ఈ రాట్ రేస్‌లో ఉండను.. నా ఆట నా ఇష్టం.. సంజు శాంసన్‌ సంచలన వ్యాఖ్యలు!

Sanju Samson: Sanju Samson says he is done with the constant 'rat race' in India. టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన కెరీర్, భవిష్యత్తు, విమర్శలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Update: 2026-07-27 14:22 GMT

ఈ రాట్ రేస్‌లో ఉండను.. నా ఆట నా ఇష్టం.. సంజు శాంసన్‌ సంచలన వ్యాఖ్యలు!

Sanju Samson: టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన కెరీర్, భవిష్యత్తు, విమర్శలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇకపై ఎవరి మాటలు పట్టించుకోకుండా తనకు నచ్చిన విధంగానే క్రికెట్ ఆడతానని స్పష్టం చేశాడు. 2026 టీ20 ప్రపంచ కప్‌కు ముందే తాను ఓ కీలక నిర్ణయం తీసుకున్నానని.. నిరంతరం భారత జట్టులో జరిగే పోటీ, పోలికలు, విమర్శలతో కూడిన రాట్ రేస్‌లో ఇకపై భాగం కాబోనని వెల్లడించాడు. జియోస్టార్ కార్యక్రమం 'బిలీవ్'లో మాట్లాడిన సంజు.. తన కెరీర్‌లో ఎదురైన అనుభవాలు, విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహాలు, ప్రపంచకప్‌లో తన ఆలోచనా విధానం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌తో సిరీస్‌లలో పరుగులు చేయకపోవడంతో జింబాబ్వే పర్యటనలో అతడికి చోటు దక్కలేదు.

సంజు శాంసన్ మాట్లాడుతూ.. 'మన దేశంలో ఎప్పుడూ పోటీ ఎక్కువగా ఉంటుంది. ఒక రాట్ రేస్ కొనసాగుతూనే ఉంటుంది. 2026 టీ20 ప్రపంచ కప్‌కు ముందే అందులో నేను భాగం కాకూడదని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నాకు క్రికెట్‌ను ఆస్వాదించడమే ముఖ్యం. దేవుడి దయతో ఇప్పటికే చాలా సాధించాను. నాకు ఇప్పుడు 31 ఏళ్లు. ఇంకా చాలా కాలం క్రికెట్ ఆడగలను. అందుకే నా సొంత శైలిలోనే ఆడాలనుకుంటున్నా. ఎలా బ్యాటింగ్ చేయాలో, ఏమి చేయాలో ఎవరూ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. సంజు ఎలా ఆడాలో సంజునే డిసైడ్ చేస్తాడు' అని స్పష్టం చేశాడు.

'2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత 2026 ప్రపంచ కప్ జట్టులో కూడా నేను ఉంటానని అసలు ఊహించలేదు. ఒక దశలో నేను 14 లేదా 15 మంది ఆటగాళ్ల జాబితాలో కూడా లేను. అయినప్పటికీ నాకు అవకాశాలు వచ్చాయి. అనుకోకుండా వచ్చిన ఛాన్స్‌ అది. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకున్నా. ప్రపంచ కప్‌లో వరుసగా మూడు అర్ధ శతకాలు చేశా. అందుకే నేను 2028 టోర్నీ కోసం ఎలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాను?. నా అవసరం జట్టుకు ఉందని అనిపిస్తే జట్టుకు ఎంపిక చేస్తారు. అప్పుడు మంచి ఇన్నింగ్స్‌లు ఆడేందుకు ప్రయత్నిస్తా' అని సంజు చెప్పాడు. 2026 ప్రపంచ కప్ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల్లో ఫామ్ కోల్పోవడంతో జింబాబ్వే పర్యటనకు ఎంపిక కాలేకపోయాడు.

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి నేర్చుకున్న విషయాల గురించి కూడా సంజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు శిబిరంలో ఒకసారి ఇద్దరూ కలిసి జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నప్పుడు నేను ఏం చేయాలి? అని కోహ్లీని అడిగానని తెలిపాడు. అప్పుడు విరాట్ తన జీవనశైలే ఈ విజయానికి ప్రధాన కారణమని చెప్పాడని వివరించాడు. ఏ ఆహారం తీసుకోవాలి, శరీరం త్వరగా కోలుకోవాలంటే ఏమి చేయాలో చెప్పదని తెలిపాడు. పదేళ్ల పాటు అదే క్రమశిక్షణ కొనసాగిస్తే గొప్ప కెరీర్ సాధ్యమవుతుందని కోహ్లీ సూచించాడని చెప్పాడు. తాను కూడా ఏడాదిన్నర పాటు ఆ జీవనశైలిని పాటించినా అని, తర్వాత అదే క్రమశిక్షణ కొనసాగించలేకపోయానని నిజాయితీగా అంగీకరించాడు.

'2026 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు జోఫ్రా ఆర్చర్ నన్ను గతంలో పలుమార్లు ఔట్ చేశాడని చాలామంది గుర్తు చేశారు. అయితే అప్పటికే నా ఆటపై పూర్తి విశ్వాసం ఉండడంతో ఆ వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపలేదు. ఏడాది క్రితం ఉన్న సంజు కాదు. వెస్టిండీస్‌పై ఆ ఇన్నింగ్స్ తర్వాత నాపై నాకు పూర్తి నమ్మకం వచ్చింది. దేశం కోసం ఆడాలనే సంకల్పంతో బరిలోకి దిగాను. నన్ను ఎవరూ ఆపలేరనే విశ్వాసం నాలో ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో జట్టు ప్రధాన బాధ్యత నాపై ఉందని భావించా. ఫామ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు, కానీ ఆ సమయంలో జట్టు నాపై ఆధారపడిందని గుర్తించి చివరి వరకు క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నా. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో ఒక ఓవర్‌లో నాలుగు డాట్ బంతులు ఆడినా ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. సరైన సమయంలో దాడి చేయాలనే స్పష్టమైన ప్రణాళికతోనే బ్యాటింగ్ చేశా' అని సంజు వివరించాడు.

Tags:    

Similar News