OnePlus : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బిగ్ షాక్.. ఇండియాలో ‘వన్ ప్లస్’ క్లోజ్..?
OnePlus : ప్రముఖ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ 'వన్ ప్లస్' (OnePlus) భవిష్యత్తు ఇప్పుడు తీవ్ర సందిగ్ధంలో పడింది. గతంలో ఈ కంపెనీ మూతపడనుందనే వార్తలు..
oneplus
OnePlus : ప్రముఖ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ 'వన్ ప్లస్' (OnePlus) భవిష్యత్తు ఇప్పుడు తీవ్ర సందిగ్ధంలో పడింది. గతంలో ఈ కంపెనీ మూతపడనుందనే వార్తలు వచ్చినప్పటికీ, ఒప్పో (Oppo) గ్రూప్ పరిధిలో రియల్‌మీతో కలిసి ఇది తన కార్యకలాపాలను కొనసాగించింది. అయితే, తాజాగా వెలువడిన బ్లూమ్‌బెర్గ్ నివేదిక టెక్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ నివేదిక ప్రకారం వన్ ప్లస్ సంస్థ అమెరికా, యూరప్ మార్కెట్లలో తన వ్యాపారాన్ని పూర్తిగా నిలిపివేయడానికి సిద్ధమవుతోంది. ఆ తర్వాత 2027 నాటికి భారతదేశం నుండి కూడా వన్ ప్లస్ బ్రాండ్ పూర్తిగా నిష్క్రమించే అవకాశం ఉందని తెలుస్తోంది. వన్ ప్లస్ మాతృ సంస్థ 'ఒప్పో' అంతర్జాతీయంగా చేపడుతున్న గ్లోబల్ రీస్ట్రక్చరింగ్ లో భాగంగానే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం.
అమెరికా, యూరప్ తర్వాత ఇండియా వంతు
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. వన్ ప్లస్ మొదట ఈ వారంలోనే అమెరికా, యూరప్ మార్కెట్ల నుండి వైదొలగనుంది. ఆ తర్వాత ప్రపంచంలోని ఇతర మార్కెట్లలో కూడా కార్యకలాపాలను క్లోజ్ చేయనుంది. ఇందులో భాగంగానే, వన్ ప్లస్‌కు అత్యంత కీలకమైన మార్కెట్‌గా ఉన్న భారతదేశం నుండి 2027 లో ఈ బ్రాండ్ పూర్తిగా కనుమరుగు కానుందని సదరు నివేదిక పేర్కొంది. వన్ ప్లస్ ఇండియా నుండి నిష్క్రమిస్తుందనే వార్తలు రావడం ఇదే మొదటిసారి కావడంతో భారతీయ కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి తగ్గట్లుగానే ఈ ఏడాది ఆరంభంలో వన్ ప్లస్ ఇండియా సీఈఓ రాబిన్ లియు తన పదవికి రాజీనామా చేయడం, లోకల్ లీడర్‌షిప్‌ను కంపెనీ తగ్గించుకుంటూ రావడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
ఒప్పో సంచలన నిర్ణయాల వెనుక కారణాలు ఏంటి?
అమెరికా, యూరప్, ఇండియాతో సహా పలు అంతర్జాతీయ మార్కెట్లలో స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు మందగించడమే ఒప్పో ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీనికి తోడు మార్కెట్లో ర్యామ్ (DRAM), మెమరీ వంటి విడిభాగాల ధరలు విపరీతంగా పెరిగిపోవడం కంపెనీలకు భారంగా మారింది. అలాగే అమెరికాలో ఉన్న భౌగోళిక రాజకీయ సవాళ్లు, యాపిల్ సంస్థతో నడుస్తున్న సుదీర్ఘ చట్టపరమైన వివాదాలు కూడా ఒప్పోను ఈ రకమైన వ్యూహాత్మక మార్పుల వైపు నడిపించాయి.
రియల్‌మీ బిజినెస్‌లోనూ మార్పులు
ఈ పునర్వ్యవస్థీకరణ ప్రభావం ఒప్పో గ్రూప్‌లోని మరో పాపులర్ బ్రాండ్ 'రియల్‌మీ' (Realme) పై కూడా పడనుంది. రియల్‌మీ బ్రాండ్‌ను చైనా మార్కెట్ నుండి పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఒప్పో భావిస్తోంది. ఒప్పో కంపెనీ కేవలం చైనా మార్కెట్‌తో పాటు సెంట్రల్ యూరప్ దేశాలపై మాత్రమే తన పూర్తి దృష్టిని కేంద్రీకరించనుంది. మరోవైపు, రియల్‌మీ బ్రాండ్‌ను స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ వంటి నార్డిక్ దేశాలకు పరిమితం చేయనున్నారు, ఎందుకంటే అక్కడ రియల్‌మీ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది.
వన్ ప్లస్ ఇండియా ఎగ్జిట్‌పై ప్రముఖ టెక్ మీడియా సంస్థ గ్యాడ్జెట్స్ 360 ఇప్పటికే వన్ ప్లస్ యాజమాన్యాన్ని వివరణ కోరింది. కంపెనీ నుండి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ నివేదిక నిజమైతే మాత్రం, ప్రీమియం ఫోన్ల విభాగంలో వన్ ప్లస్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇది భారతీయ మొబైల్ ప్రియులకు కోలుకోలేని పెద్ద షాక్ అనే చెప్పాలి.