RCB vs GT: ధర్మశాలలో మహా సమరం.. ఆర్సీబీ-జీటీ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!

RCB vs GT: తొలి క్వాలిఫయర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు తలపడనున్నాయి.

Update: 2026-05-25 14:13 GMT

RCB vs GT: ధర్మశాలలో మహా సమరం.. ఆర్సీబీ-జీటీ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!

RCB vs GT: ఐపీఎల్ 2026 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. మంగళవారం (మే 26) నుంచి ప్లేఆఫ్స్ సమరం ప్రారంభం కానుంది. తొలి క్వాలిఫయర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు తలపడనున్నాయి. ధర్మశాల వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టుకు మాత్రం క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. ఇరియూ జట్లు ఫైనల్ బెర్త్ లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ఈ కీలక పోరుకు ముందు ఆర్సీబీ-జీటీ జట్ల హెడ్ టు హెడ్ రికార్డులు, బలాబలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

హెడ్ టు హెడ్‌:

ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ, జీటీ ఇప్పటివరకు ఎనిమిది సార్లు తలపడ్డాయి. ఇందులో ఇరు జట్లు చెరో నాలుగు విజయాలు నమోదు చేసి సమానంగా నిలిచాయి. దీంతో క్వాలిఫయర్-1లో ఎవరు పైచేయి సాధిస్తారో అన్నది మరింత ఉత్కంఠగా మారింది. ఈ సీజన్‌లో కూడా రెండు జట్లు రెండుసార్లు ఎదురుపడగా.. తమ తమ హోం గ్రౌండ్‌లలో విజయం సాధించడం విశేషం.

లీగ్ దశలో అద్భుత ప్రదర్శన:

ఐపీఎల్ 2026 లీగ్ దశలో బెంగళూరు, గుజరాత్ జట్లు స్థిరమైన ప్రదర్శన కనబరిచాయి. ఆర్సీబీ 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు గుజరాత్ కూడా 9 విజయాలు సాధించి 18 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. దీంతో టాప్-2లో నిలిచిన ఈ జట్లు టైటిల్ ఫేవరెట్స్‌గా మారాయి.

ధర్మశాల పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం:

క్వాలిఫయర్-1కు వేదికైన ధర్మశాల మైదానం ఈ సీజన్‌లో హై స్కోరింగ్ వేదికగా నిలిచింది. ఇక్కడ ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 211 పరుగులుగా ఉంది. బ్యాటర్లకు అనుకూలంగా ఉండే ఈ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఎక్కువ. అలాగే మూడు మ్యాచ్‌ల్లో రెండుసార్లు ఛేజింగ్ చేసిన జట్టే గెలిచింది. దీంతో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

ప్లేఆఫ్స్ అనుభవం:

ప్లేఆఫ్స్ అనుభవం పరంగా చూస్తే.. ఆర్సీబీకి ఆధిక్యం ఉంది. బెంగళూరు జట్టు ఇప్పటివరకు 11 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరింది. మొత్తం 17 ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించింది. ముఖ్యంగా గత సీజన్‌లో తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలిచి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు 2022లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన గుజరాత్ ఇప్పటికే ఒకసారి ఛాంపియన్, మరోసారి రన్నరప్‌గా నిలిచింది. ఇప్పటివరకు ఆరు ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఆడిన జీటీ.. మూడింట్లో విజయం సాధించింది.

కీలక ఆటగాళ్లపై ఆశలు

ఆర్సీబీ విజయావకాశాలు ప్రధానంగా విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, టిమ్ డేవిడ్ బ్యాటింగ్‌పై ఆధారపడి ఉన్నాయి. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ కీలక పాత్ర పోషించనున్నారు. గుజరాత్ తరఫున కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ బ్యాటింగ్‌లో ప్రధాన బలంగా కనిపిస్తున్నారు. బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ, ప్రసిద్ధ్ కృష్ణతో పాటు రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన జట్టుకు కీలకం కానుంది.

ఫైనల్ బెర్త్ ఎవరిది?:

ఆర్సీబీ వరుసగా రెండోసారి ఫైనల్ చేరి టైటిల్‌ను డిఫెండ్ చేయాలని పట్టుదలగా ఉంటే.. గుజరాత్ మరోసారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెండు జట్లూ సమాన బలాలతో ఉండటంతో ఈ మ్యాచ్ అభిమానులకు పూర్తి స్థాయి క్రికెట్ థ్రిల్లర్‌గా మారే అవకాశముంది.

Tags:    

Similar News