IND vs AFG ODI: మాకు ఎక్కువ సమయం లేదు.. అందుకే జైస్వాల్‌ను తప్పించాం!
IND vs AFG ODI: వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని భారత జట్టు ప్రయోగాలను కొనసాగిస్తోంది.
IND vs AFG ODI: మాకు ఎక్కువ సమయం లేదు.. అందుకే జైస్వాల్‌ను తప్పించాం!
IND vs AFG ODI: వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని భారత జట్టు ప్రయోగాలను కొనసాగిస్తోంది. ధర్మశాల వేదికగా అఫ్గానిస్థాన్‌తో ప్రారంభమైన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమవడంతో.. అంపైర్లు 25 ఓవర్లకు కుదించారు. ప్రతి జట్టు ఐదుగురు బౌలర్లను ఉపయోగించుకోవచ్చని, ఒక్కో బౌలర్ గరిష్టంగా ఐదు ఓవర్లు వేయాల్సి ఉంటుందని మ్యాచ్ నిర్వాహకులు ప్రకటించారు.
ఈ మ్యాచ్‌కు పలువురు టీమిండియా కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. సీనియర్ స్టార్‌లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్ విశ్రాంతి/గాయాల కారణంగా అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తూ భారత జట్టు కొత్త కాంబినేషన్లను పరీక్షిస్తోంది. ఐపీఎల్ 2026లో అదరగొట్టిన యశస్వి జైస్వాల్ తుది జట్టులోకి ఎంపిక కాలేదు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఆడనుండడంతో జైస్వాల్‌కు చోటు లేకుండా పోయింది. టాస్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ గిల్.. జట్టులో విభిన్న కాంబినేషన్లను పరీక్షించడం ప్రధాన లక్ష్యమని తెలిపాడు.
'వాతావరణం మేఘావృతంగా ఉండటంతో ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది బౌలర్లకు అనుకూలిస్తుందని భావిస్తున్నాను. పిచ్ చాలా బాగుంది. బ్యాటింగ్ చేయడానికి ఇది మంచి వికెట్ అని నా అభిప్రాయం. వచ్చే ప్రపంచ కప్‌కు ముందు మాకు సుమారు 15 నుంచి 20 వన్డే మ్యాచ్‌లు ఉన్నాయి. ఇంకా ఎక్కువగా సమయం లేదు. నిజాయితీగా చెప్పాలంటే.. ఈ సిరీస్‌లో మా ప్రధాన ఉద్దేశ్యం వివిధ కాంబినేషన్లను పరీక్షించడం. ఏ కాంబినేషన్ బాగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు కొత్త ప్రయోగాలు చేస్తున్నాం. ఈ క్రమంలోనే జైస్వాల్‌కు చోటు ఇవ్వలేదు. ప్రయోగాలు చేస్తూ మా బలాలు ఏమిటో గుర్తించడం ముఖ్యం' అని గిల్ చెప్పాడు.
ఈ మ్యాచ్ ద్వారా యువ పేసర్ గుర్నూర్ బ్రార్, ఆల్‌రౌండర్ హర్ష్ దూబే అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. యశస్వి జైస్వాల్‌తో పాటు యువ పేసర్ ప్రిన్స్ యాదవ్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తున్న టీమిండియా యాజమాన్యం, ఈ సిరీస్ ద్వారా భవిష్యత్ జట్టుకు అవసరమైన ప్రత్యామ్నాయాలను గుర్తించే ప్రయత్నంలో ఉంది. హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ వంటి కొత్త ఆటగాళ్లు ఈ అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
తుది జట్లు:
భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.
అఫ్గానిస్థాన్: ఇబ్రహీం జద్రాన్, రహ్మనుల్లా గుర్బాజ్, సెదీకుల్లా అతల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రామ్ అలీఖిల్, రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్ సఫీ, ఏఎం ఘజన్‌ఫర్, జియా ఉర్ రెహ్మాన్ షరీఫీ.