IND vs SL 2nd Test: రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్‌ ఉంటాడా?.. టీమిండియా కోచ్ ఆసక్తికర సమాధానం ఇదే!

IND vs SL 2nd Test: కొలంబో వేదికగా శ్రీలంకతో రెండో టెస్టుకు టీమిండియా సిద్ధమవుతున్న వేళ తుది జట్టులో మార్పులపై ఆసక్తి నెలకొంది.

Update: 2026-08-22 03:52 GMT

IND vs SL 2nd Test: రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్‌ ఉంటాడా?.. టీమిండియా కోచ్ ఆసక్తికర సమాధానం ఇదే!

IND vs SL 2nd Test: శ్రీలంక, భారత్ జట్ల మధ్య కొలంబో వేదికగా ఆదివారం నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది. రెండో టెస్టుకు టీమిండియా సిద్ధమవుతున్న వేళ తుది జట్టులో మార్పులపై ఆసక్తి నెలకొంది. గాలెలో జరిగిన తొలి టెస్టులో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాడు.

దాంతో కొలంబో టెస్టుకు అతడిని తప్పిస్తారని సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. అతడి స్థానంలో 33 ఏళ్ల ఆల్‌రౌండర్ సారంశ్ జైన్‌ భారత టెస్టు జట్టులో అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సైరాజ్ బహుతులే స్పందించాడు. కుల్దీప్ ఇప్పటికీ టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రణాళికల్లో ఉన్నాడని, ఒక్క మ్యాచ్‌లో ప్రదర్శన అతడి సామర్థ్యాన్ని నిర్ణయించదని పేర్కొన్నాడు.

గాలె టెస్టులో కుల్దీప్ యాదవ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 25 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. యువ స్పిన్నర్ మానవ్ సుతార్, రవీంద్ర జడేజా కలిసి ఏకంగా 14 వికెట్లు తీశారు.

దీంతో రెండో టెస్టులో కుల్దీప్ స్థానంపై చర్చ మొదలైంది. అయితే ఈ విషయంపై బౌలింగ్ కోచ్ బహుతులే మాట్లాడుతూ.. కుల్దీప్ తమ ‘స్కీమ్ ఆఫ్ థింగ్స్‌’లో ఉన్నాడని స్పష్టం చేశాడు. ‘కుల్దీప్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు.

గాలెలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా అతడు కొంత భిన్నమైన పాత్రను పోషించాల్సి వచ్చింది. నా దృష్టిలో కుల్దీప్ ఎప్పుడూ మ్యాచ్ విన్నర్‌గానే ఉంటాడు. అతడు ఖచ్చితంగా మా ప్రణాళికల్లో భాగమే’ అని బహుతులే పేర్కొన్నాడు.

గాలె పిచ్ పరిస్థితులు, కూకాబుర్ర బంతి స్వభావం కారణంగా కుల్దీప్‌కు బౌలింగ్ చేయడం సవాలుగా మారిందని కోచ్ బహుతులే వివరించాడు. ప్రారంభంలో బంతిపై ఉన్న మెరుపు తగ్గిన తర్వాత కూకాబుర్ర బంతి మృదువుగా మారుతుందని, అలాంటి సమయంలో రిస్ట్ స్పిన్నర్లకు బంతిని తిప్పడం, వేగంతో బౌలింగ్ చేయడం మరింత సవాలుగా మారుతుందని తెలిపాడు.

‘సాఫ్ట్ బాల్‌తో స్పిన్నర్లందరూ ఇబ్బంది పడతారు. అయితే ఫింగర్ స్పిన్నర్లకు కొంత సౌలభ్యం ఉంటుంది. బంతి మృదువుగా మారినప్పుడు లెగ్ స్పిన్నర్లు లేదా రిస్ట్ స్పిన్నర్లకు పరిస్థితులు మరింత కఠినంగా ఉంటాయి. ఫింగర్ స్పిన్నర్లు తమ వేళ్లను ఉపయోగించి బంతి వేగాన్ని, విడుదల విధానాన్ని నియంత్రించగలరు. కానీ రిస్ట్ స్పిన్నర్‌కు అది కాస్త కష్టమైన పని’ అని బహుతులే వివరించాడు.

గాలెలో రోజులు గడిచే కొద్దీ పిచ్ మరింత నెమ్మదించడంతో కుల్దీప్ తన బౌలింగ్ వేగం, ట్రాజెక్టరీని పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాల్సి వచ్చిందని బహుతులే చెప్పాడు. ప్రతి సెషన్‌లో పిచ్ పరిస్థితిని గమనిస్తూ బంతిని ఎలా, ఎంత వేగంతో వేయాలనే దానిపై కుల్దీప్ ప్రయత్నం చేశాడని తెలిపాడు.

‘ఒక్క మ్యాచ్ కుల్దీప్ ఎలా బౌలింగ్ చేస్తున్నాడో, అతడి పనితీరు ఎలా ఉందో నిర్ణయించదు. గాలెలో అతడికి ఇచ్చిన పాత్రకు అనుగుణంగా మారేందుకు కుల్దీప్ తన వంతు ప్రయత్నం చేశాడు’ అని బహుతులే పేర్కొన్నాడు.

మరోవైపు యువ స్పిన్నర్ మానవ్ సుతార్ గాలె టెస్టులో అద్భుత ప్రదర్శనతో టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన సుతార్.. మ్యాచ్‌లో మొత్తంగా 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

అతడి బౌలింగ్‌తో భారత్ 165 పరుగుల భారీ విజయం సాధించింది. సుతార్ ప్రదర్శనపై బహుతులే ప్రశంసలు కురిపించాడు. 'దేశవాళీ క్రికెట్‌లో సుదీర్ఘంగా బౌలింగ్ చేయడం వల్ల సుతార్‌కు తన బౌలింగ్‌పై మంచి అవగాహన ఏర్పడిందని చెప్పాడు.

వివిధ పిచ్‌లు, పరిస్థితులు, ఎడమచేతి-కుడిచేతి బ్యాటర్లకు అనుగుణంగా ఎలా బౌలింగ్ చేయాలనే అంశాలపై సుతార్ నిరంతరం నేర్చుకుంటున్నాడు' అని వివరించాడు. ‘సుతార్ మా కోసం ఒక బ్యాంకర్‌లా మారాడు. అతడు నిరంతరం మేం కోరుకునే లైన్లలో బౌలింగ్ చేస్తాడు.

అతడి కచ్చితత్వం అద్భుతంగా ఉంది. అతడి ట్రాజెక్టరీ కూడా రోజురోజుకూ మెరుగవుతోంది. బంతిపై అతడికి మంచి రివల్యూషన్స్ ఉన్నాయి. వివిధ పరిస్థితుల్లో ఎలా ప్రభావవంతంగా బౌలింగ్ చేయాలనే దానిపై పని చేస్తున్నాడు.

సుతార్‌కు దేశవాళీ క్రికెట్‌లో ఉన్న అనుభవం అంతర్జాతీయ స్థాయిలో ఉపయోగపడుతోంది. పిచ్‌ను బట్టి సరైన వేగం, ట్రాజెక్టరీ, ఫీల్డ్ సెటప్‌ను ఎంచుకోవడంపై అతడితో నిరంతరం చర్చిస్తున్నాము' అని బహుతులే వెల్లడించాడు.

తొలి టెస్టులో భారీ విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. కొలంబోలో రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్‌కు మరో అవకాశం ఇస్తారా? లేక అతడి స్థానంలో సారంశ్ జైన్ వంటి మరో ఆల్‌రౌండర్‌ను తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News