Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. అప్పుడు మీ మాట నమ్మలేదు!
Sanju Samson: Sanju Samson apology to Rohit Sharma. రోహిత్ భాయ్ చెప్పిన మాటలను తాను నమ్మలేదని, ఇప్పుడు అందుకు క్షమాపణ చెబుతున్నానని సంజు తెలిపాడు.
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. అప్పుడు మీ మాట నమ్మలేదు!
Sanju Samson: భారత్ 2026 టీ20 ప్రపంచ కప్ గెలవడంలో వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ సంజు శాంసన్ కీలక పాత్ర పోషించిన పోషించిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో జరిగిన కీలక సూపర్ 8 మ్యాచ్‌లో చెలరేగిన సంజు.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్, న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు మెగా టైటిల్ అందించాడు. టీ20 ప్రపంచ కప్ ఆరంభంలో ప్లేయింగ్ 11లో చోటు దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యానని, ఆ సమయంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తనకు ధైర్యం చెప్పి భరోసా కల్పించాడని సంజు చెప్పుకొచ్చాడు. అయితే ఆ సమయంలో రోహిత్ భాయ్ చెప్పిన మాటలను తాను నమ్మలేదని, ఇప్పుడు అందుకు క్షమాపణ చెబుతున్నానని సంజు తెలిపాడు.
జియో స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజు శాంసన్ తాజాగా మాట్లాడుతూ... 'నిజం చెప్పాలంటే.. ఆ సమయంలో రోహిత్ భాయ్ చెప్పిన మాటలను నేను అస్సలు నమ్మలేదు. అందుకు ఇప్పుడు సారీ చెబుతున్నా. రోహిత్ తన అనుభవంతో, మనస్ఫూర్తిగా నాలో ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు. కానీ జట్టులో చోటు దక్కకపోవడంతో నేను తీవ్ర నిరాశలో ఉండటంతో.. ఆయన చూసిన కోణం నాకు కనిపించలేదు. నా ముఖంలోనే నిరాశ, బాధ కనిపించేది. అయితే తర్వాత ఆయన మాటలను గుర్తు చేసుకుని నా ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చుకున్నాను. అప్పటి నుంచి అన్నీ సజావుగా సాగిపోయాయి' అని చెప్పాడు.
'టీ20 ప్రపంచ కప్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో నేను పూర్తిగా విఫలమయ్యా. ఒక్క మ్యాచ్‌లో కూడా 30 పరుగుల మార్క్ అందుకోలేక తీవ్ర నిరాశకు గురయ్యా. ప్రపంచ కప్ ప్రారంభానికి కేవలం రెండు రోజుల ముందు మాత్రమే న్యూజిలాండ్ సిరీస్ ముగిసింది. నిరాశ నుంచి కోలుకోవడానికి నాకు కనీసం వారం రోజులు పడుతుంది. నా భావాలను దాచుకోలేను. అందుకే నాలుగు లేదా ఐదు రోజులు చాలా కష్టంగా గడిచాయి. తర్వాత మెల్లగా మళ్లీ నా ఆటపై దృష్టి పెట్టగలిగాను. ఒకసారి విఫలమైతే ఇక తర్వాత ఏం చేయాలి? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నేను క్రికెట్ ఎందుకు ఆడుతున్నాను?, నా అసలు లక్ష్యం ఏమిటి? అని ఆలోచించడం ప్రారంభించాను. ప్రపంచ కప్ జరుగుతుండగానే నన్ను నేను మళ్లీ తెలుసుకున్నాను. ఆ మానసిక మార్పే నాకు కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది' అని సంజు చెప్పాడు.
సూపర్-8 దశలో వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్ తన కెరీర్‌ను మలుపు తిప్పిందని సంజు పేర్కొన్నాడు. 'వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు ప్రత్యేకంగా సిద్ధమయ్యా. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఆడటంపై మాత్రమే దృష్టి పెట్టా. ఐపీఎల్‌లోనూ, భారత జట్టు తరఫున కూడా కొన్ని ఇన్నింగ్స్‌ల్లో ప్రతిదీ అద్భుతంగా జరిగిపోతుంది. వెస్టిండీస్ మ్యాచ్ కూడా అలాంటిదే. ప్రతి షాట్ సరిగ్గా కనెక్ట్ అయింది. ఫలితాల గురించి కాకుండా ఆటను ఆస్వాదిస్తూ, ప్రక్రియపై దృష్టి పెట్టగానే అన్నీ సహజంగానే జరిగిపోయాయి.
పవర్‌ప్లే తర్వాత దూకుడుగా ఆడటమే నా సహజ శైలి. వెస్టిండీస్ మ్యాచ్‌లో పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాన్ని మార్చుకున్నా. నేను దాడి చేయాలనుకున్న ప్రతిసారి మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నాయి. అప్పుడు పరిస్థితిని అర్థం చేసుకుని ఓపికగా ఆడాల్సి వచ్చింది. అప్పుడే నాకు ఆటే గొప్ప గురువు అని అర్థమైంది. ఏ సమయంలో ఎలా ఆడాలో ఆటే మనకు నేర్పిస్తుంది' అని వివరించాడు.
మ్యాచ్ అనంతరం చేసిన సెలబ్రేషన్ గురించి కూడా సంజు స్పందించాడు. 'నేను దేవుడికి కృతజ్ఞతలు చెప్పా. కానీ అది అందరి దృష్టిని ఆకర్షించింది. నేను దేవుడిని బలంగా నమ్ముతాను. కొన్ని షాట్లు ఎలా ఆడానో నాకు కూడా ఆశ్చర్యమే కలిగింది. ఆ రోజు జట్టుకు విజయం అందించడానికి నేను ఒక సాధనంగా మారినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాను. ఆ క్షణం నా జీవితాంతం గుర్తుండిపోతుంది' అని సంజు భావోద్వేగం చెందాడు. 2026 టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియాకు సంజు హీరో అయ్యాడు. వరుసగా మూడు హాఫ్ సెంచరీలతో జట్టుకు అద్భుత విజయాలు అందించాడు.