Pargi: కలెక్టర్ గారూ చూడండి! పరిగి మున్సిపాలిటీలో అక్రమ వసూళ్ల దందా!
Pargi: పరిగి మున్సిపాలిటీలో తాయి బజార్ పన్ను వసూళ్లలో భారీ కుంభకోణం. ప్రైవేట్ వ్యక్తులతో అధికారుల కుమ్మక్కు? రోజుకు రూ. 17 వేల ఆదాయానికి గండి.
Pargi: కలెక్టర్ గారూ చూడండి! పరిగి మున్సిపాలిటీలో అక్రమ వసూళ్ల దందా!
Vikarabad: పరిగి మున్సిపాలిటీ అక్రమాలకు అడ్డాగా మారుతోంది. ప్రజల సొమ్మును కాపాడాల్సిన అధికారులే కమిషన్ల కక్కుర్తితో ప్రైవేట్ వ్యక్తులకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాయి బజార్ పన్ను వసూళ్లలో భారీ కుంభకోణం జరుగుతోందని, ఇందులో మున్సిపల్ అధికారులతో పాటు పాలకవర్గం హస్తం కూడా ఉందంటూ ప్రతిపక్ష కౌన్సిలర్లు మండిపడుతున్నారు.
పరిగి పట్టణంలో ప్రతి శుక్రవారం, శనివారం సంత జరుగుతుంది. ఈ మార్కెట్ ద్వారా మున్సిపాలిటీకి తాయి బజార్ రూపంలో భారీగా ఆదాయం రావాలి. గత నెలలోనే పాత టెండర్ గడువు ముగిసింది. మళ్ళీ టెండర్ వేయడానికి ఈ నెల 7వ తేదీ వరకు గడువు ఉంది. ఈ మధ్య కాలంలో మున్సిపల్ సిబ్బందే నేరుగా పన్ను వసూలు చేయాలి. కానీ ఇక్కడే అసలు ఆట మొదలైంది!
సాధారణంగా మార్కెట్ రోజుల్లో రోజుకు 20,000 రూపాయల వరకు వసూళ్లు అవుతాయి. కానీ అధికారులు మాత్రం ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై, కేవలం 3,000 రూపాయలకే పన్ను వసూలు చేసే అధికారాన్ని వారికి కట్టబెట్టారు. అంటే మిగిలిన 17,000 రూపాయల ప్రజా ధనం ఎవరి జేబుల్లోకి వెళ్తోంది? మున్సిపల్ కమిషనర్ తన కమిషన్ కోసం మున్సిపల్ ఆదాయాన్ని గాలికొదిలేశారా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ దోపిడీపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు మీదిగడ్డ శ్రీనివాస్, నరేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ తీరుపై మండిపడుతూ.. మున్సిపల్ చైర్మన్ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. "ప్రైవేట్ వ్యక్తులకు పన్ను వసూళ్లు అప్పగించాల్సిన అవసరం ఏముంది? ఇది ముమ్మాటికీ అవినీతి భాగస్వామ్యమే" అని వారు ఆరోపిస్తున్నారు.
అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఉన్న ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై పట్టణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి, పరిగి మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ 'కమిషన్ల' భాగోతంపై విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.