Manav Suthar: మ్యాచ్‌కు రెండు రోజుల ముందే.. వికెట్స్ ఎలా తీస్తున్నాడో చెప్పిన జడ్డూ వారసుడు!

Manav Suthar: శ్రీలంకతో గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.

Update: 2026-08-18 14:05 GMT

Manav Suthar: మ్యాచ్‌కు రెండు రోజుల ముందే.. వికెట్స్ ఎలా తీస్తున్నాడో చెప్పిన జడ్డూ వారసుడు!

Manav Suthar: శ్రీలంకతో గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. టెస్టు క్రికెట్‌లో రెండో మ్యాచ్‌లోనే తొలి బంతికి వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఫస్ట్‌ బంతికే వికెట్‌ తీసిన సుతార్.. ఆ తర్వాత కూడా లంక బ్యాటర్లను క్రీజులో కుదురుకోనీయలేదు. నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అంతకుముందు బ్యాటింగ్‌లో 43 బంతుల్లో 24 పరుగులుచేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ తన స్పిన్‌తో శ్రీలంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టి.. రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. మానవ్ దెబ్బకు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 84/4తో ఉంది.

తొలి ఇన్నింగ్స్‌లో ఫస్ట్‌ బంతికే వికెట్‌ పోగొట్టడంపై మానవ్ సుతార్ స్పందించాడు. నాలుగో రోజు మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. తొలి బంతికే వికెట్ తీయడం, ఆ తర్వాత మంచి రిథమ్‌ను అందుకోవడం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని తెలిపాడు. 'టెస్టు క్రికెట్ ఆడటం ప్రతి క్రికెటర్ కల. ఈ మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్ పడగొట్టడం చాలా బాగుంది. ఆ తర్వాత మంచి రిథమ్‌ను కొనసాగిస్తూ సరైన ప్రాంతాల్లో బౌలింగ్ చేయడానికి ప్రయత్నించాను. వికెట్స్ వాటంతట అవే వస్తాయి. ప్రతి మ్యాచ్‌కు ముందు నా బౌలింగ్ రిథమ్‌ను అందుకోవడానికి ప్రత్యేకంగా స్పాట్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తా. సాధారణంగా మ్యాచ్‌కు ఒకటి లేదా రెండు రోజుల ముందు వీలైనంత ఎక్కువగా స్పాట్ బౌలింగ్ చేస్తా. ఈ సాధన వల్ల బంతిని ఒకే ప్రాంతంలో కచ్చితంగా వేయడం, మ్యాచ్‌కు అవసరమైన రిథమ్‌ను ముందుగానే అందుకోవడం సాధ్యమవుతుంది' అని సుతార్ వివరించాడు.

భారత సీనియర్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ గురించి మానవ్ సుతార్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. వారిద్దరూ ఎంతో అనుభవం ఉన్న దిగ్గజ బౌలర్లని, వారి నుంచి ప్రతిరోజూ ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానని చెప్పాడు. 'జడేజా భాయ్, కుల్దీప్ భాయ్ చాలా సీనియర్, లెజెండరీ బౌలర్లు. వారిని చూస్తూనే చాలా నేర్చుకోవచ్చు. ప్రతిరోజూ వారి నుంచి వీలైనంత ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను' అని సుతార్ పేర్కొన్నాడు. 'గాలె పిచ్‌పై బంతి పెద్దగా టర్న్ కావడం లేదు. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు బౌలింగ్ చేస్తున్న సమయంలో కూడా కొద్దిపాటి టర్న్ మాత్రమే లభించింది. అయితే చివరి రోజు పరిస్థితులు మారి పిచ్ మరింత స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉందని అనుకుంటున్నా' అని మానవ్ చెప్పుకొచ్చాడు.

ఐదో రోజు ఆటలో ప్రారంభం నుంచే సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయడమే తమ లక్ష్యమని మానవ్ సుతార్ చెప్పాడు. ఉదయం పరిస్థితులను వీలైనంత త్వరగా అర్థం చేసుకుని, పిచ్‌కు అనుగుణంగా బౌలింగ్ లెంగ్త్‌ను మార్చుకుంటామని తెలిపాడు. తొలి టెస్టులో భారత్ విజయానికి చివరి రోజు ఆరు వికెట్లు అవసరం కాగా.. శ్రీలంక ఇంకా 288 పరుగులు చేయాల్సి ఉంది. దీంతో గాలెలో చివరి రోజు స్పిన్నర్ల పాత్ర అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది.

Tags:    

Similar News