Weather Update : తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు.. రాబోయే 4 రోజులు గండమే.. ఎల్లో అలర్ట్ జారీ
Weather Update : రాబోయే నాలుగు రోజుల పాటు వానలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు.. రాబోయే 4 రోజులు గండమే.. ఎల్లో అలర్ట్ జారీ
Rains: ఎండలు మండిపోతాయని భావిస్తున్న తరుణంలో ప్రకృతి అనూహ్యంగా తన ముఖచిత్రాన్ని మార్చేసింది. గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటమే కాకుండా, అకాల వర్షాలు అటు అన్నదాతలను, ఇటు సామాన్యులను కలవరపెడుతున్నాయి. రాబోయే నాలుగు రోజుల పాటు వానలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి నుంచి వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ముఖ్యంగా భాగ్యనగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, లక్డీకపూల్ వంటి ప్రధాన ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా.. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కూడా ఈదరు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. నేడు (బుధవారం) రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు 'ఎల్లో అలర్ట్' జారీ చేశారు. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉన్నందున.. చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.
ఏపీలో పిడుగుల భయం..
ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అందించిన సమాచారం ప్రకారం.. పలు జిల్లాల్లో వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం పొంచి ఉంది. నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనంతపురం సహా రాయలసీమ జిల్లాల్లో ఆకాశం పూర్తిగా మబ్బులు కమ్మేసి ఉంది. సాయంత్రం వేళలో అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది.
అన్నదాతల ఆందోళన..
ఈ అకాల వర్షాలు రైతన్నల నడ్డి విరుస్తున్నాయి. చేతికి వచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాల వద్ద తార్పాలిన్లు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.