IND vs ENG: మూడో వన్డేలో అక్కడే తేడా కొట్టింది.. లేదంటే టీమిండియా గెలిచేదే!

Parthiv Patel says India's lack of a Jos Buttler-style finisher. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓటమిపై మాజీ భారత వికెట్‌కీపర్ పార్థివ్ పటేల్ స్పందించాడు.

Update: 2026-07-20 12:59 GMT

IND vs ENG: మూడో వన్డేలో అక్కడే తేడా కొట్టింది.. లేదంటే టీమిండియా గెలిచేదే!

IND vs ENG: లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ ఓడిపోయింది. ముందుగా ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 3 వికెట్లకు 387 పరుగులు చేసింది. బెన్ డకెట్‌ (141) సెంచరీ చేయగా.. జాకబ్ బెతెల్‌ (91), జో రూట్‌ (74 నాటౌట్‌) హాఫ్ సెంచరీలు బాదారు. జోస్ బట్లర్‌ 13 బంతుల్లో 41 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఛేదనలో భారత్‌ 7 వికెట్లకు 360 పరుగులే చేయగలిగింది. రోహిత్‌ శర్మ (138) సెంచరీ.. శుభ్‌మన్‌ గిల్ (77), విరాట్ కోహ్లీ (74) మెరుపులు అర్ధ శతకాలు వృథా అయ్యాయి. టీమిండియా ఓటమిపై మాజీ భారత వికెట్‌కీపర్ పార్థివ్ పటేల్ స్పందించాడు. భారత్ ఓటమికి ప్రధాన కారణం చివరి ఓవర్లలో ఫినిషింగ్ లోపించడమేనని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌లా ఇన్నింగ్స్ చివర్లో వేగంగా పరుగులు రాబట్టలేకపోయిందని, అక్కడే తేడా కొట్టిందని చెప్పాడు. భారత్‌కు బట్లర్‌ లాంటి మ్యాచ్ ఫినిషర్ లేకపోవడంతోనే ఓటమి ఎదురైందని పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు.

జియోస్టార్‌తో పార్థివ్ పటేల్ మాట్లాడుతూ... '388 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంత సులభం కాదు. అయినప్పటికీ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా నిర్మించారు. వారు ఛేదనను చాలా బాగా ముందుకు తీసుకెళ్లారు. కానీ చివర్లో ఇంగ్లండ్‌కు జోస్ బట్లర్ అందించిన ఫినిషింగ్ భారత్‌కు దక్కలేదు. అదే రెండు జట్ల మధ్య తేడాగా నిలిచింది. భారత్‌కు బట్లర్‌ లాంటి మ్యాచ్ ఫినిషర్ ఉంటే గెలిచేవాళ్లం. ఇప్పటికైనా టీమిండియా దీనిపై దృష్టి పెట్టాలి' అని సూచించాడు. 'ఇంగ్లండ్ ఇన్నింగ్స్ చివరి ఐదు ఓవర్లలో 82 పరుగులు రాబట్టింది. బట్లర్ 13 బంతుల్లో 41 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. భారత్ కూడా ఛేదనలో చాలా పోటీలోనే ఉన్నప్పటికీ.. చివరి ఓవర్లలో అదే స్థాయిలో దూకుడు ప్రదర్శించలేక 27 పరుగుల తేడాతో ఓడిపోయింది' అని విశ్లేషించాడు.

'47వ ఓవర్ వరకు భారత్ ఛేదనలో ఇంగ్లండ్ కంటే మెరుగైన స్థితిలోనే ఉంది. కానీ చివరి మూడు ఓవర్లు మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశాయి. ఆ దశలోనే ఇంగ్లండ్ విజయం ఖరారైంది. ఈ మ్యాచ్ నుంచి భారత యువ బౌలర్లు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదే డెత్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేయడం. ఒకటి రెండు సిక్సర్లు ఇచ్చినా ఆ తర్వాత ఎలా పుంజుకోవాలి.. ఓవర్‌ను ఎలా నియంత్రించాలి అనేది తెలుసుకోవాలి. అలాంటి అనుభవమే భవిష్యత్తులో వారికి ఉపయోగపడుతుంది' అని పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. చివరి మూడు ఓవర్లను పేసర్లు గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్ వేశారు. వారు 16, 23, 23 పరుగులు ఇచ్చారు. ఈ మూడు ఓవర్లలోనే ఇంగ్లండ్ 62 రన్స్ చేసింది.

రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను కూడా పార్థివ్ ప్రశంసించాడు. తొలి 10 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 49 పరుగులు మాత్రమే చేసినా.. రోహిత్ ఎలాంటి తొందరపడకుండా పరిస్థితులను అర్థం చేసుకుని ఇన్నింగ్స్‌ను నిర్మించాడని కొనియాడాడు. 'రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మొదట పరిస్థితులను అంచనా వేసి, ఆ తర్వాత తన ఆటలో వేగం పెంచాడు. అతను ఆడిన 138 పరుగుల ఇన్నింగ్స్ అసాధారణం. లార్డ్స్‌లో భారత బ్యాటర్‌గా తొలి వన్డే సెంచరీ చేయడం కూడా ప్రత్యేక ఘనత' అని ప్రశంసించాడు. రోహిత్ వీరోచిత శతకం భారత్‌కు ఆశలు కల్పించినప్పటికీ.. చివరి ఓవర్లలో ఇంగ్లండ్ బ్యాటర్లు, బౌలర్లు చూపిన మెరుగైన ఫినిషింగ్‌నే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించిందని పార్థివ్ అభిప్రాయపడ్డాడు.

Tags:    

Similar News