Mohammad Amir: బ్రిటిష్ పౌరసత్వం.. ఐపీఎల్ 2027 ఆడతావా?.. పాక్ ప్లేయర్ మహ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు!
Mohammad Amir opens up on the possibility of playing IPL 2027. ఐపీఎల్‌లో ఆడే అంశంపై మహ్మద్ అమీర్ స్పందిస్తూ.. ప్రస్తుతం తన తొలి ప్రాధాన్యత పీఎస్‌ఎల్ అని స్పష్టం చేశాడు.
Mohammad Amir: బ్రిటిష్ పౌరసత్వం.. ఐపీఎల్ 2027 ఆడతావా?.. పాక్ ప్లేయర్ మహ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు!
Mohammad Amir: పాకిస్థాన్ మాజీ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల బ్రిటిష్ పౌరసత్వం పొందిన అమీర్.. ఇప్పుడు ఇంగ్లండ్‌లో జరిగే ప్రముఖ టీ20 టోర్నీ ది హండ్రెడ్‌లో ట్రెంట్ రాకెట్స్ తరఫున దేశీయ (డొమెస్టిక్) ఆటగాడిగా బరిలోకి దిగుతున్నాడు. పాకిస్తాన్ పౌరసత్వం ఇప్పుడు అతడికి లేదు కాబట్టి.. పలు ప్రాంచైజీ లీగుల్లో ఆడే అర్హత పొందాడు. ఈ క్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027లో ఆడే అవకాశాలపై క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ మొదలైంది.
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తల కారణంగా పాకిస్థాన్ ఆటగాళ్లకు ఐపీఎల్‌లో ఆడే అవకాశం లేదు. 2008లో ఐపీఎల్‌లో ఆడిన పాక్ ప్లేయర్స్.. 2009 నుంచి మరలా టోర్నీ మొహమే చూడలేదు. మన ఐపీఎల్ మాదిరే.. అక్కడ పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) పెట్టుకుని ఆడుతున్నారు. అయితే పీఎస్‌ఎల్ మాత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. విదేశీ ప్లేయర్స్ కూడా పీఎస్‌ఎల్‌లో ఆడేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇదిలా ఉంటే.. బ్రిటిష్ పౌరసత్వం పొందిన నేపథ్యంలో ఐపీఎల్ నిబంధనల ప్రకారం మహ్మద్ అమీర్ ఆటగాడిగా తన పేరును నమోదు చేసుకునే అర్హతను పొందినట్లు తెలుస్తోంది. దాంతో అమీర్ ఐపీఎల్‌లో కనిపిస్తాడా అనే ఆసక్తితో అభిమానులు ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఐపీఎల్‌లో ఆడే అంశంపై మహ్మద్ అమీర్ స్పందిస్తూ.. ప్రస్తుతం తన తొలి ప్రాధాన్యత పీఎస్‌ఎల్ అని స్పష్టం చేశాడు. 2027 సీజన్‌లో విదేశీ ఆటగాడిగా పీఎస్‌ఎల్‌లో తప్పకుండా ఆడతానని, ఐపీఎల్‌లో పాల్గొనాలా వద్దా అనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపాడు. ఐపీఎల్‌లో నేను ఆడుతానో లేదో ఇప్పుడే చెప్పలేను అని అమీర్ పేర్కొన్నాడు. పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ అజార్ మహ్మద్ బ్రిటిష్ పౌరసత్వం పొందిన తర్వాత 2012 నుంచి 2015 వరకు ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున కూడా మ్యాచ్‌లు ఆడాడు. దీంతో అమీర్ కూడా ఐపీఎల్‌లోకి రావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మహ్మద్ అమీర్ 2024 టీ20 ప్రపంచ కప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన కెరీర్‌లో పాకిస్థాన్ తరఫున 36 టెస్టులు, 61 వన్డేలు, 62 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అమీర్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వివిధ ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడుతున్నాడు. అయితే ది హండ్రెడ్‌లో ట్రెంట్ రాకెట్స్ తరఫున డొమెస్టిక్ ఆటగాడిగా అమీర్ ఆడటంపై వివాదం చెలరేగింది. మొదట విదేశీ ఆటగాడిగా డ్రాఫ్ట్‌లో పేరు నమోదు చేసుకున్న అతడిని తర్వాత దేశీయ ఆటగాడిగా అనుమతించడం సరైందా అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) దీనిపై స్పష్టత ఇస్తూ.. బ్రిటిష్ పౌరసత్వం పొందిన తర్వాత అమీర్ అన్ని అర్హతలు కలిగి ఉన్నాడని, అతడిని డొమెస్టిక్ ప్లేయర్‌గా పరిగణించడం నిబంధనలకు అనుగుణమేనని ప్రకటించింది.