Virat kohli: టెస్టు క్రికెట్‌కు తిరిగి వస్తారా?.. కోహ్లీ సమాధానం ఇదే!

Virat Kohli on Test Cricket Comeback: విరాట్ కోహ్లీ తన క్రికెట్ భవిష్యత్తుపై నెలకొన్న ఊహాగానాలకు మరోసారి స్పష్టత ఇచ్చాడు.

Update: 2026-06-22 13:50 GMT

Virat kohli: టెస్టు క్రికెట్‌కు తిరిగి వస్తారా?.. కోహ్లీ సమాధానం ఇదే!

Virat kohli: భారత క్రికెట్ దిగ్గజం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ తన క్రికెట్ భవిష్యత్తుపై నెలకొన్న ఊహాగానాలకు మరోసారి స్పష్టత ఇచ్చాడు. టెస్టు క్రికెట్‌కు తిరిగి వస్తారా? అనే ప్రశ్నకు కింగ్ కోహ్లీ స్పష్టమైన సమాధానం ఇచ్చాడు. తాను టెస్టు క్రికెట్‌ను పూర్తిగా ముగించానని, మళ్లీ ఆడే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. ఢిల్లీలో జరిగిన వన్8 (one8) స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్ కార్యక్రమంలో పాల్గొన్నవిరాట్ కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. తాను మిగతా వాళ్లలా మనసు మార్చుకోమని, టెస్టు క్రికెట్‌లో రీఎంట్రీ ఉండదని గతంలో కూడా కింగ్ చెప్పిన విషయం తెలిసిందే.

వన్8 కార్యక్రమంలో ప్రముఖ హోస్ట్, కమెడియన్ డానిష్ సైత్ ఓ ఆసక్తికర ప్రశ్నను విరాట్ కోహ్లీని అడిగాడు. వన్8 బ్రాండ్‌లోని ఒక షూ ధర రూ.9,230గా ఉందని.. అదే సంఖ్య కోహ్లీ టెస్టు కెరీర్‌లో చేసిన పరుగుల సంఖ్య కూడా అని గుర్తు చేశాడు. 'మరిన్ని పరుగులు చేసి ఆ సంఖ్యను పెంచేందుకు టెస్టు క్రికెట్‌కు తిరిగి వస్తారా?' అని ప్రశ్నించగా.. కోహ్లీ నవ్వుతూ 'నేను టెస్టు క్రికెట్‌ ఆడడం కంటే.. షూ ధరనే తగ్గిస్తే సరిపోతుంది కదా. నేను టెస్టు క్రికెట్‌ను పూర్తిగా ముగించాను. మరలా ఆడే ఆలోచన నాకు లేదు. వీడ్కోలు చెప్పి.. మరలా ఆడడం నచ్చదు. కొందరు రీఎంట్రీలు ఇస్తారు. నేను లా చేయను. నిర్ణయం ఒకేసారి తీసుకోవాలి' అని బదులిచ్చాడు.

విరాట్ కోహ్లీ గత ఏడాది మే నెలలో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో కింగ్ భారత టెస్టు క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించాడు. 123 టెస్టులు ఆడిన కోహ్లీ.. 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 శతకాలు, 31 అర్ధశతకాలు ఉన్నాయి. టెస్టుల్లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 254 నాటౌట్.

భారత తరఫున అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్ తర్వాత కింగ్ నాలుగో స్థానంలో నిలిచాడు. ప్రత్యేకంగా 2016 నుంచి 2019 మధ్యకాలం కోహ్లీ టెస్టు కెరీర్‌లో స్వర్ణయుగంగా చెప్పవచ్చు. ఆ నాలుగేళ్లలో 43 టెస్టుల్లో 66.79 సగటుతో 4,208 పరుగులు చేశాడు. 16 శతకాలు, 10 అర్ధశతకాలతో ప్రపంచ క్రికెట్‌ను శాసించాడు. ఈ కాలంలో ఏకంగా ఏడు డబుల్ సెంచరీలు సాధించి టెస్టు చరిత్రలో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన కెప్టెన్‌గా నిలిచాడు.

కెప్టెన్‌గా కూడా విరాట్ కోహ్లీ భారత జట్టుకు అపూర్వ విజయాలు అందించాడు. 2014లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా మహేంద్ర సింగ్ ధోనీ గైర్హాజరీలో టెస్టు కెప్టెన్సీ చేపట్టిన కోహ్లీ.. మొత్తం 68 టెస్టుల్లో భారత్‌కు నాయకత్వం వహించి 40 విజయాలు అందించాడు. భారత టెస్టు చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఇప్పటికీ విరాటే అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ సందర్భంగా తన స్వస్థలమైన ఢిల్లీతో ఉన్న అనుబంధాన్ని కూడా కోహ్లీ గుర్తు చేసుకున్నాడు.

'నా జీవితం, క్రికెట్ ప్రయాణం అన్నీ ఢిల్లీలోనే ప్రారంభమయ్యాయి. నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడే క్రికెట్ నేర్చుకున్నాను. అందుకే వన్8 బ్రాండ్‌ను ఢిల్లీలో ప్రారంభించడం నాకు చాలా ప్రత్యేకం. అభిమానుల ప్రేమ, మద్దతు వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను' అని కోహ్లీ భావోద్వేగం చెందాడు టెస్టు క్రికెట్‌కు తిరిగి వస్తాడనే ఆశతో ఉన్న అభిమానులకు కోహ్లీ వ్యాఖ్యలు నిరాశకలిగించాయి. ఇకపై కింగ్ వన్డే క్రికెట్‌పైనే పూర్తిగా దృష్టి సారించనున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా తన కెరీర్‌ను కొనసాగించనున్నాడు.

Tags:    

Similar News