Rajat Patidar: కోహ్లీ, భువీపై మేము ఆధారపడం.. ఆర్సీబీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
Rajat Patidar: క్వాలిఫయర్-1 మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ జట్టు సమిష్టి ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు.
Rajat Patidar: కోహ్లీ, భువీపై మేము ఆధారపడం.. ఆర్సీబీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
Rajat Patidar: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ (జీటీ)పై 92 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం జీటీని 162 పరుగులకే ఆలౌట్ చేసి ఐపీఎల్ చరిత్రలో ఐదోసారి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ జట్టు సమిష్టి ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. ఆర్సీబీ ఒక్క ఆటగాడిపై ఆధారపడే జట్టు కాదని,ప్లేయర్స్ అందరూ తమ వంతు కృషి చేస్తున్నారని వెల్లడించాడు.
‘ప్రస్తుత ఆర్సీబీ ఏ ఒక్క ఆటగాడిపై ఆధారపడే జట్టు కాదు. ప్రతి ఒక్కరూ జట్టు కోసం తమ వంతు కృషి చేస్తున్నారు. అదే మా జట్టు అసలైన బలం. విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్, జేకబ్ బెతెల్, ఫిల్ సాల్ట్ వంటి ఆటగాళ్లు ప్రతి మ్యాచ్‌లో అద్భుత ఆరంభాలు అందిస్తున్నారు. ఆ స్టార్ట్ మాకు బలమైన పునాది వేస్తోంది. మిగతా బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా అదే జరిగింది’ అని రజత్ పాటీదార్ తెలిపాడు. గత రెండు సీజన్లుగా ఆర్సీబీ నిలకడైన ప్రదర్శన చేయడానికి ఇదే ప్రధాన కారణమని ఆర్సీబీ కెప్టెన్ వెల్లడించాడు.
క్వాలిఫయర్-1లో రజత్ పాటీదార్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 33 బంతుల్లో 93 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడి మ్యాచ్‌ను పూర్తిగా ఆర్సీబీ వైపు తిప్పేశాడు. తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. ‘మొదట్లో పిచ్‌ను అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. ఏ ఏరియాల్లో షాట్లు ఆడొచ్చో చూసాను. జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో పుల్ షాట్ ఆడిన తర్వాత నాకు మరింత క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత ఎక్కువగా ఆలోచించకుండా మొమెంటమ్‌ను పూర్తిగా ఉపయోగించుకోవడంపైనే దృష్టి పెట్టాను. ఈ క్రమంలోనే పరుగులు వచ్చాయి. మా బౌలర్లు అద్భుతం చేశారు. జీటీలో టాప్ 3 బ్యాటర్లను పెవిలియన్ చేర్చాలనుకున్నాం. అదృష్టవశాత్తు ముగ్గురు త్వరగానే అవుట్ అయ్యారు. ఇది జట్టు సమిష్టి విజయం’ అని పాటీదార్ వివరించాడు.
ఓపెనర్లు ఇచ్చిన ఆరంభాన్ని కొనసాగిస్తూ దేవదత్ పడిక్కల్ కూడా వేగంగా ఆడాడు. కేవలం 19 బంతుల్లో 30 పరుగులు చేసి జట్టుకు సహకారం అందించాడు. విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన పడిక్కల్.. ‘వరుసగా రెండేళ్లు ఫైనల్‌కు చేరడం చిన్న విషయం కాదు. ఈ విజయాలపై జట్టుగా మేము గర్వపడుతున్నాం. ఈ మ్యాచ్‌కు ముందు మేము దూకుడుగా ఆడాలని మాట్లాడుకున్నాం. మొదటి బంతి నుంచే ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావడంలో విజయవంతమయ్యాం. ఇలాంటి పెద్ద మ్యాచ్‌లో ఒత్తిడిని తట్టుకుని రజత్ ఆడిన తీరు అద్భుతం. అతడు ముందుండి జట్టును నడిపించాడు. తన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను పూర్తిగా గుజరాత్ చేతుల నుంచి తీసుకొచ్చాడు’ అని కొనియాడాడు.
మరోవైపు ఆర్సీబీ మెంటార్ దినేష్ కార్తీక్ కూడా జట్టు దూకుడైన ధోరణిని ప్రశంసించాడు. ‘మొదటి నుంచే మా బ్యాటర్లు చూపిన ఇంటెంట్ అద్భుతం. విరాట్, వెంకీ, పడిక్కల్ అద్భుత ఆరంభం ఇచ్చారు. మొత్తం ఇన్నింగ్స్ అంతా అదే టెంపో కొనసాగించాం. ఇలాంటి కీలక మ్యాచ్‌ల్లో చాలా జట్లు ఒత్తిడితో వెనుకడుగు వేస్తాయి. కానీ మేము మాత్రం నిరంతరం దాడి కొనసాగించాం’ అని చెప్పాడు. విరాట్ కోహ్లీ మ్యాచ్‌కు ముందు చెప్పిన ‘బాడీ లాంగ్వేజ్’ అంశాన్ని కూడా డీకే ప్రస్తావించాడు. ‘విరాట్ మ్యాచ్‌కు ముందు బాడీ లాంగ్వేజ్ ఎంత ముఖ్యమో చెప్పాడు. గత కొన్ని వారాలుగా మా జట్టు అదే ఎనర్జీతో ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా మేము ఛాంపియన్స్‌లా ఆడాం’ అని పేర్కొన్నాడు. ఇక మే 31న అహ్మదాబాద్‌లో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్‌పై అందరి దృష్టి నిలిచింది. వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది. ఇప్పటికే అభిమానులు ‘ఈసారి కూడా కప్ నమ్‌దే’ అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.