Rishabh Pant : అర్థరాత్రి భూమి కావాలంటూ ముఖ్యమంత్రిని కోరిన రిషబ్ పంత్

Rishabh Pant : ఉత్తరాఖండ్‌లో భూమి కొనుగోలుకు సహకరించాలని రిషభ్ పంత్ సీఎం పుష్కర్ సింగ్ ధామీని అర్ధరాత్రి ట్విట్టర్ ద్వారా కోరారు. మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా స్థలం దొరకడం లేదని పంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2026-08-08 01:46 GMT

Rishabh Pant

Rishabh Pant : శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం సన్నాహకాల్లో మునిగిపోయిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఆగస్టు 8 అర్ధరాత్రి దాటిన తర్వాత (దాదాపు 12:45 గంటలకు) ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో భూమి కొనుగోలు చేయడానికి మార్గం సుగమం చేయాలని కోరుతూ నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని ట్యాగ్ చేస్తూ పంత్ ఒకదాని వెనుక ఒకటి రెండు పోస్టులు చేశారు.

ఢిల్లీ నుంచి సొంత రాష్ట్రానికి షిఫ్ట్ అయ్యే ప్లాన్

ఈ పోస్టుల్లో పంత్ తన మనసులోని ఆవేదనను పంచుకున్నారు. తాను ప్రస్తుతం ఢిల్లీ నుంచి తన బేస్‌ను మార్చుకుని సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో శాశ్వతంగా స్థిరపడాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అయితే గత మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ భూమి కొనుగోలుకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదా అనువైన పెద్ద స్థలం దొరకక ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. "నాకు నా ఉత్తరాఖండ్ అంటే ఎంతో ప్రేమ. నా సొంత కొండ ప్రాంత ప్రజల మధ్యకు వచ్చి ఉండాలని, రాష్ట్ర అభివృద్ధికి నా వంతు తోడ్పాటు అందించాలని అనుకుంటున్నాను. కానీ స్థలం కొనుగోలు ప్రక్రియలో స్పష్టత లేకపోవడం వల్ల ఇదొక నైట్‌మేర్‌లా మారింది. సర్, దయచేసి నాకు భూసేకరణ ప్రక్రియలో సాయం చేయండి" అని పంత్ సీఎంను వేడుకున్నారు.

ఉచితంగా వద్దు.. ప్రభుత్వ ధరకే కొంటా

ఈ క్రమంలో తాను ఎలాంటి ఉచిత భూమినో లేదా ప్రభుత్వం నుంచి కానుకనో కోరడం లేదని పంత్ స్పష్టం చేశారు. "అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గిఫ్ట్‌గా ఇస్తే సంతోషమే, కానీ మీ అనుమతి ఉంటే నేను ప్రభుత్వం కేటాయించే ధరకు, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే స్థలం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కనీసం మన రాష్ట్రంలో నా మొదటి ఇల్లు కట్టుకోవాలనేది నా కోరిక. నిజం చెప్పాలంటే ఈ స్థలం కొనుగోలు ప్రక్రియ ఎలా చేయాలో నాకు తెలియడం లేదు" అని పంత్ రాసుకొచ్చారు.

ఉత్తరాఖండ్‌లోనే అత్యధిక టాక్స్ పేయర్‌గా రికార్డు

విశేషమేమిటంటే.. రిషభ్ పంత్ ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే వ్యక్తిగతంగా అత్యధిక ఇన్కమ్ టాక్స్ చెల్లించిన వ్యక్తిగా నంబర్ 1 స్థానంలో నిలిచారు. ఆర్థిక సంవత్సరం 2025-26కి గాను ఆయన ఏకంగా రూ. 23 కోట్ల 84 లక్షల పన్ను చెల్లించారు. అంతకుముందు సంవత్సరంలో కూడా ఆయన రూ. 10.5 కోట్ల టాక్స్ కట్టారు. రాష్ట్రంలోనే అత్యధిక పన్ను చెల్లిస్తున్న వ్యక్తిగా రికార్డు నెలకొల్పిన ఒక స్టార్ క్రికెటర్‌కు సొంత ఊళ్లో ఇల్లు కట్టుకోవడానికి మూడేళ్లుగా భూమి దొరకకపోవడం, ఆయన సీఎంని సాయం కోరడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News