ChatGPT: చాట్‌జీపీటీని నమ్ముకుంటే ఇదే గతి!

ChatGPT: ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ, DALL-E సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Update: 2026-07-08 01:40 GMT

ChatGPT: చాట్‌జీపీటీని నమ్ముకుంటే ఇదే గతి!

ChatGPT Down: నేటి డిజిటల్ యుగంలో కోట్లాది మందికి నిత్యసవసరంగా మారిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ చాట్‌జీపీటీ ఒక్కసారిగా మొరాయించింది. ఓపెన్‌ ఏఐకి చెందిన ఈ పాపులర్ సర్వీస్ ప్రపంచవ్యాప్తంగా స్తంభించిపోవడంతో లక్షలాది మంది యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆఫీస్ పనులు, కోడింగ్, కంటెంట్ రైటింగ్, ప్రాజెక్టుల కోసం దీనిపై ఆధారపడేవారంతా ఒక్కసారిగా ఏం చేయాలో తెలియక తలపట్టుకున్నారు.

చాట్‌జీపీటీకి సంబంధించిన ప్రాంప్ట్ సర్వీస్‌లతో పాటు, ఇమేజ్ జనరేషన్ ప్లాట్‌ఫామ్ DALL-E, ఇతర అనుబంధ సేవల్లోనూ తీవ్ర సాంకేతిక సమస్యలు తలెత్తాయి. యూజర్లు లాగిన్ అవ్వడానికి ప్రయత్నించినా, ఏవైనా ప్రశ్నలు అడిగినా.. Error లేదా Something went wrong అనే మెసేజ్‌లు దర్శనమిచ్చాయి.

దీంతో నెటిజన్లు ఊరుకుంటారా? వెంటనే సోషల్ మీడియా వేదికగా రంగంలోకి దిగారు. చాట్‌జీపీటీ పనిచేయడం లేదంటూ స్క్రీన్‌షాట్లను షేర్ చేస్తూ ఎక్స్ , ఫేస్‌బుక్‌లలో పోస్టుల వర్షం కురిపించారు. మీమ్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తించారు. గ్లోబల్ అవుటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్‌లో కూడా వేలాది మంది యూజర్లు దీనిపై ఫిర్యాదులు నమోదు చేశారు. ఈ అంతరాయంపై ఓపెన్‌ఏఐ సంస్థ వెంటనే స్పందించింది. సమస్యను అధికారికంగా అంగీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.

సాంకేతిక లోపాన్ని గుర్తించిన వెంటనే కంపెనీకి చెందిన నిపుణుల బృందం రంగంలోకి దిగిందని, పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేసినట్లు తెలిపింది. సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు తీసుకున్న తక్షణ చర్యల వల్ల ఇప్పటికే చాట్‌జీపీటీ సేవలు చాలా వరకు పునరుద్ధరించబడినట్లు ఓపెన్‌ఏఐ తాజా అప్‌డేట్‌లో వెల్లడించింది. అయితే ఇమేజ్ జనరేషన్ వంటి మరికొన్ని సేవల్లో ఇంకా అక్కడక్కడా అంతరాయం కొనసాగుతోందని, వాటిని కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి పూర్తి స్థాయిలో సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని కంపెనీ యూజర్లకు స్పష్టం చేసింది.

ప్రస్తుతం చాట్‌జీపీటీ సాధారణ స్థితికి వస్తున్నప్పటికీ, పూర్తి స్థాయి సేవలు అందరికీ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదేమైనా.. ఈ అవుటేజ్ చూస్తుంటే, మానవాళి ఏఐపై ఎంతలా ఆధారపడిపోతుందో మరోసారి అర్థమవుతోంది.

Tags:    

Similar News