Nizamabad: బోధన్ డివిజన్‌లో గ్రామసభల హోరు అధికారులను నిలదీసిన గ్రామస్తులు!

Nizamabad: నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్‌లో నిర్వహించిన గ్రామసభల్లో రైతులు, గ్రామస్తులు అధికారులను నిలదీశారు.

Update: 2026-04-02 13:07 GMT

Nizamabad: బోధన్ డివిజన్‌లో గ్రామసభల హోరు అధికారులను నిలదీసిన గ్రామస్తులు!

నిజామాబాద్: బోధన్ డివిజన్ పరిధిలోని సాలూర, వర్ని, కోటగిరి, రుద్రూర్ , రెంజల్, ఎడపల్లి మండలాల్లోని 152 మేజర్, మైనర్ గ్రామపంచాయతీలో గురువారం గ్రామసభలు నిర్వహించారు. ఆయా పంచాయతీ పరిధిలోని సమస్యలపై గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. రుద్రూర్ మండల కేంద్రంలో సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.ఈ గ్రామ సభలో ఆసక్తికర అంశాలను గ్రామస్తులు డిఎస్ఓ అరవింద్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. కోతల సీజన్ ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ధాన్య దళారులు రైతులను దోపిడీ చేస్తున్నారని జిల్లా సివిల్ సప్లై అధికారి దృష్టికి గ్రామస్తులు తీసుకొచ్చారు. దళారులు క్వింటాలు ధాన్యానికి రూ. 1850 చెల్లించి తేమ పేరుతో ఐదు కిలోల తరుగును దోచుకుంటున్నారని అధికార దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల కురిసిన వడగండ్ల వానకు అసలే దిగుబడి రాక ఇబ్బంది పడుతున్న రైతులకు మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా దళారులు దోచుకుంటున్నారని పేర్కొన్నారు. రుద్రూర్ లో దళారుల వ్యవస్థ పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు అధికారులకు విన్నవించారు.

విద్యాశాఖ అధికారులు నిధుల విషయంలో సరైన వివరణ ఇవ్వాలని గ్రామస్తులు ఉపాధ్యాయులను గ్రామ సభలో నిలదీశారు. పాఠశాల అభివృద్ధి నిధులు విషయమై ఉపాధ్యాయులను ప్రశ్నించినప్పటికీ వారి నుండి సరైన సమాధానం రాలేదు. నీళ్ల సంబంధించిన వివరాలు రుద్రూర్ meo శ్రీనివాస వద్ద ఉన్నాయని ఉపాధ్యాయులు చెప్పడంతో గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన గాంధీ ప్రైమరీ పాఠశాల లో జరుగుతున్న అభివృద్ధి విషయమై ఉపాధ్యాయురాలుని నిలదీశారు. రుద్రూర్ ప్రైమరీ పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులను తొలగించి ఉపాధ్యాయురాలు సొంత మనిషిని పెట్టుకున్నారని గ్రామ సభలో మండిపడ్డారు. దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులకు సూచించారు. రెంజల్, సాలూరు మండలాల్లో తాగునీటి సమస్యపై అధికారులను నిలదీసి సమస్యలతో సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ గ్రామ సభలో ఆయా గ్రామాల సర్పంచులు అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News