Shani Hanuman Story: ఎవరినీ వదిలిపెట్టని శని... హనుమంతుడికి ఎలా భయపడ్డాడో తెలుసా?

హనుమంతుడిని ఏడు క్షణాలపాటు ఆవహించాలని అనుకున్న శనీశ్వరుడికి ఆ పవనపుత్రుడు ఎలా బుద్ధి చెప్పాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. హనుమంతుడిని ఆరాధించినవారికి శనిబాధలు ఉండవని చెప్పడానికి ఇదొక నిదర్శనం.

Update: 2026-09-01 03:30 GMT

Shani Hanuman Story: నవగ్రహాల్లో అత్యంత శక్తిమంతుడైన శనీశ్వరుడు సమస్త జీవరాశులకే కాక, దేవతలను సైతం తన ప్రభావంతో వణికించే న్యాయాధికారి. సూర్యపుత్రుడైన శనిదేవుడు ధర్మ పరిరక్షణ కోసం ఎవరినీ విడిచిపెట్టడు. కానీ, సర్వశక్తిమంతుడు, శ్రీరామభక్తుడైన హనుమంతుడి జోలికి వెళ్లి తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొన్న పవిత్ర ఘట్టం మన పురాణాలలో ఎంతో ప్రాముఖ్యత కలిగినది. నిత్యం రామనామ జపంలో తరించే ఆంజనేయస్వామిని ఆవహించబోయి శనీశ్వరుడు ఎలా పారిపోవాల్సి వచ్చిందో, శని దోషాల నుండి భక్తులు ఎలా విముక్తి పొందవచ్చో పరిశీలిద్దాం.

లంక వారధి నిర్మాణం ... శనీశ్వరుని ప్రవేశం

త్రేతాయుగంలో లంకను చేరుకోవడానికి వానరసేన సముద్రంపై వారధి నిర్మిస్తున్న సమయంలో హనుమంతుడు అత్యంత భక్తిశ్రద్ధలతో, అనంతమైన బలంతో పెద్ద పెద్ద పర్వతాలను, రాళ్లను మోసుకొచ్చి సముద్రంలో వేస్తున్నాడు. ఆ సమయంలో హనుమంతుడికి శనిప్రభావ కాలం ఆసన్నమైంది. శనీశ్వరుడు శ్రీరాముని వద్దకు వెళ్లి, ఆంజనేయుడిని ఆవహించడానికి అనుమతి కోరగా, "నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చుకో" అని స్వామివారు చిరునవ్వుతో తెలిపారు.

ఏడు సంవత్సరాల నుండి ఏడు క్షణాల ఒప్పందం

శనీశ్వరుడు హనుమంతుడి వద్దకు వెళ్లి .... "ఆంజనేయా! నీ జీవితంలోకి శనిదశ ప్రవేశించింది. నేను నీ వద్ద ఏడున్నర సంవత్సరాల పాటు ఉండాలి" అని చెప్పాడు. దానికి హనుమంతుడు స్పందిస్తూ, తాను ప్రస్తుతం పరమ పవిత్రమైన రామకార్యంలో ఉన్నానని, అంత సమయం ఇవ్వలేనని తెలిపాడు. శనీశ్వరుడు కనీసం ఏడు నెలలు, ఆ తర్వాత ఏడు రోజులు అయినా ఉంటానని బతిమిలాడాడు. చివరకు శ్రీరామకార్యానికి భంగం కలగకుండా కేవలం ఏడు క్షణాల పాటు మాత్రమే తనను ఆవహించేందుకు హనుమంతుడు సమ్మతించాడు.

శిరస్సుపై శని దేవుడు ...హనుమంతుని లీల

శనీశ్వరుడు శరీరంపై ఎక్కడ ఉండాలనే విషయంలో వాగ్వాదం జరిగింది. కాళ్ళు, చేతులు, భుజాలపై ఉంటే రామకార్యం ఆగిపోతుందని భావించిన ఆంజనేయుడు, తన శిరస్సుపైన కూర్చోవడానికి అనుమతించాడు. శనీశ్వరుడు గర్వంతో హనుమంతుని తలపై ఆసీనుడయ్యాడు.

బండరాళ్ల బరువు ... శనీశ్వరుడి భయం

తన తలపై శని కూర్చోగానే హనుమయ్య ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, వారధి నిర్మాణం కోసం భారీ పర్వతాలను, కొండ బండరాళ్లను తన తలపై ఎత్తుకోవడం ప్రారంభించాడు. హనుమంతుడి తలపై ఉన్న శనీశ్వరుడు ఆ పర్వతాల బరువుకు, రాళ్ల రాపిడికి నలిగిపోతూ తీవ్రమైన నొప్పితో హాహాకారాలు చేశాడు. ఆ భయంకరమైన బరువును తట్టుకోలేక ఏడు క్షణాలు పూర్తి కాకుండానే కిందకు దూకేసి, హనుమంతుడికి నమస్కరించి అక్కడి నుండి పారిపోయాడు.

ఆధ్యాత్మిక విశ్లేషణ ... శనిదోష నివారణ మార్గం

ఈ ఘట్టం ద్వారా శాస్త్రాలు మనకు ఒక పరమసత్యాన్ని బోధిస్తున్నాయి. శనీశ్వరుడు హనుమంతుడి భక్తికి, ధర్మానికి శిరస్సు వంచి... "ఎవరైతే నిత్యం హనుమంతుడిని, శ్రీరామనామాన్ని స్మరిస్తారో వారిని నేను ఎప్పటికీ బాధించను" అని అభయమిచ్చాడు. శనిదేవుని పిశాచ, గ్రహ దోషాల నుండి ఉపశమనం పొందాలనుకునే వారు నిత్యం 'హనుమాన్ చాలీసా' పఠించాలి. శనివారం రోజున హనుమంతునికి సింధూరం, తమలపాకుల మాల సమర్పించి ఆరాధించడం వల్ల ఏడున్నర సంవత్సరాల ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది. సాక్షాత్తు శనీశ్వరుడినే తన భక్తిబలంతో లొంగదీసుకున్న భక్త ఆంజనేయుడిని శరణువేడితే, ఎలాంటి గ్రహదోషాలైనా, కష్టాలైనా మంచులా కరిగిపోతాయనడంలో సందేహం లేదు.  

Tags:    

Similar News