Asian Games 2026: ఆసియా క్రీడలకు అఫ్గాన్ జట్టు ప్రకటన.. స్టార్ క్రికెటర్ కొడుకుకు ఛాన్స్!

Asian Games 2026: ఆసియా క్రీడల కోసం అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది.

Update: 2026-08-17 14:06 GMT

Asian Games 2026: ఆసియా క్రీడలకు అఫ్గాన్ జట్టు ప్రకటన.. స్టార్ క్రికెటర్ కొడుకుకు ఛాన్స్!

Asian Games 2026: 2026 ఆసియా క్రీడల కోసం అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును సోమవారం ప్రకటించింది. జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరగనున్న ఈ మెగా ఈవెంట్ కోసం అఫ్గానిస్థాన్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. అఫ్గాన్ జట్టులో సీనియర్లతో పాటు దేశవాళీ క్రికెట్‌లో రాణించిన పలువురు యువ ఆటగాళ్లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. మిడిలార్డర్ బ్యాటర్ దర్విష్ రసూలీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

వెటరన్ బ్యాటర్ నజీబుల్లా జద్రాన్, ఆల్‌రౌండర్ కరీమ్ జనత్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇటీవల ముగిసిన షపగీజా క్రికెట్ లీగ్ 2026లో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు కూడా జాతీయ జట్టులో అవకాశం లభించింది. షపగీజా క్రికెట్ లీగ్‌లో అద్భుతంగా రాణించిన టాప్ ఆర్డర్ బ్యాటర్ మొహమ్మద్ అక్రమ్ తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. టోర్నీలో ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 339 పరుగులు చేసిన అతడు.. ఒక సెంచరీతో పాటు రెండు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. అదే టోర్నీలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇస్మత్ ఆలం కూడా జట్టులోకి ఎంపికయ్యాడు. 294 పరుగులు చేయడంతో పాటు తొమ్మిది వికెట్లు పడగొట్టిన ఆలం.. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును అందుకున్నాడు.

అఫ్గానిస్థాన్ జట్టులో అత్యంత ఆసక్తికరమైన ఎంపిక ఏంటంటే.. యువ ఆటగాడు హసన్ ఈసాఖిల్. అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ కుమారుడైన హసన్‌కు ఆసియా క్రీడల జట్టులో చోటు లభించింది. దీంతో క్రికెట్ అభిమానుల దృష్టి అతడిపై పడింది. హసన్‌తో పాటు ఫైసల్ ఖాన్ షినోజాదా, నంగ్యాల్ ఖరోటి వంటి యువ ఆటగాళ్లకు కూడా సెలెక్టర్లు అవకాశం కల్పించారు. అనుభవం, యువ ప్రతిభ కలయికతో అఫ్గానిస్థాన్ జట్టు ఆసియా క్రీడల్లో బరిలోకి దిగనుంది.

ఆసియా క్రీడల్లో అఫ్గానిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు ఇప్పటివరకు మూడుసార్లు రజత పతకాలు సాధించింది. 2010, 2014, 2022 ఆసియా క్రీడల్లో అఫ్గానిస్థాన్ రన్నరప్‌గా నిలిచింది. ఈసారి బంగారు పతకం లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. 2026 ఆసియా క్రీడలు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు జపాన్‌లో జరగనున్నాయి. పురుషుల క్రికెట్ ఈవెంట్‌లో మొత్తం పది జట్లు పాల్గొననున్నాయి. ఆసియా క్రీడల్లో క్రికెట్‌కు ఇది నాలుగోసారి అవకాశం దక్కడం విశేషం. పురుషుల, మహిళల రెండు విభాగాల్లోనూ భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది.

అఫ్గానిస్థాన్ ఆసియా క్రీడల జట్టు ఇదే:

దర్విష్ రసూలీ (కెప్టెన్), మొహమ్మద్ ఇషాక్ (వికెట్ కీపర్), మొహమ్మద్ అక్రమ్, హసన్ ఈసాఖిల్, ఖాలిద్ తనీవాల్, ఇమ్రాన్ మీర్, ఫైసల్ ఖాన్ షినోజాదా, నజీబుల్లా జద్రాన్, ఫర్మానుల్లా సఫీ, ఇస్మత్ ఆలం, కరీమ్ జనత్, నంగ్యాల్ ఖరోటి, అరబ్ గుల్ మొమంద్, ఫరీదూన్ దావుద్‌జాయ్, అబ్దుల్లా అహ్మద్‌జాయ్.

Tags:    

Similar News