IND vs ENG 3rd ODI: టీమిండియాలోకి కొత్త ఆల్‌రౌండర్.. మూడో వన్డేకు ప్లేయింగ్ 11 ఇదే!
India vs England 3rd ODI Playing 11. భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో మ్యాచ్ ఆదివారం లార్డ్స్ మైదానంలో జరగనుంది.
IND vs ENG 3rd ODI: టీమిండియాలోకి కొత్త ఆల్‌రౌండర్.. మూడో వన్డేకు ప్లేయింగ్ 11 ఇదే!
IND vs ENG 3rd ODI: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో మ్యాచ్ ఆదివారం లార్డ్స్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంతో దూరమయ్యాడు. కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డే సందర్భంగా అతడికి కుడి కాలికి గాయం (హ్యామ్‌స్ట్రింగ్ ఇంజురీ) కావడంతో లార్డ్స్ వేదికగా జరగనున్న సిరీస్ డిసైడర్‌కు అందుబాటులో లేడు. అతడి స్థానంలో యువ స్పిన్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబేను జట్టులోకి ఎంపిక చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది.
'రెండో వన్డేలో ఫీల్డింగ్ సమయంలో వాషింగ్టన్ సుందర్‌కు హ్యామ్‌స్ట్రింగ్ గాయం అయింది. ఈ గాయం తీవ్రతను అంచనా వేయడానికి అతడికి స్కానింగ్ నిర్వహించాము. బీసీసీఐ వైద్య బృందం సలహా మేరకు తదుపరి చికిత్స అందిస్తున్నాం. హ్యామ్‌స్ట్రింగ్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి సుందర్‌కు కనీసం రెండు వారాల విశ్రాంతి అవసరం' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. వాషింగ్టన్ స్థానంలో జట్టులోకి వచ్చిన హర్ష్ దూబే ఇటీవల అఫ్గానిస్థాన్‌తో ధర్మశాలలో జరిగిన వన్డేలో భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. అనంతరం శ్రీలంకలో జరిగిన ఇండియా-ఏ రెడ్‌బాల్ సిరీస్‌లో కూడా నాలుగు వికెట్లు పడగొట్టాడు. 30, 29 పరుగులు చేసి బ్యాట్‌తోనూ తన ప్రతిభను చాటాడు. ప్రస్తుతం భారత జట్టులో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లతో కలిసి స్పిన్ విభాగాన్ని అతడు పంచుకోనున్నాడు.
మూడో వన్డే ముగిసిన అనంతరం హర్ష్ దూబే జింబాబ్వే పర్యటనకుకూడా వెళ్లనున్నాడు. జులై 23 నుంచి హరారే వేదికగా ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అతడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇక లార్డ్స్‌లో జరిగే సిరీస్ డిసైడర్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా బరిలోకి దిగనుంది. వాషింగ్టన్ సుందర్ లాంటి కీలక ఆల్‌రౌండర్ లేకపోవడం భారత్‌కు లోటే అయినప్పటికీ.. హర్ష్ దూబే తన అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటాడన్నది ఆసక్తికరంగా మారింది.
హర్ష్ దూబేకు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. సుందర్ స్థానంలో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్స్‌ట్రా బ్యాటర్ కావాలనుకుంటే మాత్రం హర్ష్ దూబే జట్టులో ఉంటాడు. జస్‌ప్రీత్ బుమ్రా, గుర్నూర్ బ్రార్, ప్రసిధ్ కృష్ణలు పసర్లుగా ఆడుతారు. అక్షర్ పటేల్, శివమ్ దూబేలు లోయరార్డర్‌లో ఆడనున్నారు. చూడాలి మరి ఇంకా ఏమైనా చేంజెస్ ఉంటాయో. టాస్ సమయంలో ప్లేయింగ్ 11 తెలియరానుంది.
మూడో వన్డే కోసం భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), అక్షర్ పటేల్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే.
టీమిండియా ప్లేయింగ్ 11 (అంచనా):
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్/హర్ష్ దూబే, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, జస్‌ప్రీత్ బుమ్రా.