Yashasvi Jaiswal: ఈ షాడో కెరీర్ అవసరమా?.. రాజస్థాన్ రాయల్స్‌ను వదిలేయ్ జైస్వాల్!

Ambati Rayudu on Yashasvi Jaiswal. యశస్వి జైస్వాల్ భవిష్యత్తుపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది.

Update: 2026-05-28 14:32 GMT

Yashasvi Jaiswal: ఈ షాడో కెరీర్ అవసరమా?.. రాజస్థాన్ రాయల్స్‌ను వదిలేయ్ జైస్వాల్!

Yashasvi Jaiswal: ఐపీఎల్ 2026లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న సంచలనం ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టులోనే కొత్త చర్చకు దారితీసింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ స్థాయి బౌలర్లపై విరుచుకుపడుతున్న వైభవ్.. రాయల్స్‌కు కొత్త సూపర్ స్టార్‌గా మారిపోయాడు. ఈ క్రమంలో స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ భవిష్యత్తుపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తాజాగా మాజీ భారత క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాయల్స్‌ను జైస్వాల్ వీడాల్సిన సమయం వచ్చేసింది అని హాట్ కామెంట్స్ చేశాడు.

సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లిన తర్వాత రాజస్థాన్ రాయల్స్‌కు యశస్వి జైస్వాల్ కొత్త ముఖచిత్రంగా మారుతాడని అందరూ భావించారు. 2023 ఐపీఎల్‌లో 600కుపైగా పరుగులు చేసి భారత క్రికెట్ భవిష్యత్తు స్టార్‌గా జైస్వాల్ పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో రాజస్థాన్‌ జట్టులో ప్రధాన ఆకర్షణగా మారిపోయాడు. అతడి దూకుడైన బ్యాటింగ్ ముందు జైస్వాల్ ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘యశస్వి జైస్వాల్ తన ఆట తీరును మార్చుకోవాలి. వైభవ్‌తో కలిసి ఆడుతూ.. ప్రతిసారి అతడి నీడలో ఉండకూడదు. జైస్వాల్ కూడా పెద్ద స్టార్. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించే సామర్థ్యం అతడికి ఉంది. మరో జట్టుకు వెళ్తే బాగుంటుంది. జైస్వాల్‌కు తనకంటూ ప్రత్యేక పేరు, జట్టు అవసరం. ఎందుకంటే వైభవ్ ఇలాగే అందరినీ ఓవర్‌షాడో చేస్తూ ఉంటాడు. వైభవ్ లాంటి ఆటగాడితో పోటీ పడటం కష్టం. అతడిని ఎదుర్కొనేందుకు పక్కన సీనియర్ ప్లేయర్ ఉండాలి. అతడి విజయాన్ని ఆస్వాదించాలి. కానీ అతడితో పోటీకి దిగకూడదు. ఎందుకంటే ఇప్పుడు వైభవ్ పూర్తిగా వేరే స్థాయిలో ఆడుతున్నాడు’ అని చెప్పాడు.

ముంబై ఇండియన్స్ యశస్వి జైస్వాల్‌కు సరైన జట్టు అని కూడా అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. ‘ముంబై జట్టు జైస్వాల్‌కు బాగా సరిపోతుంది. ముంబైలో అతడికి తన ఆటను మరింత స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది’ అని రాయుడు తెలిపాడు. దీంతో వచ్చే సీజన్‌లో జైస్వాల్ రాజస్థాన్‌ను వీడతాడా? అనే చర్చ మొదలైంది. జైస్వాల్ ఈ సీజన్లో రాజస్థాన్ తరఫున 15 మ్యాచ్‌లలో 426 పరుగులు చేశాడు. మరోవైపు వైభవ్ 15 మ్యాచ్‌ల్లోనే 680 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. భారీ సిక్సర్లు, అసాధారణ స్ట్రైక్‌రేట్‌తో ప్రపంచ క్రికెట్‌ను బుడ్డోడు ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ ఫామ్ చూస్తుంటే రాజస్థాన్ భవిష్యత్తు మొత్తం ఇప్పుడు వైభవ్ చుట్టూనే తిరుగుతోంది.

Tags:    

Similar News