Vaibhav Sooryavanshi: ఫైనల్లో 29 బంతుల్లో 94 రన్స్.. ఆ చిన్న సలహానే వైభవ్ ఆటను మార్చేసింది!
Vaibhav Sooryavanshi Reveals 94 Innings Success: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన అసాధారణ ప్రతిభను చాటుకున్నాడు.
Vaibhav Sooryavanshi: ఫైనల్లో 29 బంతుల్లో 94 రన్స్.. ఆ చిన్న సలహానే వైభవ్ ఆటను మార్చేసింది!
Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన అసాధారణ ప్రతిభను చాటుకున్నాడు. శ్రీలంక-ఏతో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేసి భారత్-ఏ జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. టోర్నమెంట్ మొత్తం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఈ 15 ఏళ్ల కుర్రాడు.. కీలకమైన ఫైనల్లో మాత్రం చెలరేగి ఆడి భారత జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. వైభవ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో భారత్-ఏ జట్టు శ్రీలంక-ఏపై 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం వైభవ్ తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు.
ట్రై సిరీస్ టోర్నీలో వరుసగా తక్కువ పరుగులు చేయడంతో తాను తీవ్ర నిరాశకు గురయ్యానని వైభవ్ సూర్యవంశీ చెప్పాడు. ఆ సమయంలో భారత్-ఏ కోచ్ హృషీకేశ్ కానిట్కర్‌తో ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలిపాడు. తన ఆటలో ఎక్కడ తప్పు జరుగుతోందో చర్చించగా.. కోచ్ తనకు కీలకమైన సలహా ఇచ్చారని వెల్లడించాడు. 'ట్రై సిరీస్లో నేను ఎక్కువగా పరుగులు చేయలేదు. అప్పుడు హృషీ సర్‌తో కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడాను. ఆయన నన్ను ఎలాంటి ఒత్తిడి లేకుండా సహజంగా ఆడమని చెప్పారు. నీ నేచురల్ గేమ్ ఆడు.. ఎక్కువగా ఆలోచించకు అని సూచించారు. ఆ మాటలు నాకు ఎంతో ధైర్యం ఇచ్చాయి. నా సామర్థ్యంపై నమ్మకం ఉంచి ఆడాను. చివరకు పరుగులు చేశాను. చాలా సంతోషంగా అనిపించింది' అని వైభవ్ చెప్పాడు.
ఐపీఎల్‌లో బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లపై ఆడిన తర్వాత శ్రీలంకలోని పరిస్థితులకు అలవాటు పడటం తనకు కాస్త కష్టంగా అనిపించిందని యువ బ్యాటర్ వైభవ్ అంగీకరించాడు. లంక పిచ్‌లు పూర్తిగా భిన్నంగా ఉండటంతో మొదట్లో ఎక్కువగా ప్రయత్నించానని, అదే తన ఆటపై ప్రభావం చూపిందని తెలిపాడు. 'శ్రీలంకలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అందుకే ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. నేను చాలా ఎక్కువగా ప్రయత్నించాను. కానీ నా ప్రణాళికలను అమలు చేయలేకపోయాను. ఆ తర్వాత సహజ ఆటను కొనసాగించడంతో అన్నీ సవ్యంగా జరిగాయి' అని వివరించాడు.
ఇక వైభవ్ సూర్యవంశీ తదుపరి లక్ష్యం ఐర్లాండ్ పర్యటన. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 776 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించిన బుడ్డోడికి తొలిసారి భారత సీనియర్ జట్టులో చోటు దక్కింది. ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో అతడు అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ అనంతరం ట్రై సిరీస్ ఫైనల్లో ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో వైభవ్ మరోసారి తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకున్నాడు. ఒత్తిడిని అధిగమించి కీలక సమయంలో జట్టుకు విజయాన్ని అందించగలడని చూపించిన ఈ యువ స్టార్.. భారత క్రికెట్ భవిష్యత్తుగా ప్రశంసలు అందుకుంటున్నాడు.