Atmakur: కంచి అంటే మంచి తనం.. సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ సేవా యజ్ఞం
Atmakur: ఆత్మకూరులో సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ 3వ వార్షికోత్సవం సందర్భంగా కంచి పరమేశ్వర రెడ్డి రాత్రి భోజన పథకాన్ని ప్రారంభించారు.
Atmakur: కంచి అంటే మంచి తనం.. సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ సేవా యజ్ఞం
ఆత్మకూరు: ఆకలిగొన్నవారికి పట్టెడన్నం పెట్టండయ్యా.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోండయ్యా.. క్షుద్భాద తీర్చండి.. అంటూ అవధూతలు.. ఆధ్యాత్మిక గురువులు.. శ్రీ వెంకయ్య స్వామి, శ్రీ కాశి నాయన లాంటి మహానుభావుల బోధనల స్ఫూర్తిగా తీసుకున్న ఆత్మకూరికి చెందిన సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మరో అడుగు ముందుకు వేశారు. గడిచిన మూడేళ్లుగా నిరుపేదల క్షుద్భాధ తీరుస్తూ మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్న కంచి పరమేశ్వర్ రెడ్డి ఇకపై రాత్రి భోజనానికి శ్రీకారం చుడుతున్నట్టు ఇవాళ జరిగిన మూడేళ్ల వార్షికోత్సవ వేదిక నుంచి ప్రకటించారు. అసలే మెట్ట ప్రాంతం, ఆపై పేదరికం అధికంగా ఉన్న ఆత్మకూరు లాంటి ప్రాంతంలో ఇలాంటి నిత్యాన్నదాన కార్యక్రమాలు, అనాధలు, నిరు పేదలకు వరం అవుతున్నాయని స్థానికులు భావిస్తున్నారు. శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు కంచి పరమేశ్వరి రెడ్డి ని అభినందిస్తున్నారు.
ఆత్మకూరు నిత్యాన్నదాత, సేవామూర్తి కంచి పరమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సమావేశం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ఈ వేడుక కేవలం ఒక వార్షికోత్సవం మాత్రమే కాదు, లక్షలాది మంది ఆకలి తీర్చిన ఒక మహా సంకల్పానికి ప్రతిరూపం.
ఈ సమావేశంలో ఆనందదాయకమైన,కీలకమైన అంశం ఏమిటంటే.. గత మూడేళ్లుగా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు, వారి సహాయకులకు కేవలం మధ్యాహ్నం పూట మాత్రమే అన్నదానం జరుగుతుండేది. అయితే, రోగుల సహాయకులు రాత్రి వేళల్లో భోజనం దొరకక పడుతున్న ఇబ్బందులను గమనించిన పరమేశ్వర రెడ్డి ఈ మూడేళ్ల వేడుకల స్ఫూర్తితో నేటి నుండే రాత్రిపూట కూడా భోజన వసతిని ప్రారంభించారు. ఈ నిర్ణయం పట్ల స్థానిక ప్రజలు మరియు రోగుల కుటుంబాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ కంచి పరమేశ్వర రెడ్డి సేవా ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన సాధించిన విజయాల వెనుక ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయని అతిథులు కొనియాడారు. కేవలం ఒక వ్యక్తిగా కాకుండా, ఆకలితో ఉన్నవారి పాలిట ఒక మహాశక్తిగా మారి, గత మూడేళ్లుగా ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో అన్నప్రసాద కార్యక్రమాలతో పాటు మరెన్నో బృహత్తర సేవా కార్యక్రమాలను ఆయన నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రానికి నిలువెత్తు రూపంగా, గర్వం లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, ట్రస్ట్ సాధించే ప్రతి విజయాన్ని అందరి విజయంగా భావించి పుణ్యాన్ని పంచుతూ, ఆయన తన పేరులోని "కంచి"ని "మంచి"తనానికి నిదర్శనంగా మార్చుకున్నారని అతిథులు అభినందించారు.