ODI World Cup: వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ ఖరారు.. అక్టోబర్ 4న ప్రారంభం, ఫైనల్ ఎప్పుడంటే?
ODI World Cup: 2027 ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన ఓ కీలక సమాచారం బయటికి వచ్చింది.
ODI World Cup: వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ ఖరారు.. అక్టోబర్ 4న ప్రారంభం, ఫైనల్ ఎప్పుడంటే?
ODI World Cup: క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2027 ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన ఓ కీలక సమాచారం బయటికి వచ్చింది. ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫో నివేదిక ప్రకారం.. 2027 వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 4న ప్రారంభం కానుంది. నవంబర్ 21న ఫైనల్ మ్యాచ్‌తో మెగా టోర్నీ ముగియనుంది. ఈ టోర్నీకి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2003 తర్వాత ఆఫ్రికా ఖండంలో జరుగుతున్న తొలి పురుషుల వన్డే ప్రపంచకప్ ఇదే కావడం విశేషం. గతంలో 2003 ప్రపంచకప్‌ను దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా సంయుక్తంగా నిర్వహించాయి. ఇప్పుడు మరోసారి ఆఫ్రికా క్రికెట్‌కు ప్రపంచకప్ వేదికగా మారుతోంది.
41 మ్యాచ్‌లు దక్షిణాఫ్రికాలోనే:
దక్షిణాఫ్రికా ఇప్పటికే 2007 టీ20 ప్రపంచకప్, 2009 ఛాంపియన్స్ ట్రోఫీ, 2023 మహిళల టీ20 ప్రపంచకప్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. ఇక జింబాబ్వే, నమీబియా ఇటీవల అండర్-19 పురుషుల ప్రపంచకప్‌ను సంయుక్తంగా నిర్వహించాయి. ఈ టోర్నీలో మొత్తం 54 మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో 41 మ్యాచ్‌లు దక్షిణాఫ్రికాలోని ఎనిమిది వేదికల్లో నిర్వహించే అవకాశం ఉంది. జింబాబ్వేలో 8 నుంచి 10 మ్యాచ్‌లు జరగనున్నాయి. విక్టోరియా ఫాల్స్, హరారే స్పోర్ట్స్ క్లబ్, బులావాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికలుగా ఉండనున్నాయి. నమీబియాకు మూడు మ్యాచ్‌ల ఆతిథ్య బాధ్యతలు దక్కనున్నాయి. జింబాబ్వేలో కొత్తగా నిర్మించిన ఫాలే మోసి-ఓ-టున్యా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఈ ప్రపంచకప్‌లో కీలక వేదికగా మారే అవకాశం ఉంది.
మళ్లీ 14 జట్ల ఫార్మాట్:
గత రెండు వన్డే ప్రపంచకప్ ఎడిషన్లలో 10 జట్లు మాత్రమే పాల్గొన్నాయి. అయితే 2027 టోర్నీలో మళ్లీ 14 జట్ల ఫార్మాట్‌ను ఐసీసీ అమలు చేయనుంది. 14 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూపులో ఏడు జట్లు ఉంటాయి. గ్రూప్ దశ ముగిసిన తర్వాత తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ దశకు అర్హత సాధిస్తాయి. ఆపై సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి.
దక్షిణాఫ్రికా, జింబాబ్వేకు నేరుగా అర్హత:
ఆతిథ్య దేశాల్లో ఒకటైన దక్షిణాఫ్రికా, పూర్తి సభ్య దేశం కావడంతో జింబాబ్వే నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. అయితే నమీబియా మాత్రం అర్హత టోర్నీల ద్వారా ప్రపంచకప్‌లో స్థానం సంపాదించుకోవాల్సి ఉంటుంది. 2027-2031 ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP) చక్రంలో నిర్వహించే తొలి ఐసీసీ ఈవెంట్ 2027 వన్డే ప్రపంచకప్. భవిష్యత్ ద్వైపాక్షిక సిరీస్‌లు, అంతర్జాతీయ షెడ్యూల్‌కు ఇదే ప్రారంభ బిందువుగా నిలవనుంది.
హాంకాంగ్‌లో ఐసీసీ సమావేశం:
అదే సమయంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విస్తరణ, 12 పూర్తి సభ్య దేశాలకు చోటు కల్పించడం, ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్‌లను కూడా డబ్ల్యూటీసీలో భాగం చేయాలా అనే అంశాలపై ఐసీసీ చర్చలు కొనసాగిస్తోంది. ఈ విషయాలపై తుది నిర్ణయాలు ఈ ఏడాది హాంకాంగ్‌లో జరిగే ఐసీసీ సమావేశాల్లో వెలువడే అవకాశం ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ కోసం క్రికెట్ ప్రపంచం ఇప్పటినుంచే ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఆఫ్రికా గడ్డపై మరోసారి ప్రపంచ ఛాంపియన్‌ను నిర్ణయించే పోరు జరగనుంది. త్వరలోనే ఈ షెడ్యూల్ పై ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన రానుంది.