ కు దక్కుతున్న బంపర్ ఆఫర్లు ఏంటి?

Update: 2026-06-06 01:15 GMT

Burning Topic: అటు రష్యా ఇటు అమెరికా.. భారత్ పై వరాల జల్లు

Burning Topic: భారత్- అమెరికాల మధ్య మధ్యంతర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఇటీవల వేగం పుంజుకున్నాయి. అమెరికా ప్రతినిధి బృందం ఈ వారం ఢిల్లీకి వచ్చి నాలుగు రోజుల పాటు వాణిజ్య చర్చలు జరిపింది. ఈ చర్చల్లో అమెరికా బృందానికి బ్రెండాన్‌ లించ్‌ నాయకత్వం వహించగా.. భారత్‌ తరఫున వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి దర్పణ్‌ జైన్‌ నేతృత్వం వహించారు.ఇరుదేశాల అధికారులు వస్తు వాణిజ్యం, నాన్‌- టారిఫ్‌ చర్యలు, కస్టమ్స్, వాణిజ్య సరళీకరణ తదితర అంశాలపై కూలంకశంగా చర్చించుకున్నారు.. భారత్, అమెరికా ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే విధంగా పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవాలన్న లక్ష్యంతో చర్చలు సాగాయని మన వాణిజ్య శాఖ అధికారులు తెలిపారు. తొలి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం లో చాలా వరకు అంశాలను ఇరుదేశాలు ఖరారు చేసుకున్నాయని వాణిజ్య మంత్రి పీయూశ్‌ గోయల్‌ ఇటీవల తెలిపారు.

గతేడాది డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా వచ్చిన తర్వాత భారత్‌ మీద ఏకంగా 50 శాతం దాకా వాణిజ్య సుంకాలు వేయడంతో ఇరు దేశాల సంబంధాల్లో ప్రతిష్టంభన ఏర్పడటం తెలిసిందే. ఆ తర్వాత అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ ప్రవేశపెట్టిన కొన్ని పరస్పర సుంకాల విధానాలపై కీలక తీర్పు ఇవ్వడంతో పరిస్థితులు మారాయి. అనంతరం అమెరికా అన్ని దేశాలపై తాత్కాలికంగా 10 శాతం సుంకాలు విధించే నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్-అమెరికా వాణిజ్య చర్చలు కొత్త కోణంలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాలు మధ్యంతర ఒప్పందం దిశగా ముందుకు సాగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అనంతరం ట్రేడ్ డీల్‌కు సంబంధించిన ప్రాథమిక రూపురేఖలు ఖరారయ్యాయి. ఆ ఒప్పందం ప్రకారం భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలను తగ్గించే అంశం కూడా చర్చకు వచ్చింది.

భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. . భారత్‌తో తమ సంబంధాలు బలంగా ఉన్నాయని, పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఒప్పందం కుదురుతుందని తెలిపారు. ప్రధాని మోదీ నాకు మిత్రుడు. మేమిద్దరం మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాం. అందుకే భారత్‌తో తప్పకుండా ఒక ఒప్పందానికి చేరుకుంటామని చెప్పారు. గతంలో భారత్ అమెరికా కంపెనీలపై భారీ స్థాయిలో సుంకాలు విధించిందని, అమెరికా మాత్రం పెద్దగా సుంకాలు వసూలు చేయలేదని ట్రంప్ ఆరోపించారు. భారత్ చాలా కాలం పాటు అమెరికా విధానాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకుందని ట్రంప్ అన్నారు. "అమెరికా కంపెనీలపై భారత్ భారీ సుంకాలువిధించింది. కానీ మేము వారి ఉత్పత్తులపై అలాంటి భారం వేయలేదు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. భారత్‌తో వాణిజ్యం ద్వారా అమెరికా మంచి ఆదాయం పొందుతోంది" అని వ్యాఖ్యానించారు.

కాగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములుగా ఉన్న భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరితే ద్వైపాక్షిక వాణిజ్యానికి కొత్త ఊపు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తయారీ, వ్యవసాయం, టెక్నాలజీ, ఫార్మా రంగాలకు ఈ ఒప్పందం ప్రయోజనం చేకూర్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోదీతో తన వ్యక్తిగత సన్నిహిత్యాన్ని ప్రస్తావిస్తూ, భారత్‌తో వాణిజ్య ఒప్పందం కచ్చితంగా కుదురుతుందని ఆయన చెప్పడం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చలకు మరింత బలం చేకూర్చే అంశంగా మారింది. భారత్, అమెరికా ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే విధంగా పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవాలన్న లక్ష్యంతో ఇరు దేశాల అధికారులు పని చేస్తున్నారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, మార్కెట్ యాక్సెస్ అంశాలపై ఇరు దేశాలు విస్తృతంగా చర్చించారు.

సరిగ్గా ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత్‌తో సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అమెరికాతో భారత్‌ సంబంధాలు పెరుగుతున్నంత మాత్రాన దీర్ఘకాలం నుంచి భారత్‌తో తమకున్న సంబంధాలు తగ్గిపోవన్నారు. రష్యాతో సంబంధాల విషయంలో ప్రధాని మోదీపై ఒత్తిడికి ప్రయత్నాలు చేయడం వ్యర్థమని, అది ప్రపంచంలో అస్థిరతకు దారితీస్తుందని చెప్పారు. భారత్‌ మాకు విశ్వసనీయ భాగస్వామి. . కాలపరీక్షను తట్టుకుని నిలిచిన భారత్‌-రష్యా సంబంధాలపై ఏ విధమైన ప్రభావం పడదు. భారత్‌ గొప్పదేశం. అక్కడి ప్రజాస్వామ్యం గొప్పది, స్వతంత్ర విదేశాంగ విధానం ఉంది. తమ దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ దేశాలతో అది సంబంధాలు పెంచుకుంటోంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌ నిలుస్తోంది. మోదీ నేతృత్వంలోని సర్కారు కష్టపడి చేస్తున్న పనికి ఫలితం ఇది. రాబోయే ఏళ్లలో భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం విస్తరించి, 100 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని భావిస్తున్నానని పుతిన్‌ చెప్పారు.

మరోవైపు వైమానిక దళాన్ని బలోపేతం చేసే దిశగా ఐదోతరం యుద్ధ విమానాన్ని అమ్ములపొదిలో చేర్చుకునేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అధునాతన స్టెల్త్‌ సామర్థ్యాలు కలిగిన సుఖోయ్‌ ఎస్‌యూ-57 యుద్ధవిమానాలను భారత్‌తో కలిసి సంయుక్తంగా అభివృద్ధి, ఉత్పత్తి చేయడానికి, అలాగే కీలక సాంకేతికతలను పంచుకోవడానికి రష్యా సుముఖంగా ఉందని పుతిన్ ప్రకటించారు. భారత వైమానిక దళంలో ఐదోతరం యుద్ధ విమానాలు లేవు. దశాబ్దం క్రితమే భారత్-రష్యా కలిసి ఐదో తరం యుద్ధ విమానం అభివృద్ధి చేయాలని ప్రతిపాదన విచ్చింది. అయితే అప్పట్లో భారత్ వేచి చూసే విధానాన్ని ఎంచుకోగా, రష్యా స్వతంత్రంగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లింది. పాకిస్థాన్ త్వరలో చైనాకు చెందిన షెన్‌యాంగ్‌ జె-35AE స్టెల్త్‌ ఫైటర్స్‌ను సొంతం చేసుకోనుందని వార్తలు వస్తోన్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి ఎస్‌యూ-57పై స్పందన రావడం శుభపరిణామంగా భావిస్తున్నారు.

ఎస్‌యూ-57 యుద్ద విమానం రష్యా తొలి కార్యాచరణలో ఉన్న ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానం. అమెరికా తయారీ ఎఫ్-22 రాప్టర్, ఎఫ్-35 లైట్నింగ్-II వంటి విమానాలకు పోటీగా దీన్ని రూపొందించారు. రాడార్‌కు తక్కువగా కనిపించే స్టెల్త్ సాంకేతికత, సూపర్‌క్రూయిజ్ సామర్థ్యం, అత్యాధునిక సెన్సార్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సదుపాయాలు, దీర్ఘ శ్రేణి దాడుల సామర్థ్యం వంటి లక్షణాలు ఇందులో ఉన్నాయి. ఈ విమానం గగనతల ఆధిపత్యం సాధించడం, భూభాగ లక్ష్యాలపై దాడులు, ఎలక్ట్రానిక్ యుద్ధ చర్యలు, ఖచ్చితమైన దీర్ఘ శ్రేణి దాడులు వంటి పలు విధుల కోసం ఉపయోగించవచ్చని రష్యా పేర్కొంటోంది. ప్రస్తుతం సు-57 సేవల్లో ఉండటంతో పాటు విదేశీ మార్కెట్లలో కూడా దానిని ప్రోత్సహిస్తున్న రష్యా, కొనుగోలు మాత్రమే కాకుండా ఉత్పత్తి మరియు భవిష్యత్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని భారత్‌ను కోరుతోంది.


Full View

Tags:    

Similar News