Sports: భారత్‌లో పాక్ క్రీడాకారులకు అనుమతి.. కానీ ఓ కండిష‌న్‌.

Sports: భారత్ ప్రభుత్వం పాకిస్తాన్ క్రీడాకారుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2026-05-07 07:11 GMT

Sports

Sports: భారత్ ప్రభుత్వం పాకిస్తాన్ క్రీడాకారుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ, బహుళ దేశాల క్రీడా పోటీల కోసం పాకిస్తాన్ ఆటగాళ్లు భారత్‌కు రావడానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే రెండు దేశాల మధ్య నేరుగా జరిగే ద్వైపాక్షిక క్రీడా సిరీస్‌లపై మాత్రం నిషేధం కొనసాగుతుందని తెలిపింది.

అంతర్జాతీయ టోర్నీలకు గ్రీన్ సిగ్నల్

భారత్‌లో జరిగే అంతర్జాతీయ లేదా బహుళ దేశాల క్రీడా పోటీల్లో పాకిస్తాన్ జట్లు పాల్గొనవచ్చని భారత క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతర్జాతీయ క్రీడా సంస్థల నిబంధనలను అనుసరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అలాగే క్రీడాకారులు, అధికారులు వీసాలు సులభంగా పొందేలా ప్రక్రియను సరళీకరించనున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ క్రీడా సంఘాల ప్రతినిధులకు మల్టిపుల్ ఎంట్రీ వీసాలు కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

భారత్ లక్ష్యం.. భారీ క్రీడా ఈవెంట్లు

ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్ల నిర్వహణలో భారత్ తన స్థానాన్ని మరింత బలపర్చుకోవాలని చూస్తోంది. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్ ఆసక్తి చూపుతోంది. అలాగే 2036 ఒలింపిక్స్‌, 2038 ఆసియా క్రీడల నిర్వహణకు కూడా దరఖాస్తు చేసింది. ఈ నేపథ్యంలో ఇతర దేశాల క్రీడాకారులకు అనుమతి ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ వేదికపై మంచి సందేశం వెళ్లే అవకాశం ఉందని భావిస్తోంది.

భారత్ – పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత

గత ఏడాది భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణానికి దారితీశాయి. ఈ ప్రభావం క్రీడలపైనా క‌నిపించింది. ముఖ్యంగా క్రికెట్‌లో రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా కాలంగా దూరంగా ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ చివరిసారిగా 2012-13లో జరిగింది. ఆ తర్వాత రెండు జట్లు ఎక్కువగా ఐసీసీ టోర్నీలు లేదా తటస్థ వేదికలపైనే తలపడుతున్నాయి.

క్రికెట్‌పై మాత్రం కఠిన వైఖరి

భారత్ స్పష్టం చేసిన ముఖ్య విషయం ఏమిటంటే.. ద్వైపాక్షిక క్రీడా పోటీలకు అనుమతి ఉండదని. భారత జట్లు పాకిస్తాన్‌కు వెళ్లవు. అలాగే పాకిస్తాన్ జట్లు భారత్‌కు వచ్చి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు కూడా అనుమతి ఇవ్వబోమని కేంద్రం తెలిపింది. ఇటీవల జరిగిన టీ20 క్రికెట్ వరల్డ్‌కప్‌లో భారత్ సహ ఆతిథ్య దేశంగా ఉన్నప్పటికీ, పాకిస్తాన్ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడింది. భారత్‌తో మ్యాచ్ కూడా తటస్థ వేదికపైనే జరిగింది. దీంతో రెండు దేశాల మధ్య క్రీడా సంబంధాలు ఇంకా సాధారణ స్థితికి రాలేదని స్పష్టమవుతోంది.

Tags:    

Similar News