IND VS IRE: టీమిండియాలోకి పంజాబ్ కింగ్స్ స్టార్ ఎంట్రీ.. ఎవరూ ఊహించలేరు!

Suryansh Shedge Replaces Nitish Reddy: నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో పీబీకేఎస్ స్టార్ ఆల్‌రౌండర్ భారత జట్టులోకి వచ్చాడు.

Update: 2026-06-23 12:50 GMT

IND VS IRE: టీమిండియాలోకి పంజాబ్ కింగ్స్ స్టార్ ఎంట్రీ.. ఎవరూ ఊహించలేరు!

IND VS IRE: ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లకు భారత యువ ఆల్‌రౌండర్, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్థానంలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) స్టార్ ఆల్‌రౌండర్ సూర్యాంశ్‌ షెడ్జె భారత జట్టులోకి వచ్చాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. 23 ఏళ్ల సూర్యాంశ్‌కు భారత జాతీయ జట్టు నుంచి పిలుపు రావడం ఇదే మొదటిసారి.

ఇటీవల అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌ ఆడుతుండగా నితీశ్ రెడ్డి గాయపడిన సంగతి తెలిసిందే. మూడో వన్డే అనంతరం అతడి ఎడమ కాలి క్వాడ్రిసెప్స్ (తొడ కండరాలు) భాగంలో గాయం అయింది. అనంతరం నిర్వహించిన ఎంఆర్ఐ స్కాన్‌లో కండరాల వాపుతో పాటు ఫైబర్ డిస్రప్షన్ ఉన్నట్లు తేలింది. దీంతో అతడికి విశ్రాంతి అవసరమని బీసీసీఐ వైద్య బృందం సూచించింది. కనీసం నాలుగు వారాల పాటు పునరావాస ప్రక్రియ అవసరం అయింది. దాంతో ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌ల నుంచి నితీశ్ రెడ్డి తప్పుకున్నాడు. నితీశ్ స్థానాన్ని సూర్యాంశ్‌ షెడ్జె భర్తీ చేయనున్నాడు.

ఇటీవల శ్రీలంకలో జరిగిన ట్రై సిరీస్‌లో ఇండియా-ఏ జట్టు తరఫున సూర్యాంశ్‌ షెడ్జె అద్భుత ప్రదర్శన చేశాడు. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ ఐదు మ్యాచ్‌ల్లో 147 పరుగులు బాదాడు. బంతితో కూడా ప్రభావం చూపాడు. టోర్నమెంట్‌లో మొత్తం 23 ఓవర్లు బౌలింగ్ చేసి తన ఆల్‌రౌండ్ సామర్థ్యాన్ని నిరూపించాడు. దేశవాళీ క్రికెట్‌లో కూడా సూర్యాంశ్‌ ఆకట్టుకున్నాడు. 2024-25 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ 251.92 స్ట్రైక్‌రేట్‌తో 131 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడి దూకుడు ఆటతీరు, బహుముఖ ప్రతిభ కారణంగానే బీసీసీఐ సెలెక్టర్లు అతడికి జాతీయ జట్టులో అవకాశం ఇచ్చారు.

'రాబోయే ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌ల కోసం నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో సూర్యాంశ్‌ షెడ్జెను భారత జట్టులోకి ఎంపిక చేసినట్లు పురుషుల సెలెక్షన్ కమిటీ నిర్ణయించింది' అని బీసీసీఐ పేర్కొంది. హార్దిక్ పాండ్య కూడా క్వాడ్రిసెప్స్ సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో నితీశ్ రెడ్డి జట్టుకు కీలక ఎంపికగా భావించారు. అయితే ఇప్పుడు గాయం కారణంగా అతడు దూరం కావడంతో సూర్యాంశ్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభించింది. ఐర్లాండ్ పర్యటనలో అతడు అరంగేట్రం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Tags:    

Similar News