RCB vs GT: గుజరాత్‌తో క్వాలిఫయర్-1 మ్యాచ్.. ఆర్సీబీ రిస్క్ తీసుకోవద్దు, ఆ స్టార్ ప్లేయర్ ఓపెనర్‌గా వద్దు!
RCB vs GT: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లో భాగంగా ఆర్సీబీ), జీటీ మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది.
RCB vs GT: గుజరాత్‌తో క్వాలిఫయర్-1 మ్యాచ్.. ఆర్సీబీ రిస్క్ తీసుకోవద్దు, ఆ స్టార్ ప్లేయర్ ఓపెనర్‌గా వద్దు!
RCB vs GT: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లో భాగంగా మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. ధర్మశాలలో రాత్రి 7.30కు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. ఓడిన టీమ్ మాత్రం క్వాలిఫయర్-2 ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ ఓపెనింగ్ కాంబినేషన్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ గాయం నుంచి కోలుకుని తిరిగి తుది జట్టులోకి రావడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో.. అతడిని నేరుగా ఓపెనర్‌గా ఆడించాలా? లేక ఇటీవలి మ్యాచ్‌ల్లో అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్‌ను కొనసాగించాలా? అన్నదానిపై అభిమానుల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగే క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో కలిసి వెంకటేశ్ అయ్యర్‌నే ఓపెనర్‌గా కొనసాగించాలని సైమన్ డౌల్ సూచన చేశాడు. గాయం కారణంగా మూడు వారాలకు పైగా మ్యాచ్‌లకు దూరమైన ఫిల్ సాల్ట్‌ను నేరుగా ప్లేఆఫ్స్ మ్యాచ్‌లో ఆడించడం రిస్క్ అవుతుందని పేర్కొన్నాడు. జియోస్టార్ క్రికెట్ లైవ్ కార్యక్రమంలో మాట్లాడిన డౌల్.. ‘ఫిల్ సాల్ట్ గొప్ప ఆటగాడు. ఆర్సీబీ, ఇంగ్లండ్ తరఫున టీ20ల్లో అద్భుతంగా ఆడాడు. కానీ గాయం నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఫామ్ అందుకోవడం అంత ఈజీ కాదు. మ్యాచ్ ఫిట్‌నెస్, షాట్ టైమింగ్ తిరిగి రావడానికి కొంత సమయం పడుతుంది. అలాంటి ప్రయోగాలు ప్లేఆఫ్స్‌లో చేయడం సరైంది కాదు’ అని అభిప్రాయపడ్డాడు.
ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై వెంకటేశ్ అయ్యర్ 19 బంతుల్లో 44 పరుగులతో మెరుపులు మెరిపించిన విషయాన్ని సైమన్ డౌల్ గుర్తు చేశాడు. అలాగే పంజాబ్ కింగ్స్‌పై మిడిల్ ఆర్డర్‌లో ఆడుతూ అర్ధ సెంచరీ చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించాడు. విరాట్ కోహ్లీతో వెంకటేశ్ మంచి రిథమ్‌లో ఉన్నాడని, ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న ఆటగాడికే ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నాడు. ‘అవును.. విరాట్ కోహ్లీతో ఫిల్ సాల్ట్‌కు మంచి ఓపెనింగ్ భాగస్వామ్య రికార్డు ఉంది. కానీ క్రికెట్‌లో ఎప్పుడూ ఫామ్‌లో ఉన్న ఆటగాడినే నమ్మాలి. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్‌ల్లో పేరు కంటే ఫామ్‌నే ఎక్కువగా పరిగణలోకి తీసుకోవాలి. చాలా రోజులుగా పోటీ క్రికెట్ ఆడని ఆటగాడిని నేరుగా తీసుకురావడం పెద్ద రిస్క్. అందుకే నేను వెంకటేశ్ అయ్యర్‌ను కొనసాగిస్తాను. ఫిల్ సాల్ట్ లాంటి ప్లేయర్‌ను బెంచ్‌పై ఉంచడం కష్టం. కానీ ప్రస్తుతం వెంకటేశ్ బాగా ఆడి తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు’ అని డౌల్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2026లో వెంకటేశ్ అయ్యర్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి 158 పరుగులు చేశాడు. 79 సగటుతో పాటు 177.52 స్ట్రైక్‌రేట్‌తో అదరగొట్టాడు. అతడి ఖాతాలో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఓపెనర్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా, ఇంపాక్ట్ ప్లేయర్‌గా అన్ని పాత్రల్లోనూ ఆకట్టుకున్నాడు. మరోవైపు ఫిల్ సాల్ట్ ఆరు ఇన్నింగ్స్‌ల్లో 202 పరుగులు చేశాడు. 33.66 సగటుతో పాటు 168కి పైగా స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. అతడి ఖాతాలో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇద్దరికీ మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఇప్పుడు క్వాలిఫయర్-1లో ఆర్సీబీ ఎవరిని ఓపెనర్‌గా ఎంపిక చేస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.