Vaibhav Sooryavanshi: వైభవ్‌ సూర్యవంశీపై ఐపీఎల్ ఛైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ చర్చ జరుగుతోంది.

Update: 2026-05-27 12:57 GMT

Vaibhav Sooryavanshi: వైభవ్‌ సూర్యవంశీపై ఐపీఎల్ ఛైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో సంచలనంగా మారిన 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ చర్చ జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ టీనేజ్ బ్యాటర్ తన దూకుడైన బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికే ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లలో 583 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో వైభవ్‌ను త్వరగా భారత జట్టులోకి తీసుకురావాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. వచ్చే నెలలో శ్రీలంకలో జరిగే ట్రై సిరీస్‌లో ఇండియా-ఏ జట్టుకు వైభవ్ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్ ప్రత్యేక ప్రతిభ కలిగిన ఆటగాడని, ఇలాంటి యువ ఆటగాళ్లను చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. బీసీసీఐతో పాటు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కూడా వైభవ్‌ను సరైన దారిలో నడిపించాలని సూచించారు. ‘వైభవ్ లాంటి ఆటగాడిని బీసీసీఐ, ఆర్ఆర్ ఫ్రాంచైజీ కలిసి హ్యాండ్‌హోల్డ్ (ప్రత్యేకమైన మార్గదర్శకత్వం) చేయాలి. అతడి టెంపరమెంట్ చెడిపోకుండా సరైన మార్గనిర్దేశం చేయాలి. ఎందుకంటే క్రీడల్లో కేవలం ప్రతిభ మాత్రమే కాదు.. మానసిక దృఢత్వం కూడా చాలా ముఖ్యం. వైభవ్‌కు అద్భుతమైన నైపుణ్యం ఉంది. ఆ ప్రతిభతో అతడు చాలా సంవత్సరాల పాటు భారత జట్టుకు సేవలందించేలా మేము చూసుకుంటాం’ అని ధుమాల్ తెలిపారు.

ప్రతి క్రికెటర్ కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమేనని, వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుఒత్తిడులను ఎలా ఎదుర్కొంటాడన్న దానిపై ఆధారపడి ఉంటుందని అరుణ్ ధుమాల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వైభవ్ భుజాలపై భారీ బాధ్యత ఉంది. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను గెలిపించి.. ఫైనల్‌కు తీసుకెళ్లాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు. ఎలిమినేటర్‌లో ముందుగా పటిష్టమైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టును ఎదుర్కోవాల్సి ఉంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసక బ్యాటర్లతో ఉన్న ఎస్ఆర్‌హెచ్‌ను ఓడించడం ఆర్ఆర్‌కు అంత సులభం కాదు. ఆ అడ్డంకిని దాటితే క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడాల్సి ఉంటుంది.

ఇప్పటివరకు ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో నాలుగో స్థానంలో నిలిచిన జట్టు టైటిల్ గెలిచిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఆ చరిత్రను తిరగరాయాలంటే.. వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాట్‌తో మ్యాజిక్ చేయాల్సిందే. యువ సంచలనం వైభవ్ మీద అంచనాలు భారీగా ఉన్నప్పటికీ.. అతడిని సరైన విధంగా గైడ్ చేయాల్సిన బాధ్యత బీసీసీఐ, ఫ్రాంచైజీలపై ఉందనే అభిప్రాయం బలపడుతోంది. లిమినేటర్ మ్యాచ్‌లో బుడ్డోడు ఎలా ఆడుతాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News