ఛాంపియన్‌గా నిలిపినా.. ఛీ కొడుతోన్న ఫ్రాంచైజీ.. హార్డిక్ ట్రేడ్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్..!
Hardik Pandya Trade: ముంబై ఇండియన్స్ తాజా పోస్ట్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై మరింత ఉత్కంఠ పెంచుతోంది.
ఛాంపియన్‌గా నిలిపినా.. ఛీ కొడుతోన్న ఫ్రాంచైజీ.. హార్డిక్ ట్రేడ్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్..!
Hardik Pandya Trade: ఐపీఎల్ 2027 సీజన్ ముందే ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ వ్యవహారం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అతడిని వేరే ఫ్రాంచైజీకి పంపనున్నారనే వార్తల నడుమ ముంబై యాజమాన్యం చేసిన తాజా పోస్ట్ మరింత ఆసక్తి రేపుతోంది. ఈ క్రమంలో ట్రేడింగ్ పారదర్శకతపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే ఐపీఎల్ సీజన్‌కు ముందు అతడిని ట్రేడింగ్ ద్వారా వదులుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఊహాగానాలు జోరుగా సాగుతున్న తరుణంలోనే, ముంబై యాజమాన్యం తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పాండ్యాకు సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకోవడం కొత్త చర్చకు దారి తీసింది. 2015లో ముంబై తరఫునే ఐపీఎల్ అరంగేట్రం చేసిన హార్దిక్, 2022 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ జట్టుకు మారాడు. తొలి సీజన్‌లోనే గుజరాత్‌ను విజేతగా నిలిపిన అతడు, ఆ తర్వాతి ఏడాది కూడా కెప్టెన్‌గా కొనసాగాడు. అనంతరం ట్రేడింగ్ విండో ద్వారా ముంబై యాజమాన్యం అతడిని తిరిగి సొంతగూటికి రప్పించి, నేరుగా జట్టు పగ్గాలు అప్పగించింది.
నిరాశపరిచిన ఫలితాలు..
కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ముంబై జట్టుకు ఆశించిన స్థాయి విజయాలు అందించలేకపోయాడు. అతడి నాయకత్వంలో ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో ముంబై అట్టడుగు స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత సీజన్‌లో పుంజుకుని క్వాలిఫైయర్-2 వరకు చేరుకున్నప్పటికీ, ఇటీవల ముగిసిన 2026 సీజన్‌లో మాత్రం ఆ జట్టు తీవ్రంగా నిరాశపరిచి తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. దీంతో తదుపరి సీజన్‌కు ముందు జట్టులో భారీ ప్రక్షాళన చేయాలని ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు, అందులో భాగంగానే హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
పారదర్శకత అవసరం: సునీల్ గవాస్కర్
ఈ ట్రేడింగ్ రూమర్ల నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మిడ్-డే పత్రికలో రాసిన ఆర్టికల్ ద్వారా స్పందించారు. ఆటగాళ్ల మార్పిడి ప్రక్రియలో బీసీసీఐ మరింత పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఒక ఫ్రాంచైజీ నుంచి మరో ఫ్రాంచైజీకి ఆటగాళ్లు మారతారనే ఊహాగానాలపై స్పందిస్తూ, ట్రేడింగ్ ద్వారా జరిగే ఆర్థిక లావాదేవీలు కేవలం ఫ్రాంచైజీలు, ఆయా ఆటగాడు, బీసీసీఐకి మాత్రమే తెలుస్తున్నాయని గవాస్కర్ పేర్కొన్నారు.
శాలరీ క్యాప్ ఉల్లంఘనలు జరగొద్దు..
ఆటగాళ్ల ట్రేడింగ్ సమయంలో అసలు ఆర్థిక లావాదేవీలు బయటకు రాకపోవడం వల్ల, ఫ్రాంచైజీలు తమకు నిర్దేశించిన శాలరీ క్యాప్ పరిమితులకు లోబడి ఉన్నాయా లేదా అనే విషయం ఇతరులకు తెలియడం లేదని గవాస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఈ పక్రియలో పూర్తి పారదర్శకత తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 లీగ్‌గా గుర్తింపు పొందిన ఐపీఎల్‌పై ఎవరూ వేలెత్తి చూపకుండా ఉండాలంటే, ట్రేడింగ్ వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచడం ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.