బౌలింగ్‌లో అదరగొట్టిన వైభవ్‌.. 4 బంతుల్లోనే 2 వికెట్లు.. డబుల్ ధమాకా వీడియో చూడాల్సిందే!

Vaibhav Sooryavanshi Bowling. టీమిండియా యంగ్‌ సెన్సేషన్‌ వైభవ్‌ సూర్యవంశీ బ్యాటింగ్‌లోనే కాదు.. బౌలింగ్‌లోనూ అదరగొడుతున్నాడు.

Update: 2026-08-25 12:07 GMT

బౌలింగ్‌లో అదరగొట్టిన వైభవ్‌.. 4 బంతుల్లోనే 2 వికెట్లు.. డబుల్ ధమాకా వీడియో చూడాల్సిందే!

Vaibhav Sooryavanshi Bowling: టీమిండియా యంగ్‌ సెన్సేషన్‌ వైభవ్‌ సూర్యవంశీ బ్యాటింగ్‌లోనే కాదు.. బౌలింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. దులీప్‌ ట్రోఫీ 2026లో నాలుగు బంతుల్లోనే ఏకంగా 2 వికెట్లు తీశాడు. ఈస్ట్‌ జోన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్‌.. బెంగళూరులో నార్త్‌ ఈస్ట్‌ జోన్‌తో జరుగుతున్న ఫస్ట్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌ మ్యాచ్ మూడో రోజులో బౌలింగ్‌ చేశాడు.

తన రెండో ఓవర్‌లో 4 బంతుల్లోనే 2 వికెట్లు పడగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను బీసీసీఐ డొమెస్టిక్‌ తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ఈ వీడియోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.

ఈస్ట్‌ జోన్‌, నార్త్‌ ఈస్ట్‌ జోన్‌ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం 15 ఏళ్ల వయసులోనే దులీప్ ట్రోఫీలో ఆడే అవకాశం దక్కించుకున్న బుడ్డోడు.. టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్‌కు డిప్యూటీగా బరిలోకి దిగాడు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు.

మణిపూర్ పేసర్ బిష్వోర్జిత్ కొంతౌజామ్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన వైభవ్.. అదే ఓవర్‌లో ఆరో బంతికి ఔటయ్యాడు. దీంతో కేవలం 6 బంతులు ఎదుర్కొని 8 పరుగులతో వైభవ్ వెనుదిరిగాడు. బుడ్డోడి వికెట్ పడగానే ప్రత్యర్థులు సంబరాలు చేసుకున్నారు.

బ్యాటింగ్‌లో నిరాశపర్చిన సూర్యవంశీ వైభవ్ బౌలింగ్‌లో చెలరేగాడు. నార్త్ ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 111 పరుగులకే ఆలౌట్ కావడంతో ఈస్ట్‌ జోన్ ఫాలోఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ నార్త్ ఈస్ట్ జోన్ బ్యాటర్లు తేలిపోయారు. ఒకే ఓవర్‌లో కిషన్ లింగ్‌డో (25), ఇమ్లివాటి లెమ్టూర్ (4)లను వైభవ్ ఔట్ చేశాడు.

వైభవ్ వేసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌కు బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీయడంతో అతడి బౌలింగ్ ప్రతిభ కూడా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రదర్శనపై బీసీసీఐ కూడా స్పందించింది. వైభవ్ రెండు వికెట్లు తీయడంతో పాటు రెండు అద్భుతమైన క్యాచ్‌లు కూడా అందుకున్నాడని సోషల్ మీడియాలో ప్రశంసించింది.

ఈ మ్యాచ్‌లో మరో ఆసక్తికరమైన విషయం నెటిజెన్ల దృష్టిని ఆకర్షించింది. వైభవ్ సూర్యవంశీ ధరించిన దులీప్ ట్రోఫీ జెర్సీపై నంబర్‌లో కొంత భాగాన్ని టేప్‌ అంటించారు. దాంతో జెర్సీపై కేవలం ‘3’ నంబర్ మాత్రమే స్పష్టంగా కనిపించింది. ఇలా ఎందుకు చేశాడనే దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

అయితే ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ ధరించే జెర్సీ నంబర్ కూడా ‘3’ కావడం గమనార్హం. దులీప్ ట్రోఫీ జెర్సీపై నంబర్ ముద్రణలో ఏదైనా సమస్య ఉండటంతో ఇలా టేప్ వేసి ఉండొచ్చని అభిమానులు అంటున్నారు.

ఈస్ట్ జోన్ ఈ మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలుత సుదీప్ కుమార్ ఘరామి 146, షాబాజ్ అహ్మద్ 167 పరుగులతో చెలరేగడంతో ఈస్ట్ జోన్ 467 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బౌలర్లు నార్త్ ఈస్ట్ జోన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 111 పరుగులకే కట్టడి చేశారు.

దీంతో నార్త్ ఈస్ట్ జోన్‌ ఫాలోఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ నార్త్ ఈస్ట్ జోన్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఈస్ట్ జోన్ భారీ విజయానికి చేరువైంది. దులీప్ ట్రోఫీ అరంగేట్రంలో బ్యాటర్‌గా వైభవ్ నిరాశపరిచినా.. బౌలర్‌గా, ఫీల్డర్‌గా మాత్రం సత్తా చాటాడు. 15 ఏళ్ల వయసులోనే కీలక దేశవాళీ టోర్నీలో వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి.. బౌలింగ్‌లో రెండు వికెట్లు, ఫీల్డింగ్‌లో రెండు క్యాచ్‌లు అందుకోవడం అతడి ఆల్‌రౌండ్ ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.


Tags:    

Similar News