Mahabharata Parrot Story : మహాభారతంలో కనువిప్పు కలిగించే చిలుక కథ... ధర్మరాజు సంధించిన ప్రశ్నాస్త్రం

మహాభారతంలోని చిలుక కథ కృతజ్ఞత, ధర్మం, నిస్వార్థ భక్తి గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఆశ్రయం ఇచ్చిన వారిని కష్టకాలంలో విడిచిపెట్టకూడదనే నీతిని తెలియజేస్తుంది.

Update: 2026-09-01 04:23 GMT

Mahabharata Parrot Story : మహాభారత శాంతిపర్వంలో కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన అనంతరం, అంపశయ్యపై ఉన్న కురుపితామహుడు భీష్మాచార్యుని వద్దకు ధర్మరాజు వెళ్లి అనేక ధర్మ సూక్ష్మాలను అర్థం చేసుకుంటాడు. అందులో భాగంగా "ఆశ్రయం ఇచ్చిన వారి పట్ల, ఆశ్రయం పొందిన జీవి ఎలా ప్రవర్తించాలి?" అని ధర్మరాజు సంధించిన ప్రశ్నాస్త్రానికి భీష్ముడు వివరించిన అద్భుతమైన కథే ఈ 'కృతజ్ఞత కలిగిన చిలుక వృత్తాంతం'. తను ఆశ్రయించిన చెట్టు ఎండి మోడైపోయినా దాన్ని విడిచిపెట్టకుండా నిలబడిన ఒక చిన్న చిలుక ద్వారా, కృతజ్ఞతా భావం యొక్క పరమార్థాన్ని సనాతన ధర్మం లోకానికి చాటిచెప్పింది.

వేటగాడి బాణం .... ఎండిపోయిన వృక్షం

పూర్వం కాశీ రాజ్యాంతర్గత అటవీ ప్రాంతంలో ఒక వేటగాడు విషం పులిమిన బాణాన్ని లేడిపైకి సంధించగా, అది గురితప్పి ఒక మహా వృక్షానికి తగులుతుంది. ఆ దారుణమైన విషప్రభావానికి పూలు, పండ్లతో విరాజిల్లే ఆ చెట్టు కొద్ది రోజుల్లోనే పూర్తిగా ఎండిపోయి మోడైపోయింది. అయితే, ఆ చెట్టు తొర్రలో ఓ చిలుక చాలా కాలంగా నివాసముంటుంది. చెట్టు పచ్చదనాన్ని కోల్పోయి మోడుబారినా... ఆ చిలుక మాత్రం కృతజ్ఞతతో ఆ మోడువారిన తొర్రలోనే ఉండిపోయింది తప్ప వేరొక చెట్టు వద్దకు వెళ్లలేదు.

దేవేంద్రుని పరీక్ష ... చిలుక సమాధానం

చిలుక యొక్క ఈ ఉదాత్తమైన ప్రవర్తనను గమనించిన దేవేంద్రుడు మానవ రూపంలో వచ్చి చిలుకను ప్రశ్నించాడు ... "ఈ అడవిలో ఎన్నో పచ్చని వృక్షాలు, రుచికరమైన ఫలాలు ఉన్నాయి కదా! మరి ఈ ఎండిపోయిన మోడును ఆశ్రయించి ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నావు?" అని అడుగుతాడు. దానికి ఆ చిలుక చిరునవ్వుతో ... "దేవేంద్రా! ఈ చెట్టు పచ్చగా ఉన్నప్పుడు దీని ఫలాలను ఆరగించి కడుపునింపుకున్న తాను... ఇది ఎండిపోగానే వదిలేసి పోవడం కృతఘ్నత కాదా? ఆశ్రయం ఇచ్చిన చెట్టును కష్టకాలంలో విడిచిపెట్టడం ధర్మం కాదు" అని బదులిచ్చింది. మారువేషంలో ఉన్న తన్ను గుర్తించినందుకు, చిలుక నైతిక నిష్టకు ఇంద్రుడు విస్మయం చెందాడు.

అమృత వర్షం ... మోక్ష ప్రాప్తి

చిలుక ధర్మనిష్టకు మెచ్చిన ఇంద్రుడు వరం కోరుకోమనగా, ఆ చిలుక తన స్వార్థం చూసుకోకుండా... "ప్రభూ! నన్ను పెంచి పోషించిన ఈ వృక్షానికి తిరిగి పూర్వ శోభను ప్రసాదించండి" అని వేడుకుంది. చిలుక నిశ్వార్థపూరితమైన కోరికకు సంతుష్టుడైన దేవేంద్రుడు...అమృతంతో ఆ చెట్టు వేళ్లను తడిపి, పూర్వం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ పూలు, పండ్లతో ఆ చెట్టును సశ్యాశ్యామలంగా మార్చాడు. అనంతరం కాలక్రమంలో ఆ చిలుక తన దేహాన్ని త్యజించగా... ఆ చిలుక దేహం నేరుగా స్వర్గలోకాన్ని పొందింది.

మానవ సమాజానికి కనువిప్పు

ఈ పురాణ కథ ద్వారా భీష్మాచార్యుడు ధర్మరాజుకు, అలాగే సమస్త మానవాళికి అత్యంత ముఖ్యమైన సూత్రాలను బోధించాడు. మనకు ఆపదలో సాయం చేసిన వారిని, నీడ నిచ్చిన వారిని లేదా ఆశ్రయమిచ్చిన సంస్థలను కష్టకాలంలో వదిలేయడం మహాపాతకం. సుఖాలు ఉన్నప్పుడు అనుభవించి, కష్టాలు రాగానే ముఖం చాటేసే నైజం మనుషులకు తగదు. ఇతరుల క్షేమం కోరే నిస్వార్థ భక్తి, కృతజ్ఞత మనిషిని ఐహిక బంధాల నుండి విముక్తుడిని చేసి పుణ్యలోకాలకు చేరుస్తుంది. నేటి ఆధునిక కాలంలో స్వార్థంతో మేలు మరచిపోయే మనుషులకు ఈ చిలుక కథ ఒక గొప్ప కనువిప్పు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని, అదే మోక్షానికి మార్గమని ఈ ఆధ్యాత్మిక ఘట్టం స్పష్టం చేస్తోంది. 

Tags:    

Similar News