Vaibhav Sooryavanshi: ఆ విషయం మర్చిపోయారా?.. క్రికెట్ దిగ్గజాలకు ఇచ్చిపడేసిన అశ్విన్!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై వస్తున్న విమర్శలకు అశ్విన్ మద్దతుగా నిలిచాడు.
Vaibhav Sooryavanshi: ఆ విషయం మర్చిపోయారా?.. క్రికెట్ దిగ్గజాలకు ఇచ్చిపడేసిన అశ్విన్!
Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై వస్తున్న విమర్శలకు టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మద్దతుగా నిలిచాడు. ఇటీవల ముగిసిన ట్రై సిరీస్ ‘ఏ’లో భారత్-ఏ తరఫున ఆడిన వైభవ్.. అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
అయితే శ్రీలంక-ఏతో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాడితో జరిగిన వాగ్వాదం కారణంగా విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఈ నేథ్యంలో స్పందించిన అశ్విన్.. 15 ఏళ్ల బాలుడిని లక్ష్యంగా చేసుకుని విమర్శించడం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. మనం కూడా ఒకప్పుడు చిన్నవారిమే అని, ఆ విషయం చాలా మంది మర్చిపోయినట్లు ఉన్నారు? అని ఫైర్ అయ్యాడు.
శ్రీలంక-ఏతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో స్లెడ్జింగ్ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ, ప్రత్యర్థి ఆటగాడి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సందర్భంగా వైభవ్ ప్రత్యర్థిని తోసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కొంతమంది అభిమానులు, మాజీ ఆటగాళ్లు అతడికి మరింత పరిపక్వత అవసరమని వ్యాఖ్యానించారు. అయితే అశ్విన్ మాత్రం ఈ విమర్శలను ఖండించాడు.
తన యూట్యూబ్ ఛానెల్ ‘అశ్ కీ బాత్’లో మాట్లాడిన అశ్విన్.. 'వైభవ్ సూర్యవంశీని ఎలా ద్వేషించగలం?. అతడు ఇతర ఆటగాళ్లతో మాట్లాడేటప్పుడు మరింత మెచ్యూరిటీ చూపాలని చాలామంది అంటున్నారు. కానీ మనం కూడా ఒకప్పుడు పిల్లలమే అన్న విషయం మర్చిపోయామా?. మన ఇళ్లలో ఉన్న పిల్లలను కూడా మర్చిపోయామా?' అంటూ ప్రశ్నించాడు.
అంతేకాకుండా వైభవ్‌ను చిన్ననాటి సచిన్ టెండూల్కర్‌తో పోల్చడంపై కూడా అశ్విన్ స్పందించాడు. 'సచిన్ ఆడిన కాలంలో భారత్-ఏ మ్యాచ్‌లను ఇంత దగ్గరగా ఎవరూ ఫాలో కాలేదు. అప్పట్లో కెమెరాలు, సోషల్ మీడియా, ఐపీఎల్ లాంటి వేదికలు కూడా లేవు. ఇప్పుడు వైభవ్‌పై ఉండే పరిశీలన, ఒత్తిడి చాలా ఎక్కువ. కాబట్టి ఇద్దరి పరిస్థితులను పోల్చడం సరికాదు' అని యాష్ వివరించాడు.
మైదానంలో జరిగే ఇలాంటి సంఘటనలను అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు చూసుకుంటారని అశ్విన్ గుర్తు చేశాడు. 'మైదానంకు దూరంగా కూర్చొని మనకు అసలు ఏమి జరిగిందో తెలియదు. ఎవరు ఏమన్నారో, అతడు ఎలా స్పందించాడో కూడా తెలియదు. ఇలాంటి సంఘటనలు క్రీడల్లో సహజం. సరైందా, తప్పా అని చర్చించవచ్చు. కానీ ఒక చిన్న ఆటగాడిపై ద్వేషాన్ని పెంచడం ప్రమాదకరమైన ధోరణి' అని హెచ్చరించాడు.
వివాదం ఒకవైపు ఉంటే.. వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్‌తో మాత్రం అందరి ప్రశంసలు అందుకున్నాడు. ట్రై సిరీస్ ఫైనల్లో కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేసి భారత్-ఏ జట్టుకు టైటిల్ అందించాడు. అదే మ్యాచ్‌లో లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును కూడా నెలకొల్పాడు. కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం సాధించి తన ప్రతిభను మరోసారి నిరూపించాడు.
ఇక బుడ్డోడు ఇప్పుడు భారత సీనియర్ టీ20 జట్టుతో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు సిద్ధమవుతున్నాడు. రాబోయే సిరీస్‌ల్లో అతడు అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. చిన్న వయసులోనే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్‌కు అశ్విన్ ఇచ్చిన మద్దతు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.