Vaibhav Sooryavanshi: 'బేబీ బాస్'కు యూనివర్సల్ బాస్ ఫిదా.. ఆ ప్రపంచ రికార్డు కూడా బద్దలవడం పక్కా!

Chris Gayle hailed Vaibhav Sooryavanshi. ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం ప్రపంచ క్రికెట్‌ను షాక్‌కు గురిచేస్తోంది.

Update: 2026-05-28 12:51 GMT

Vaibhav Sooryavanshi: 'బేబీ బాస్'కు యూనివర్సల్ బాస్ ఫిదా.. ఆ ప్రపంచ రికార్డు కూడా బద్దలవడం పక్కా!

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం ప్రపంచ క్రికెట్‌ను షాక్‌కు గురిచేస్తోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ.. ప్రపంచ స్టార్ బౌలర్లపై విరుచుకుపడుతున్న బుడ్డోడు ఇప్పుడు క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు అందుకుంటున్నాడు. తాజాగా వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ కూడా వైభవ్ ఆటకు ఫిదా అయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ ఆడిన సంచలన ఇన్నింగ్స్ తర్వాత గేల్ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు.

న్యూ చండీగఢ్‌లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి ఎస్ఆర్‌హెచ్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. బుడ్డోడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 12 భారీ సిక్సర్లు ఉన్నాయి. 334కు పైగా స్ట్రైక్‌రేట్‌తో ఆడిన వైభవ్.. మ్యాచ్‌ను పూర్తిగా రాజస్థాన్ వైపు తిప్పేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ సీజన్‌లో క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టాడు. 2012 ఐపీఎల్‌లో గేల్ 59 సిక్సర్లు బాదగా.. వైభవ్ ఇప్పటికే 65 సిక్సర్లు కొట్టి కొత్త రికార్డు సృష్టించాడు. టీ20 టోర్నమెంట్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా కూడా నిలిచాడు.

వైభవ్ సూర్యవంశీ ఆటపై స్పందించిన క్రిస్ గేల్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘అద్భుతం వైభవ్ సూర్యవంశీ.. కొత్త సిక్సర్ మెషిన్’ అంటూ పోస్ట్ చేశాడు. అలాగే ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును బ్రేక్ చేసే అవకాశాన్ని కేవలం మూడు పరుగుల తేడాతో వైభవ్ చేజార్చుకోవడంపై కూడా గేల్ స్పందించాడు. ‘వైభవ్ దురదృష్టవశాత్తు సెంచరీ మిస్ అయ్యాడు. కానీ త్వరలోనే ఆ రికార్డును కూడా బ్రేక్ చేస్తాడు. వైభవ్ బాగా ఆడుతున్నాడు. ఈజీగా సిక్సులు బాదుతున్నాడు. రోజురోజుకు అతడికి అభిమానిని అయిపోతున్నా. వైభవ్ అసాధారణమైన ప్లేయర్. సూపర్ ఎంటర్‌టైన్మెంట్ ఇస్తున్నావు యంగ్ మ్యాన్’ అంటూ బుడ్డోడిని యూనివర్సల్ బాస్ ప్రోత్సహించాడు.

ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ గణాంకాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. 15 ఇన్నింగ్స్‌లలో 680 పరుగులు చేసి.. ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. 45.33 సగటు, 242.85 స్ట్రైక్‌రేట్‌తో ఆడుతూ.. ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఐపీఎల్ 2026లో మొత్తం 55 ఫోర్లు, 65 సిక్సర్లు బాదాడు. వైభవ్ ఎదుర్కొన్న ప్రతి 4.3 బంతుల్లో ఒక సిక్సర్ రావడం అతడి విధ్వంసక బ్యాటింగ్‌కు నిదర్శనం. ఈ సీజన్‌లో అతడి పరుగుల్లో 88.9 శాతం బౌండరీల ద్వారానే రావడం విశేషం.

వైభవ్ ఈ సీజన్‌లో అనేక అరుదైన రికార్డులు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో 10కిపైగా సిక్సర్లు కొట్టిన రికార్డులో క్రిస్ గేల్‌తో సమంగా నాలుగు సార్లు నిలిచాడు. ఈ సీజన్‌లోనే మూడు సార్లు 10కి పైగా సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు (490) చేసిన బ్యాటర్‌గా డేవిడ్ వార్నర్ రికార్డును కూడా అధిగమించాడు. అలాగే ప్లేఆఫ్ మ్యాచ్‌లో 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి సురేశ్ రైనా రికార్డును సమం చేశాడు. ఇప్పటికే ప్రపంచ క్రికెట్‌లో కొత్త సూపర్ స్టార్‌గా మారిపోయిన వైభవ్.. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్‌ను ఫైనల్‌కు చేర్చడంపై దృష్టి పెట్టాడు. క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌ను అతడు ఎదుర్కొనబోతున్నాడు. ఇదే ఫామ్ కొనసాగిస్తే రాజస్థాన్ టైటిల్ పోరుకు వెళ్లడం ఖాయం.

Tags:    

Similar News