2027 World Cup: వరల్డ్‌ కప్‌కు 'హట్కే' టీమ్.. లోపాలు ఉన్నాయంటూ సెటైర్లు.. 8/10 మార్కులు ఇచ్చిన మాజీ ఓపెనర్!

Aakash Chopra reviews Ravi Shastri's India 2027 ODI World Cup squad. 2027 వన్డే వరల్డ్‌ కప్‌కు మాజీ భారత హెడ్ కోచ్ రవి శాస్త్రి 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేశాడు.

Update: 2026-08-06 13:51 GMT

2027 World Cup: వరల్డ్‌ కప్‌కు 'హట్కే' టీమ్.. లోపాలు ఉన్నాయంటూ సెటైర్లు.. 8/10 మార్కులు ఇచ్చిన మాజీ ఓపెనర్!

2027 World Cup: 2027 వన్డే వరల్డ్‌ కప్‌కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మెగా టోర్నీకి ఇంకా దాదాపు 14 నెలల సమయం ఉంది. అయినా ఇప్పటి నుంచే టీమిండియా తుది జట్టుపై చర్చలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో మాజీ భారత హెడ్ కోచ్ రవి శాస్త్రి 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేశాడు. ఈ జట్టును మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా విశ్లేషిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది పూర్తిగా 'హట్కే' టీమ్ అని పేర్కొంటూనే.. 10కి 8 మార్కులు ఇచ్చాడు. హట్కే అంటే.. చాలా వినూత్నంగా లేదా క్రియేటివ్‌ అని అర్ధం.

టాప్ ఆర్డర్‌ సూపర్:

రవి శాస్త్రి తాను ఎంపిక చేసిన జట్టుకు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. అతనితో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్‌లకు చోటు కల్పించాడు. ఈ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ ఊహించినట్టుగానే ఉన్నాయని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అయితే యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను జట్టులోకి తీసుకోవడం ఆసక్తికర నిర్ణయమని పేర్కొన్నాడు. ఓపెనర్‌గా అదనపు ఎంపికలు ఉండటం జట్టుకు ప్రయోజనకరమే అయినప్పటికీ.. ప్రపంచ కప్ సమయానికి జైస్వాల్ తుది జట్టులో ఉంటాడా లేదా అనేది ప్రశ్నగా మిగిలిందన్నాడు.

పంత్, రాహుల్ ఎంపికపై సందేహాలు:

వికెట్‌కీపర్‌గా కేఎల్ రాహుల్‌తో పాటు రిషభ్ పంత్‌ను కూడా రవి శాస్త్రి తన జట్టులో చేర్చాడు. దీనిపై ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. వన్డే క్రికెట్‌లో పంత్‌కు సరైన అవకాశాలు ఇవ్వలేదని, సిరీస్ మధ్యలోనే జట్టు నుంచి తప్పించారని గుర్తుచేశాడు. ఇప్పుడు ప్రపంచ కప్‌కు సమయం దగ్గరపడుతున్న తరుణంలో అతడికి మళ్లీ అవకాశం వస్తుందా అనేది సందేహమేనని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ కూడా మంచి ఫామ్‌లో ఉండటం వల్ల పోటీ మరింత పెరిగిందని చెప్పాడు.

బౌలింగ్ విభాగంలో ఆసక్తికర ఎంపికలు:

ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌లతో పాటు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లను రవి శాస్త్రి ఎంపిక చేశాడు. అనుభవజ్ఞులైన ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లను జట్టులో ఉంచడం సరైన నిర్ణయమేనని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. పేస్ దళంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లతో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు చోటు కల్పించాడు. బుమ్రా, సిరాజ్, కుల్దీప్ ఎంపికలు సహజమే అయినప్పటికీ.. ఒకేసారి షమీ, భువనేశ్వర్ ఇద్దరినీ ఎంపిక చేయడం మాత్రం ఆశ్చర్యం కలిగించిందని చోప్రా వ్యాఖ్యానించాడు.

'హట్కే' టీమ్.. కానీ కొన్ని లోపాలు కూడా:

రవి శాస్త్రి ఎంపిక చేసిన జట్టును 'హట్కే'గా అభివర్ణించిన ఆకాశ్ చోప్రా.. భువనేశ్వర్ కుమార్‌ను క్రమం తప్పకుండా ఆడిస్తే అతడు వైట్‌బాల్ క్రికెట్‌లో ఇంకా ఉపయోగపడతాడని చెప్పాడు. అయితే భువీ-షమీ ఇద్దరినీ ఒకేసారి తీసుకోవడం, అలాగే జైస్వాల్, రిషభ్ పంత్‌లను ఎంపిక చేయడం ఈ జట్టును ప్రత్యేకంగా నిలబెట్టిందన్నాడు. అయితే ఈ జట్టులో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ లేకపోవడం లోపమని అభిప్రాయపడ్డాడు. ఇదే 2027 ప్రపంచ కప్‌కు భారత తుది జట్టుగా ఉండే అవకాశం తక్కువేనని, రవి శాస్త్రే సెలెక్టర్ అయితే తప్ప ఈ కాంబినేషన్ కనిపించకపోవచ్చని సెటైర్లు వేశాడు. అయినప్పటికీ మొత్తం జట్టుకు 10కి 8 మార్కులు ఇస్తానని ఆకాశ్ చోప్రా వెల్లడించాడు.

Tags:    

Similar News