Telangana Assembly Sessions 2026: తెలంగాణ బడ్జెట్ పై చివరి రోజు చర్చ

Telangana Assembly Sessions 2026: తెలంగాణ అసెంబ్లీలో 2026-27 బడ్జెట్ పై నేడు చివరి రోజు చర్చ. ప్రశ్నోత్తరాల్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

Update: 2026-03-24 03:45 GMT

Telangana Assembly Sessions 2026

Telangana Assembly Sessions 2026: తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో బడ్జెట్ పై చివరిరోజు చర్చ ఈరోజు జరగనుంది. బడ్జెట్ సమావేశాల్లో మంగళవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం అవుతాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌పై చివరి రోజు చర్చ జరగనుంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌పై సభ్యులు లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వనున్నారు.

అసెంబ్లీలో ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. హైదరాబాద్ కు సంబంధించి నగరంలో రహదారుల మౌలిక సదుపాయాల మెరుగుదల, ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ వరకు ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పురోగతిపై సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు.

విద్యార్థుల సంక్షేమంపై కూడా కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. విదేశీ చదువుల కోసం విద్యార్థులకు అందజేసే ఉపకార వేతనాలు, అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణలో భాగంగా తీసుకువచ్చిన 'సంచార అంగన్వాడీ' కేంద్రాల పనితీరుపై ప్రశ్నలకు ప్రభుత్వం వివరణ ఇవ్వనుంది. అలాగే, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చే 'మన ఊరు - మన బడి' కార్యక్రమం కింద ఇప్పటివరకు జరిగిన పనుల స్థితిగతులపై విద్యాశాఖ మంత్రి సమాధానం ఇవ్వనున్నారు.

రాష్ట్రంలో చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలపై చర్చ జరగనుంది. మరోవైపు, తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) ఏర్పాటుకు సంబంధించిన ప్రస్తుత పరిణామాలు, పోలీసుల ఆధీనంలో ఉన్న పాత వాహనాలపై కొత్త పాలసీ, మహిళా స్వయం సహాయక సంఘాలకు నిధుల కేటాయింపు వంటి అంశాలు సభ ముందుకు రానున్నాయి.

శాసనమండలిలో ఈరోజు 

శాసనమండలిలో కూడా బడ్జెట్‌పై చర్చకు ఈరోజే చివరి రోజు. మండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ కేటాయింపులపై ప్రసంగించనున్నారు. సభ్యులు అడిగిన సందేహాలకు శాఖల వారీగా మంత్రులు వివరణ ఇవ్వనున్నారు.

మండలిలో చర్చకు రానున్న ప్రధాన అంశాలలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ మరమ్మత్తు పనులు, వరంగల్ భద్రకాళి ఆలయ మాడవీధుల నిర్మాణం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రైతులకు సంబంధించిన సాదా బైనమాల క్రమబద్ధీకరణ అంశంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న వాహన స్క్రాపేజ్ పాలసీ, సింగరేణి సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. భూ-భారతి పోర్టల్‌లో టిఎం మాడ్యూల్ కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూ శాఖ సమాధానం ఇవ్వనుంది.

కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన నష్టం, బాధితులకు అందజేసిన సాయంపై చర్చ జరగనుంది. అలాగే బీసీ సామాజిక వర్గాలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలపై ప్రభుత్వం పద్దుల వారీగా వివరాలు సమర్పించనుంది.

Tags:    

Similar News