ఎంట్రీ ఇచ్చి ఏడాదే.. టీ20 క్రికెట్‌లో వరల్డ్ నంబర్-1.. తెలుగమ్మాయి సూపర్!
Sree Charani: భారత మహిళల క్రికెట్ జట్టు యువ స్పిన్నర్ ఎన్. శ్రీ చరణి అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించింది.
ఎంట్రీ ఇచ్చి ఏడాదే.. టీ20 క్రికెట్‌లో వరల్డ్ నంబర్-1.. తెలుగమ్మాయి సూపర్!
Sree Charani: భారత మహిళల క్రికెట్ జట్టు యువ స్పిన్నర్ ఎన్. శ్రీ చరణి అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 అంతర్జాతీయ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో శ్రీ చరణి ప్రపంచ నంబర్-1 బౌలర్‌గా నిలిచింది. 21 ఏళ్ల వయసులోనే ఈ ఘనత అందుకోవడం విశేషం. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో అద్భుత ప్రదర్శనకు గాను వరల్డ్ నంబర్-1 ర్యాంక్ దక్కింది. గతేడాది జూన్ 28న ఇంగ్లండ్‌తో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లోకి శ్రీ చరణి అడుగుపెట్టింది. ఎంట్రీ ఇచ్చిన ఏడాదిలోనే ఈ స్థాయికి చేరుకోవడం అంత ఈజీ విషయం కాదు.
ప్రపంచకప్ 2026లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన శ్రీ చరణి.. 10 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతోంది. 6.40 సగటు, 5.33 ఎకానమీతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తూ భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ప్రదర్శనతో ఇంగ్లండ్ స్పిన్నర్ లిన్సే స్మిత్‌ను వెనక్కి నెట్టి.. అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం చార్లీ డీన్ రెండో స్థానంలో ఉండగా.. లిన్సే స్మిత్ మూడో స్థానానికి పడిపోయింది. అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కేవలం ఏడాదికే ప్రపంచ నంబర్-1 బౌలర్‌గా ఎదగడం శ్రీ చరణి ప్రతిభకు నిదర్శనం.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ స్పిన్నర్ శ్రీ చరణి 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో కూడా భారత జట్టు విజయానికి కీలకంగా మారింది. స్వదేశంలో జరిగిన ఆ టోర్నీలో తొమ్మిది మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి భారత్ టైటిల్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించింది. తన కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, సూపర్ వేరియేషన్లతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు అదే ఫామ్‌ను టీ20 ప్రపంచకప్‌లోనూ కొనసాగిస్తోంది. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ మ్యాచ్ గమనాన్ని మార్చగల సామర్థ్యాన్ని శ్రీ చరణి మరోసారి నిరూపిస్తోంది. ఆమె ప్రదర్శనతో భారత జట్టు సెమీఫైనల్ అవకాశాలు కూడా మరింత బలపడ్డాయి.
మరోవైపు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ జార్జియా వోల్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆసీస్ ప్లేయర్స్ బెత్ మూనీ రెండో స్థానానికి చేరుకుంది. భారత ఆటగాళ్లు షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ ఒక్కో స్థానం మెరుగుపరుచుకుని వరుసగా ఆరో, పదో స్థానాల్లో నిలిచారు. ఆల్‌రౌండర్ల జాబితాలో వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ నంబర్-1 స్థానాన్ని కాపాడుకుంది. న్యూజిలాండ్ స్టార్ మెలీ కెర్ రెండో స్థానంలో ఉంది. భారత సీనియర్ స్పిన్నర్ దీప్తి శర్మ ర్యాంకింగ్స్‌లో కాస్త వెనుకబడింది. ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసినప్పటికీ.. తాజా ర్యాంకింగ్స్‌లో ఆమె ఎనిమిదో స్థానానికి పడిపోయింది.
ప్రపంచ క్రికెట్‌లో అగ్రస్థానానికి చేరుకున్న శ్రీ చరణి ప్రస్తుతం భారత మహిళల క్రికెట్‌కు కొత్త ఆశాకిరణంగా మారింది. అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఏడాదిలోనే ప్రపంచ నంబర్-1 బౌలర్‌గా ఎదిగిన ఆమె ప్రయాణం భారత క్రికెట్ అభిమానులకు గర్వకారణంగా నిలిచింది. శ్రీ చరణి ప్రపంచ నంబర్ 1 టీ20 బౌలర్‌గా నిలవడంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతిభ, పట్టుదల, కఠోర శ్రమ ఉంటే.. తప్పక విజయం దక్కుతుందని చెప్పడానికి శ్రీచరణి నిదర్శనమన్నారు.