IND vs PAK: ఎవరిపై ఓడినా పర్లేదు, పాకిస్థాన్‌పై మాత్రం ఓడిపోవద్దు.. భారత స్టార్ ప్లేయర్ వాచ్‌మన్!

IND vs PAK: ఆదివారం భారత్-పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

Update: 2026-06-13 11:37 GMT

IND vs PAK: ఎవరిపై ఓడినా పర్లేదు, పాకిస్థాన్‌పై మాత్రం ఓడిపోవద్దు.. భారత స్టార్ ప్లేయర్ వాచ్‌మన్!

IND vs PAK: ఇంగ్లాండ్‌ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026 ఆరంభం అయింది. టోర్నీ మొదటి మ్యాచ్‌లో శ్రీలంకపై ఆతిథ్య ఇంగ్లాండ్‌ ఘన విజయం సాధించింది. ఆదివారం (జూన్ 14) భారత్-పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రేపు రాత్రి 7 గంటలకు దాయాదుల పోరు ఆరంభం కానుంది. ఈ హై వోల్టేజ్ పోరుకు ముందు భారత స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

క్రికెట్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే ప్రత్యేకత, అభిమానుల అంచనాల వేరే లెవల్ అని పేర్కొంది. ఈ మ్యాచ్ ఒత్తిడి ఇతర మ్యాచ్‌తో పోల్చలేనిదని చెప్పింది. ఎవరిపై ఓడినా పర్లేదని, పాకిస్థాన్‌పై మాత్రం ఓడిపోవద్దని తమ అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ చెప్పాడని జెమీమా తెలిపింది.

పాకిస్థాన్‌పై మాత్రం ఓడిపోవద్దు:

జియోస్టార్‌తో మాట్లాడిన జెమీమా రోడ్రిగ్స్.. తన తొలి భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అనుభవాన్ని గుర్తుచేసుకుంది. 'నేను నా మొదటి భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ ఆడడం నాకు గుర్తుంది. ఆ మ్యాచ్‌కు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ మాతో మాట్లాడింది. బయట నుంచి ఒత్తిడి ఉంటుందని, దాన్ని మనం అధిగమించాలి. ఈ రెండు దేశాల మధ్య ఉన్న చరిత్రను, అభిమానుల అంచనాలను అస్సలు మర్చిపోవద్దని చెప్పింది' అని వెల్లడించింది.

భారత్‌లో దాయాదుల పోటీపై ఎంతటి భావోద్వేగం ఉంటుందో చెబుతూ జెమీమా ఓ ఆసక్తికర సంఘటనను పంచుకుంది. 'మా అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ కూడా ఎవరితో నైనా ఓడిపోండి, కానీ పాకిస్థాన్‌తో మాత్రం ఓడిపోవద్దు అని చెబుతుంటాడు. భారత్-పాక్ పోరుపై ప్రజలకు ఎంతటి ఆసక్తి ఉందో అది తెలియజేస్తుంది' అని చెప్పింది.

మనసులో ఊహించుకున్నాం:

భారత జట్టు దృష్టి కేవలం పాకిస్థాన్ మ్యాచ్‌పైనే కాకుండా ప్రపంచకప్ ట్రోఫీని గెలవడంపైనే ఉందని జెమీమా రోడ్రిగ్స్ స్పష్టం చేసింది. 'ప్రపంచకప్ ట్రోఫీని గెలవడమే మా లక్ష్యం. ఈ ఉదయం కూడా మేమంతా కలిసి ట్రోఫీని గెలిచిన దృశ్యాన్ని మనసులో ఊహించుకున్నాం. ఏదైనా లక్ష్యాన్ని పదేపదే ఊహిస్తే.. దాన్ని సాధించే దిశగా మనం ప్రయాణిస్తామని మేము నమ్ముతాం' అని పేర్కొంది.

జట్టు సన్నాహకాల గురించి మాట్లాడుతూ.. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నామని తెలిపింది. 'ప్రతి మ్యాచ్‌కు వేర్వేరు ప్రణాళికలతో సిద్ధమవుతాం. శిక్షణలోనే ఒత్తిడి పరిస్థితులను సృష్టించి వాటిని ఎలా ఎదుర్కోవాలో సాధన చేస్తున్నాం. మ్యాచ్‌లో ఎదురయ్యే సవాళ్లకు ముందుగానే సిద్ధమవ్వడమే మా లక్ష్యం' అని జెమీమా వివరించింది.

మేమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం:

ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో ఆశించిన ఫలితాలు రాకపోయినా,.. ఆ పరాజయాల నుంచి విలువైన పాఠాలు నేర్చుకున్నామని జెమీమా చెప్పింది. 'కొన్నిసార్లు ఓటమి విజయానికి కంటే ఎక్కువ నేర్పుతుంది. ఆ తప్పులను గుర్తించి వాటిపై పని చేశాం. ఇప్పుడు మంచి క్రికెట్ ఆడేందుకు మేమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం' అని పేర్కొంది.

మరోవైపు భారత మహిళల జట్టు ప్రధాన కోచ్ అమోల్ ముజుమ్దార్ కూడా జట్టుకు కీలక సూచనలు చేశాడు. ప్రత్యర్థి జట్టులోని ఒక ప్లేయర్‌పై మాత్రమే దృష్టి పెట్టడం సరైంది కాదని, టీ20 క్రికెట్‌లో ఏ బౌలర్ అయినా మ్యాచ్‌ను మలుపుతిప్పగలరని అన్నాడు. ఆదివారం బర్మింగ్‌హామ్ వేదికగా జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఈ పోరులో విజయం సాధించి ప్రపంచకప్ ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించాలని భారత మహిళల జట్టు చూస్తోంది.

Tags:    

Similar News