IND vs AFG : అఫ్గాన్ బౌలర్లను ఆడేసుకున్న శుభ్‌మన్ గిల్.. తొలి వన్డేలో భారత్ ఘన విజయం!
IND vs AFG : భారత్, అఫ్గానిస్తాన్ తొలి వన్డేలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (84*) అద్భుత ఇన్నింగ్స్, డెబ్యూ బౌలర్ల రాణించడంతో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
shubman gill
IND vs AFG : భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా అదిరిపోయే విజయంతో సిరీస్‌ను ప్రారంభించింది. ధర్మశాలలోని అందమైన హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీనితో అంపైర్లు మ్యాచ్‌ను చెరో 25 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా అఫ్గానిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడించింది. ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 తో ముందంజ వేసింది.
అఫ్గాన్‌ను దెబ్బకొట్టిన డెబ్యూ బౌలర్లు
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ జట్టుకు ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ కొండంత అండగా నిలిచాడు. అతను భారత బౌలర్లను ఎదుర్కొంటూ కేవలం 51 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 102 పరుగుల భారీ సెంచరీ చేశాడు. అయితే గుర్బాజ్ మినహా మిగిలిన అఫ్గాన్ బ్యాటర్లు ఎవరూ క్రీజులో ఎక్కువసేపు నిలబడలేకపోయారు. ముఖ్యంగా భారత్ తరఫున వన్డేల్లో డెబ్యూ చేసిన యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్, స్పిన్నర్ హర్ష్ దూబేలు అద్భుతమైన బౌలింగ్‌తో అఫ్గాన్ వికెట్లను కూల్చారు. వీరిద్దరూ చెరో 3 వికెట్లు పడగొట్టడంతో అఫ్గానిస్తాన్ జట్టు 24.5 ఓవర్లలో 194 పరుగులకే ఆల్‌అవుట్ అయింది.
రోహిత్ రనౌట్.. ఇషాన్ కిషన్ విధ్వంసం
195 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. అయితే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 16 పరుగులు చేసి దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ రాగానే అఫ్గాన్ బౌలర్లపై దాడికి దిగాడు. కేవలం 22 బంతుల్లోనే 34 పరుగులు చేసి మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పేశాడు. శ్రేయస్ అయ్యర్ తక్కువ పరుగులకే అవుట్ అయినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ క్రీజులో పాతుకుపోయాడు.
ముందుండి నడిపించిన కెప్టెన్ గిల్
ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాత్రం ఎక్కడా తొందరపడకుండా క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. మైదానం నలుమూలలా అద్భుతమైన షాట్లతో అలరించిన గిల్.. అఫ్గాన్ స్పిన్ దిగ్గజం రషీద్ ఖాన్‌ను సైతం సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. గిల్ కేవలం 66 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి తోడుగా కేఎల్ రాహుల్ కూడా 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి బాధ్యతాయుతమైన బ్యాటింగ్ వల్ల టీమిండియా 22.5 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది.
వరల్డ్ కప్ సన్నాహకాలకు శుభారంభం
వచ్చే ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్ కోసం యువ ఆటగాళ్లను సిద్ధం చేసే క్రమంలో భారత్‌కు ఈ విజయం ఎంతో కీలకంగా మారింది. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్లు జట్టులో లేకపోయినా.. యువ బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఒత్తిడిని అధిగమించి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడటం భారత జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇదే జోరుతో తదుపరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది.