India vs Ireland: ఐర్లాండ్ చేతిలో ఓటమి.. డ్రెస్సింగ్ రూమ్‌లో అయ్యర్‌పై గంభీర్ ఫైర్
India vs Ireland: ఐర్లాండ్ చేతిలో భారత్ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
Gautam Gambhir: క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సులభంగా సిరీస్ గెలుస్తామనుకుని బరిలోకి దిగిన వరల్డ్ కప్ విజేత టీమిండియాకు ఐర్లాండ్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. తొలి టీ20 మ్యాచ్‌లోనే 34 పరుగుల తేడాతో భారత్‌ను మట్టికరిపించి ఐర్లాండ్ చరిత్ర సృష్టించింది. బ్యాటింగ్, బౌలింగ్.. ఇలా రెండు విభాగాల్లోనూ అద్భుత ప్రదర్శనతో పైచేయి సాధించి, భారత జట్టుకు చుక్కలు చూపించింది. అయితే, ఈ చారిత్రాత్మక ఓటమి కంటే.. మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగినట్లు చెప్తున్న ఒక హైడ్రామా ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో భారత్ ముందు 183 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం ఛేదనకు దిగిన భారత్.. ఐర్లాండ్ బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. 18.5 ఓవర్లలో కేవలం 148 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వరల్డ్ కప్ గెలిచిన ఊపులో ఉన్న భారత్.. ఐర్లాండ్ జట్టును తక్కువ అంచనా వేసి లైట్ తీసుకోవడమే కొంపముంచిందని క్రీడా విశ్లేషకులు మండిపడుతున్నారు. టీమిండియా పేలవ ప్రదర్శనపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పుమంటున్నాయి.
ఈ ఓటమి అనంతరం భారత డ్రెస్సింగ్ రూమ్‌లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మధ్య సీరియస్ సంభాషణ జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. శ్రేయస్ అయ్యర్ చేసిన చెత్త కెప్టెన్సీ వల్లే మ్యాచ్ చేజారిందని, మైదానంలో వ్యూహాలు రచించడంలో పూర్తిగా విఫలమయ్యావని గంభీర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కెప్టెన్‌కు గట్టిగా ‘క్లాస్’ పీకినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనికి బలాన్ని చేకూరుస్తూ డ్రెస్సింగ్ రూమ్‌కు సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయి హల్‌చల్ చేస్తోంది.
వైరల్ అవుతున్న వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది అధికారికంగా తెలియకపోయినప్పటికీ.. గౌతమ్ గంభీర్ శైలి తెలిసిన వారెవరైనా ఈ వార్తను కొట్టిపారేయలేరు. క్రమశిక్షణ, గెలుపుపై పట్టుదలకు మారుపేరైన గంభీర్.. ఇలాంటి ఘోర పరాజయాలను అస్సలు సహించడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు, సీనియర్ ఆటగాళ్లు లేకుండా యువ జట్టుతో బరిలోకి దిగిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఈ ఓటమి పెద్ద పాఠం లాంటిదనే చెప్పాలి. తొలి మ్యాచ్‌లోనే ఎదురైన ఈ పరాభవం నుండి పాఠాలు నేర్చుకుని, తదుపరి మ్యాచ్‌లో టీమిండియా ఎలా పుంజుకుంటుందో.. గంభీర్ మార్గదర్శకత్వంలో అయ్యర్ ఎలాంటి వ్యూహాలతో వస్తాడో చూడాలి.